- ఒకవైపు సీఎంఆర్ రూల్స్‌పై మిల్లర్ల నిరసన
- ఫోర్స్ గా నైనా అన్‌లోడ్ చేయాలని సివిల్ సప్లయ్నిర్ణయం
- జిల్లాలో 90 వేల టన్నుల గోడౌన్లు గుర్తింపు
- నేటి నుంచి వడ్ల కాంటా
యాదాద్రి, వెలుగు : సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) తీసుకోవడంలో మిల్లర్లు స్పందించకపోవడంతో సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ గోడౌన్లను ఉపయోగించి వడ్లను నిల్వ చేయనుంది. ఇప్పటికే నిరసనలో ఉన్న మిల్లర్లతో ఒక దఫా చర్చలు జరిపినా, వారు సహకరించకపోతే బలవంతంగా మిల్లులను ఓపెన్ చేయించి వడ్లు స్టోర్ చేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు.
సీఎంఆర్ విషయంలో కొందరు మిల్లర్లు ఒత్తిడి చేసినా తమ వైఖరి మార్చుకోవడం లేదు. సీజన్ ప్రారంభంలోనే కొన్ని డిమాండ్లు ముందుకు తెచ్చి సీఎంఆర్ వడ్లు తీసుకోమంటూ కొర్రీలు పెడుతున్నారు. ఈసారి యాసంగి సీజన్ వడ్ల కొనుగోలు ప్రారంభం కాగానే రారైస్ కాకుండా బాయిల్డ్ రైస్ ఇస్తామని అంటున్నారు. అంతేకాకుండా తమ ఆస్తుల వివరాలు ఇవ్వడానికి కూడా సుముఖత చూపడం లేదు.
యాదాద్రి జిల్లాలో ఈ సీజన్‌లో 3.14 లక్షల ఎకరాల్లో వరి పండిందని, 6.92 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 4.50 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని భావిస్తున్నారు. కొనుగోలు సెంటర్లలో కొన్నింటిని ఇప్పటికే ప్రారంభించారు. మిల్లర్లు సీఎంఆర్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నందున ప్రత్యామ్నాయంగా అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 60 వేల టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు, మరో 30 వేల టన్నుల సామర్థ్యం గల ఇతర గోడౌన్లను గుర్తించి వాటిలో వడ్లను నిల్వ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా అధికారులు చర్చలు
జిల్లా అధికారులు మిల్లర్లతో ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిపారు. బుధవారం నుంచి కొనుగోలు చేసిన వడ్లను లారీల్లో నింపి మిల్లులకు పంపిస్తామని స్పష్టం చేశారు. మరోసారి చర్చలు జరిపే అవకాశం కూడా ఉందని తెలిపారు. అయినా మిల్లర్లు సహకరించకపోతే పోలీసుల సహకారంతో మిల్లుల తాళాలు తీయించి వడ్లను అన్‌లోడ్ చేయించి నిల్వ చేస్తామని హెచ్చరించారు.సీఎంఆర్ విషయంలో గతంలో ఉన్న నిబంధనలే ప్రస్తుతం కూడా అమలులో ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఏదైనా మిల్లర్ డిఫాల్టర్‌గా తేలితే ‘ప్రో-రేటా బేసిస్’పై మిల్లర్ల అసోసియేషన్ నుంచి మొత్తం డబ్బు వసూలు చేసే నిబంధనలు ఇప్పటికే ఉన్నాయని వివరించారు.
వడ్లు పంపిస్తాం
ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. బుధవారం నుంచి వడ్ల కొనుగోలు ప్రారంభిస్తాం. లారీల్లో నింపి మిల్లులకు పంపిస్తాం. వడ్లు అన్‌లోడ్ చేసుకోవాలని మిల్లర్లకు ఇప్పటికే చెప్పాం. వారు దించుకోకపోతే అవసరమైతే పోలీస్ ఫోర్స్‌తో మిల్లుల్లో అన్‌లోడ్ చేయిస్తాం : -యాదాద్రి అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి

