చేర్యాల, వెలుగు: వరంగల్ డిక్లరేషన్ ను గ్రామ గ్రామాన ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. ఆదివారం సిద్దిపేట జిల్లా దుల్మిట్ట మండలం కూటిగల్లో రచ్చబండ నిర్వహించడానికి వెళుతున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డిని పొన్నాల లక్ష్మయ్య వర్గీయులు కూటిగల్ గ్రామ సమీపంలో అడ్డుకున్నారు. దుల్మిట్ట మండలంలో రచ్చబండ నిర్వహించే హక్కు నీకు లేదని, వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవద్దంటూ ప్రతాపరెడ్డి వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ప్రతాపరెడ్డి వర్గీయులు సైతం వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకరినొకరు తోసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు విసిరిన రాళ్లు ప్రతాపరెడ్డి కారుకు తగిలి అద్దాలు పగిలిపోయాయి. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు వచ్చి పొన్నాల వర్గీయులను మద్దూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ప్రతాపరెడ్డి కూటిగల్, కొండాపూర్, దుల్మిట్ట ల్లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పాటుపడుతుంటే ఓర్వలేక కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పొన్నాల లక్ష్మయ్య వర్గీయులు టీఆర్ఎస్ కోవర్టులుగా పనిచేస్తూ పార్టీని బలహీనపరచాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే తాను 80 గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే పొన్నాల లక్ష్మయ్య మాత్రం పది గ్రామాలు కూడా పూర్తి చేయకుండా అమెరికా వెళ్లిపోయారన్నారు. గత ఎన్నికల్లో సైతం పొన్నాల వర్గీయులు టీఆర్ఎస్ కు మద్దతిచ్చి పార్టీకి కోవర్టులుగా పనిచేసిన విషయం అందరికీ తెలుసన్నారు. కూటిగల్లో రచ్చబండ నిర్వహించకుండా పొన్నాల వర్గానికి చెందిన ఐదుగురు నేతలతోపాటు మరి కొందరు తనపై దాడికి పాల్పడ్డారని, వీరిపై మద్దూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

