V6 News

పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. 70‌‌‌‌‌‌‌‌-80 రోజులకు సరిపడా స్టాక్ ఉంది: స్టీఫెన్‌‌‌‌ రవీంద్ర

పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. 70‌‌‌‌‌‌‌‌-80 రోజులకు సరిపడా స్టాక్ ఉంది: స్టీఫెన్‌‌‌‌ రవీంద్ర
  • రాష్ట్రవ్యాప్తంగా సరఫరా 126% పెంపు
  • రంగంలోకి 3,100 ఇంధన ట్యాంకర్లు..
  • 151 శాతం పెరిగిన డీజిల్ సరఫరా 
  • పుకార్లను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ఇంధన సరఫరాను 126 శాతం మేర పెంచినట్టు సివిల్​ సప్లయ్స్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర వెల్లడించారు. ఇటీవల పెట్రోల్ బంకుల వద్ద ఏర్పడిన రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు.  మార్కెట్‌‌‌‌లో తగిన నిల్వలు ఉంచాలని చమురు కంపెనీలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసినట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.–

రాష్ట్రవ్యాప్తంగా 3,100 ఇంధన ట్యాంకర్లను రంగంలోకి దించినట్టు సివిల్​ సప్లయ్స్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర వెల్లడించారు. డీలర్ల నుంచి ముందస్తు ఆర్డర్లు సేకరించి సరఫరాను వేగవంతం చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 70–80 రోజులకు సరిపడా ఇంధన స్టాక్‌‌‌‌ ఉన్నదని ఆయన వెల్లడించారు. పెట్రోల్ బంకుల్లో నిల్వలు తక్కువ కాకుండా ఉండేందుకు ప్రతి మూడు గంటలకు ఒకసారి సమాచారం సేక రిస్తున్నామన్నారు. 

రోజువారీ టెలికాన్ఫరెన్స్‌‌‌‌ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు కమిషనర్తెలిపారు. ముఖ్యంగా రైతులకు ఇబ్బంది లేకుండా ఇంధనం అందేలా ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు.  ఏప్రిల్ 27 నాటికి రాష్ట్రంలో డీజిల్ పంపిణీ 151 శాతం పెరిగి 7,348 కిలోలీటర్ల నుంచి 18,449 కిలో లీటర్లకు చేరుకున్నదని వివరించారు. పెట్రోల్ పంపిణీ కూడా 95 శాతం పెరిగి 5,883 కిలో లీటర్ల నుంచి 11,490 కిలోలీటర్లకు పెరిగిందని తెలిపారు. పెట్రోల్, డీజిల్​ కలిపి మొత్తం 29,939 కిలో లీటర్లు సరఫరా చేసినట్టు కమిషనర్​ వెల్లడించారు.

  • హైదరాబాద్‌‌‌‌లో కొరత రాకుండా 43శాతం పెంపు

హైదరాబాద్‌‌‌‌లో కొరత రాకుండా ఇంధన సరఫ రాను 43 % పెంచినట్టు స్టీఫెన్‌‌‌‌ రవీంద్ర తెలిపా రు. డీజిల్ నిల్వలు 46 శాతం, పెట్రోల్ నిల్వలు 40 శాతం మేర పెరిగినట్టు చెప్పారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని, అవసరానికి మించిన కొనుగోళ్లు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి సమస్యలున్నా హెల్ప్‌‌‌‌లైన్ నంబర్ 1967కు సంప్రదించాలని సూచించారు. 

కొన్ని ప్రత్యేక కారణాలతోనే పెట్రోల్ బంకుల వద్ద అనూహ్యంగా రద్దీ పెరిగిందని చెప్పారు.  పరిశ్రమల కోసం ఉపయోగించే డీజిల్ ధరను లీటరుకు రూ.150కు పెంచడంతో, వ్యాపారులు సాధారణ బంకుల వద్ద తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు చేయడం ఒక కారణమని తెలిపారు. అలాగే పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్రల్లో సరఫరా సమస్యలు ఉండటంతో.. సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నిర్మల్ ప్రాంతాలకు ఇతర రాష్ట్రాల వాహనదారులు తరలివస్తున్నారని, ఎన్నికల అనంతరం ధరలు పెరుగుతాయనే పుకార్ల కారణంగా ప్రజలు అవసరానికి మించి నిల్వ చేసుకోవడం డిమాండ్‌‌‌‌ పెరగడానికి మరో కారణమని వెల్లడించారు.