విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సినిమాలతోనే కాదు, సామాజికంగా, రాజకీయంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఆయన చేసే విమర్శనాత్మక పోస్టులు తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి.. లేటెస్ట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించిన చేసిన ఆయన పోస్ట్ రాజకీయ దుమారం రేపుతోంది. గతంలో సనాతన ధర్మం విషయంలోనూ వీరిద్దరి మధ్య నెట్టింట పెద్ద వారే నడిసింది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అంశంపై వీరిద్దరూ తలపడటం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రతిపక్షాలదే పాపం..
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక 'నారీ శక్తి వందన్ అధినియం' అమలులో జరుగుతున్న ఆలస్యానికి ప్రతిపక్షాల తీరే కారణమని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం చిత్తశుద్ధితో అడుగులు వేస్తుంటే, ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశాభివృద్ధి కంటే రాజకీయ లెక్కలకే వారు ప్రాధాన్యం ఇస్తున్నారని, మహిళల పట్ల వారికి గౌరవం లేదని పవన్ పేర్కొన్నారు.
సౌత్ ఇండియా హక్కుల సంగతేంటి?.
పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం అబద్ధాలు చెప్పకండి అంటూ సూటిగా విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందిందని, దానిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోంది ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా, రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తో ముడిపెట్టడం వెనుక ఉన్న అసలు ప్రమాదాన్ని ప్రకాష్ రాజ్ ఎత్తి చూపారు.
నాతో చర్చకు సిద్ధమా..
పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గిపోతుందని, ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరిగి దక్షిణాది గొంతు నొక్కేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. మిమ్మల్ని గెలిపించి డిప్యూటీ సీఎం చేసిన ఆంధ్ర ప్రజల హక్కులను, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడతారా? అని ప్రశ్నిసించారు. తనతో చర్చకు సిద్ధమా అంటూ #justasking హ్యాష్ ట్యాగ్‌తో సవాల్ విసిరారు.
Please stop lying to citizens just to please Modi. Women reservation bill was approved in 2023 itself. It can be passed even now . But your gang wanted to pass Delimitation bill which would weaken the representation of South Indian states including Andhra Pradesh. Requesting you… https://t.co/LyQGy2Fh8E
— Prakash Raj (@prakashraaj) April 18, 2026
గతంలో సనాతన ధర్మం విషయంలోనూ వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశ భవిష్యత్తును, దక్షిణాది రాజకీయ అస్తిత్వాన్ని ప్రభావితం చేసే 'పునర్విభజన' అంశంపై వీరిద్దరూ తలపడటం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎన్డీయే భాగస్వామిగా పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని సమర్థిస్తుండగా, దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవం పేరిట ప్రకాష్ రాజ్ చేస్తున్న పోరాటం ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య సాగుతున్న ఈ పోరు కేవలం ట్వీట్లకే పరిమితమవుతుందా లేక క్షేత్రస్థాయి చర్చకు దారితీస్తుందా అన్నది చూడాలి.

