
ఆర్టీసీ కార్మికుల వ్యవహారంలో సీఎం కేసీఆర్ వ్యవహారశైలి మారుతుందని జేఏసీ సంఘాలు, పలు పార్టీల నేతలు, కార్మికులు ఆశించారు. కానీ కేసీఆర్ మాత్రం కఠినంగా వ్యహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కార్మికుల్ని తొలగించి నూతన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల నియమించాలని రవాణాశాఖ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించడం, నూతన కార్మికులకు నియామకం ప్రధాన ఎజెండాగా చర్చించారు. ఈ భేటీలో కొత్త కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలను ఏ ప్రాతిపదికన తీసుకోవాలనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో ఫైల్ ను సిద్ధం చేయాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మకు సూచించారు. అంతేకాదు ఆర్టీసీ కండక్టర్లను ఎక్కవ సంఖ్యలో, డ్రైవర్లను తక్కువగా రిక్రూట్ చేసేలా కొత్త పాలసీని తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. నియామకం ఔట్ సోర్సింగ్ విధానంలోనా? లేక పర్మినెంట్ ఎంప్లాయ్స్ గానా? అనే సందిగ్ధం నెలకొనగా కేసీఆర్ మాత్రం పర్మినెంట్ ఎంప్లాయ్స్ గా నియమించుకుంటామని అనే అభిప్రాయంతో ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
తాము ఎక్కిన చెట్టుకొమ్మనే నరుక్కన్న ఆర్టీసీ కార్మికులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి పండగ సీజన్ లో ప్రజల్ని ఇబ్బందిపెడుతున్నట్లు రవాణాశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం అన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వ భవిష్యత్ కార్యచరణ ఏంటనేది రెండుమూడు రోజుల్లో స్పష్టమైన అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.