పౌరసత్వ చట్టంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఈ చట్టంతో భారత పౌరులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పౌరసత్వ బిల్లుకు… భారత ముస్లింలకు సంబంధం లేదని అన్నారు. మైనార్టీలను రెచ్చగొట్టి కాంగ్రెస్ పబ్బం గడపాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీలు చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. పాక్ ముస్లింలను చట్టంలో చేర్చలేదని TRS పార్టీ ఆవేదన చెందుతోందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. బిల్లులో ఎక్కడ మత వివక్ష లేదన్నారు.
మత రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పౌరసత్వ బిల్లును రాజకీయం చేస్తోందన్నారు. మోదీ, అమిత్ షాలు తీసుకుంటున్న నిర్ణయాలను విపక్షాలు తట్టుకోలేక అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని లక్ష్మణ్ అన్నారు. బాలాకొట్ దాడుల్లో దోమ, చీమ చనిపోలేదని సీఎం కేసీఆర్ పాకిస్థాన్ భాష మాట్లాడారు. ఏ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వలేదని వ్యతిరేకించారో టీఆర్ఎస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
హైద్రాబాద్, తెలంగాణ లోని ఇతర ప్రాంతాల్లో అక్రమ చొరబాటు దారులు ఉన్నారని, హైదరాబాద్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శిబిరాలు జరుగుతున్నాయని తెలిసిందన్నారు లక్ష్మణ్. వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాల అవకాశవాద రాజకీయాలను ప్రజల ముందుకు తీసుకు వెళతామని చెప్పారు. పౌరసత్వ బిల్లు గురించి ఈ నెలాఖరున రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.


