హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న అంతరాష్ట్ర ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ మాఫియాపై తెలంగాణ సీఐడీ కొరడా ఝులిపించింది. దాదాపు 100 కోట్ల భారీ ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసినట్లు సీఐడీ చీఫ్ చారు సిన్హా అధికారికంగా వెల్లడించారు. ఈ అక్రమ నెట్‌వర్క్‌కు సంబంధించి తెలంగాణ సీఐడీ అధికారులు 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల స్థావరాల నుంచి భారీగా బెట్టింగ్ పరికరాలు, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.
దఫాబెట్ యాప్.. స్పెక్టర్ ఇన్ఫోసిస్ లింకులు!
తెలంగాణలో నిషేధిత ‘దఫాబెట్’ (Dafabet) యాప్ ద్వారా ఈ అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలు సాగినట్లు సీఐడీ విచారణలో తేలింది. ఈ దందా వెనుక ఉన్న ప్రధాన నిందితుడు స్పెక్టర్ ఇన్ఫోసిస్ సంస్థ యజమాని కృష్ణా రెడ్డి అని అధికారులు గుర్తించారు.విదేశీ ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి, అమాయక ప్రజలను ఆకర్షించినట్లు విచారణలో తేలింది. ఈ కృష్ణా రెడ్డి కేవలం 2024 నుంచి 2025 మధ్య కాలంలోనే.. అక్రమ బెట్టింగ్ ద్వారా సుమారు రూ. 9.95 కోట్లు సంపాదించినట్లు సీఐడీ చీఫ్ చారు సిన్హా వెల్లడించారు.
►ALSO READ | ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై సీఐడీ పంజా.. 11 మంది అరెస్ట్
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నమోదైన ఈ కేసును సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) లోతుగా విచారిస్తోంది. నిందితులపై కొత్త చట్టం ప్రకారం..BNS-2023 సెక్షన్ 318(4), 111(2)(b),ఐటీ యాక్ట్ (IT Act-2000) సెక్షన్ 66-D , తెలంగాణ గేమింగ్ యాక్ట్ (TSGA) సెక్షన్లు 3, 3(a), 4 కింద అత్యంత కఠినమైన కేసులు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 46 మంది బ్యాంకు ఖాతాదారులు, వారి బ్యాంక్ నెట్‌వర్క్‌లు, మొబైల్ నంబర్లు, సోషల్ మీడియా ప్రొఫైళ్లకు సంబంధించిన కీలక డేటాను సీఐడీ సేకరించింది. ఈ వందల కోట్ల దందాలో జరిగిన బ్యాంక్ లావాదేవీలు, యూపీఐ (UPI) వివరాలు, ఇన్వెస్ట్‌మెంట్ ట్రైల్స్, డిజిటల్ ఫుట్‌ప్రింట్లపై సిట్ (SIT) నిఘా పెట్టింది. ఈ అంతర్జాతీయ బెట్టింగ్ నెట్‌వర్క్ వెనుక ఉన్న ఇతర పెద్ద తలకాయలు, ప్రమోటర్లు, సంస్థల పాత్రపై కూడా విచారణ ముమ్మరంగా కొనసాగుతోందని సీఐడీ చీఫ్ చారు సిన్హా స్పష్టం చేశారు.
