కార్పొరేట్ ఫీజులతో సామాన్యులకు ‘ఖరీదైన’ న్యాయం

కార్పొరేట్ ఫీజులతో సామాన్యులకు ‘ఖరీదైన’ న్యాయం

న్యూఢిల్లీ: లాయర్లను హక్కుల పోరాట యోధులుగా అభివర్ణించారు జస్టిస్ ఎన్వీ రమణ. లాయర్లు న్యాయ రథంలో ముఖ్యమైన చక్రం అని అన్నారు.  శనివారం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సన్మానం చేసింది. ఈ సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజుతో పాటు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బార్‌‌ కౌన్సిల్ ప్రతినిధులు, పలువురు న్యాయమూర్తులు, లాయర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ ఎన్వీ రమణ.. తన జీవితంలో జడ్జిగా కంటే లాయర్‌‌గానే ఎక్కువ కాలం గడిపానన్నారు. ప్రస్తుతం కరోనా సమయంలో లాయర్లు టెక్నాలజీని వాడుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.

గతంలో లా అనేది డబ్బున్నోళ్ల ప్రొఫెషన్‌గా ఉండేదని, ఇప్పుడు సామాన్యులకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయని జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు. అయితే ఇప్పటికీ లీగల్ ప్రొఫెషన్ పట్టణ ప్రాంతాల వారికే పరిమితంగా ఉన్నట్టు కనిపిస్తోందని అన్నారు. లా ఫ్రొఫెషన్‌లో కార్పొరేటైజేషన్‌ గురించి మాట్లాడుతూ.. లాయర్లకు కొత్త కంపెనీలు అవకాశాలు కల్పిస్తున్నాయని, లా కంపెనీలు రావడం వల్ల యువకులు ఈ ప్రొఫెషన్‌లోకి వస్తున్నారని అన్నారు. కానీ దీని వల్ల సామాన్యులకు న్యాయం దూరం అవుతోందని, వాళ్లు ఆ కార్పొరేట్‌ ఫీజులు భరించలేరని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.