
వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. యూనివర్స్ బాస్ అని తనకు తానే బిరుదు ఇచ్చుకున్న గేల్ ఇప్పుడు ఆ బ్రాండ్ నేమ్ తో జ్యువెలరీ వ్యాపారంలోకి దిగాడు. తన పేరుతో ప్రింట్ చేసిన గోల్డ్ రింగ్స్ ను ప్రవేశ పెట్టాడు. స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఈ ఉంగరాల ముందు భాగంలో క్రిస్ గేల్ ఫొటోతో పాటు అతని పేరు తెలిపేలా CG అనే ఇంగ్లిష్ క్యాపిటల్ లెటర్స్ తో ముద్రించారు. అలాగే, నాలుగు వైపులా యూనివర్స్ బాస్ అని రాసి ఉంది. రెండు కొనల్లో అతని జెర్సీ నంబర్ 333 తో పాటు లోపలి భాగంలో గేల్ సంతకం ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఉంగరాలను విడుదల చేసిన గేల్ వాటి ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అయితే ఈ గోల్డ్ రింగ్ ఖరీదు మాత్రం ప్రకటించలేదు.