గత వారం నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతం దిగుతుండగా తప్పిపోయిన భారతీయ పర్వతారోహకుడు, రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌కు చెందిన అనురాగ్ మాలూ 72గంటల తర్వాత సజీవంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ప్రఖ్యాత పోలిష్ పర్వతారోహకుడు ఆడమ్ బిలెక్కీ అనురాగ్ మాలూను అన్నపూర్ణ పర్వతంలోని పగుళ్ల నుండి సహాయక సిబ్బంది రక్షించడాన్ని చూడవచ్చు.
అనురాగ్ మాలూను సురక్షితంగా తీసుకురావడంపై స్పందించిన ఎవరెస్ట్ టుడే.. అద్భుతమైన ధైర్యసాహసాలు చేసి అతన్ని తీసుకువచ్చినందుకు ధన్యావాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది. మీ సహాయం అసాధారణమైనది కాదని కొనియాడింది. అనురాగ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని, కానీ అతని పరిస్థితి విషమమని అధికారులు వెల్లడించారు.
అనురాగ్ గతంలో REX కరమవీర్ చక్రను పొందాడు. భారతదేశం నుంచి 2041 అంటార్కిటిక్ యూత్ అంబాసిడర్ అయ్యాడు. ఈ సంవత్సరం, అతను అన్నపూర్ణ పర్వతం, మౌంట్ లోట్సే, ఎవరెస్ట్‌లను జయించాలనే లక్ష్యంతో ఉన్నాడు. అంతలోనే పోఖ్రాన్ లో 6,000 మీటర్ల ఎత్తు నుంచి 300 మీటర్ల పగుళ్లలో పడిపోయాడు.

