
- వడ్లు దించుకోనందుకు మిల్లర్లకు జారీ చేసిన సివిల్ సప్లయ్ అధికారులు
- వారంలో రిప్లై ఇవ్వాలని ఆర్డర్స్
- నెక్స్ట్ సీజన్లో వడ్లు కేటాయించబోమని వార్నింగ్
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో లోడ్ గా వెళ్లిన వడ్లను దించుకోకుండా ఇబ్బందులు పెడుతున్న మిల్లర్లకు సివిల్సప్లయ్డిపార్ట్మెంట్నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న మిల్లర్లలో జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మార్త వెంకటేశ్ సహా 17 మంది ఉన్నారు. ఈ యాసంగి సీజన్లో 4.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని సివిల్సప్లయ్డిపార్ట్మెంట్టార్గెట్గా నిర్ణయించుకుంది. 39 మిల్లులకు వాటి కేపాసిటీకి అనుగుణంగా సీఎంఆర్కోసం వడ్లు ఇవ్వాలి. అయితే ఇప్పటివరకు 3.30 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసింది.
కొందరు మిల్లర్లు తమ మిల్లుల కెపాసిటీకి అనుగుణంగా నిర్దేశించిన కోటా వడ్లను దించుకోవడం లేదు. దీంతో టార్గెట్చేరుకోవడంలో సివిల్‌సప్లయ్ డిపార్ట్మెంట్ ఇబ్బందులు పడుతోంది. దీంతో ఆఫీసర్లు పలుమార్లు హెచ్చరించినా మిల్లర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజాపేటకు చెందిన మణికంఠ రైస్‌మిల్లుకు 1.40 లక్షల క్వింటాళ్ల వడ్లు దించుకోవాలని టార్గెట్ పెడితే.. కేవలం 41 వేల క్వింటాళ్లు మాత్రమే తీసుకున్నారు.
అదేవిధంగా చౌటుప్పల్‌కు చెందిన మల్లికార్జున రైస్ మిల్లుకు 1.40 లక్షల టన్నులు లక్ష్యం ఇవ్వగా.. 60 వేల టన్నులు మాత్రమే దించుకున్నారు. ఇలా 17 మంది మిల్లర్లు వడ్లు దించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వడ్ల కొనుగోళ్లలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఆయా మిల్లులకు అడిషనల్ కలెక్టర్వీరారెడ్డి నోటీసులు జారీ చేశారు. వడ్లు దించుకోనందుకు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. స్పందించని మిల్లర్లకు వచ్చే సీజన్ నుంచి సీఎంఆర్ కోసం వడ్లు ఇవ్వమని ఆయన హెచ్చరించారు.