కొత్త గనులు రాకుంటే సింగరేణి మనుగడ కష్టం.. ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు

 కొత్త గనులు రాకుంటే సింగరేణి మనుగడ కష్టం.. ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు

కోల్​బెల్ట్, వెలుగు: కొత్త బొగ్గు గనులు రాకపోతే సింగరేణి మనుగడ కష్టమని  సింగరేణి కాలరీస్​ ఎంప్లాయీస్ యూనియన్ ​(సీఐటీయూ) స్టేట్​ ప్రెసిడెంట్​ తుమ్మల రాజారెడ్డి పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు బ్లాక్​లను కేటాయించకుండా కేంద్రం వేలంలో ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శనివారం మందమర్రిలోని సీఈఆర్​క్లబ్​లో రెండు రోజుల పాటు జరిగే సీఐటీయూ 17వ రాష్ట్ర మహాసభలను ప్రారంభించిన అనంతరం ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  సింగరేణి బొగ్గు, విద్యుత్ ను వాడుకోగా.. రాష్ట్ర విద్యుత్ సంస్థలు రూ.48వేల కోట్ల బకాయిలు పడ్డాయన్నారు.  బకాయిలు రాకుంటే సింగరేణి అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి గెలిచిన కార్మిక సంఘాలు యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ కార్మికుల ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నాయని మండిపడ్డారు. మున్సిపల్​ఎన్నికలు రాగానే  ప్రభుత్వానికి కార్మికులు గుర్తుకు వచ్చారన్నారు. సింగరేణి పై చర్చించేందుకు ఈనెల 13న ఏఐటీయూసీ,ఐఎన్టీయూసీ సంఘాలతో సర్కార్ సమావేశం నిర్వహించి చర్చించిన అంశాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. వేజ్​బోర్డు మెంబర్,యూనియన్​ జనరల్​సెక్రటరీ మందా నర్సింహారావు, యూనియన్​ గౌరవాధ్యక్షుడు వడ్లకొండ ఐలయ్య పాల్గొన్నారు.