ట్యాంక్ బండ్ పై గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు

ట్యాంక్ బండ్ పై గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు

ఎప్పటి లాగానే గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశుడిని కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం ట్యాంక్ బండ్ పై 8 క్రేన్లు, ట్యాంక్ బండ్ చుట్టూ 22 క్రేన్ లను  సిద్ధంగా ఉంచారు. ఇవికాక ఎన్టీఆర్ మార్గం మీద మరో 9 క్రేన్లు, పీపుల్స్ ప్లాజాలో 3 క్రేన్లు, రెండు బేబీ పాండ్ల వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేశారు.

ఈనెల 9న..  

ఈనెల 9న గణేశ్ నిమజ్జనం సందర్భంగా వినాయక శోభాయాత్రల నిర్వహణకు సంబంధించిన రూట్ మ్యాప్ వివరాలను హైదరాబాద్ నగర పోలీసులు వెల్లడించారు. ఆయా మార్గాల్లో శుక్రవారం రోజున ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దీన్ని అనుసరించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం సాగించాలని సూచించారు.  ఆ రోజున ప్రధాన ఊరేగింపు మార్గంలో విగ్రహాల శోభాయాత్రకు తప్ప, ఇతర ట్రాఫిక్ కు అనుమతి ఉండదని తెలిపారు.  అవసరమైతే ట్రాఫిక్ ఆంక్షలు మరిన్ని రూట్లకు పొడిగిస్తామన్నారు. 

ఊరేగింపు మార్గాలు ఇవీ.. 

  • ప్రధాన ఊరేగింపు కేశవగిరి నుంచి ప్రారంభమవుతుంది. చాంద్రాయణగుట్ట  ఎడమ మలుపు,  MBNR X రోడ్,  ఫలక్‌నుమా ROB,  అలియాబాద్,  నాగుల్చింత,  చార్మినార్ , మదీనా,  అఫ్జల్‌గంజ్, SA బజార్,  M.J.మార్కెట్ , అబిడ్స్, బర్కర్‌షీర్,  ఎన్టీఆర్ మార్గ్, PVNR మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపునకు వినాయక శోభాయాత్రలు సాగుతాయి. 
  • సికింద్రాబాద్ ప్రాంతం నుంచి బయలుదేరే ఊరేగింపులు ఆర్‌పీ రోడ్,  ఎంజీ రోడ్,  కర్బలా మైదాన్,  కవాడీగూడ,  ముషీరాబాద్ ఎక్స్ రోడ్, ఆర్టీసీ ఎక్స్ రోడ్,  నారాయణగూడఎక్స్ రోడ్,   హిమాయత్‌నగర్ 'వై' జంక్షన్  మీదుగా వెళ్లి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి. 
  • చిల్కలగూడ ఎక్స్ రోడ్స్ నుంచి వచ్చే విగ్రహాలు ముషీరాబాద్‌లో చేరుతాయి. గాంధీ హాస్పిటల్ మీదుగా, ఈస్ట్‌జోన్ నుంచి  మొదలయ్యే ఊరేగింపులు ఉప్పల్,  రామంతపూర్,  6 నెం. జంక్షన్, అంబర్‌పేట్ శివం రోడ్,  ఓయూ వద్ద ఎన్‌సీసీ దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ , హిందీ మహావిద్యాలయ ఎక్స్ రోడ్స్,  ఫీవర్ హాస్పిటల్, బర్కత్‌పురా ఎక్స్ రోడ్స్, నారాయణగూడఎక్స్ రోడ్స్ నుంచి వెళ్లి RTC X రోడ్స్ నుంచి వచ్చే ఊరేగింపులో కలుస్తాయి. 
  • దిల్ సుఖ్ నగర్ నుంచి మొదలయ్యే శోభా యాత్రలు IS సదన్  సైదాబాద్,  చంచల్ గూడా, నల్గొండ X రోడ్ల నుంచి వచ్చే ఊరేగింపులో చేరుతాయి. కొన్ని పెద్ద విగ్రహాలు మూసారాంబాగ్ మీదుగా అంబర్ పేట్ వైపు వెళ్తాయి. 
  • తార్నాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రోడ్డు, అడిక్‌మెట్ మీదుగా విద్యానగర్ మీదుగా ఫీవర్ హాస్పిటల్ వద్ద ఊరేగింపులోకి చేరుతాయి. 
  • టోలీచౌకి, రేతిబౌలి , మెహదీపట్నం వైపు నుంచి వచ్చే గణేశ్ ఊరేగింపులు మాసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్  నిరంకారి భవన్ , పాత PS సైఫాబాద్,  ఇక్బాల్మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు వెళ్తాయి. 
  • ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట,  పంజాగుట్ట,  ఖైరతాబాద్‌ మీదుగా మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్‌లో చేరి ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంటాయి. 
  • టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ వైపు నుంచి వచ్చే విగ్రహాలు  సీతారాంబాగ్,  బోయిగూడ కమాన్,  వోల్గా హోటల్, గోషామహల్ బరాదరి , అలాస్కా మీదుగా ఎమ్‌జె మార్కెట్‌లోని ప్రధాన ఊరేగింపులో చేరుతాయి. అక్కడి నుంచి అబిడ్స్ , బషీర్‌బాగ్,  లిబర్టీ,  అంబేద్కర్ విగ్రహం,  ఎన్టీఆర్ మార్గ్, PVNR మార్గ్ (నెక్‌లాస్ రోడ్) వైపు వెళ్తాయి.