కొత్త సెక్రటేరియట్ లో మందిరం, మసీదులు, చర్చిని నిర్మిస్తాం: కేసీఆర్

కొత్త సెక్రటేరియట్ లో మందిరం, మసీదులు, చర్చిని  నిర్మిస్తాం: కేసీఆర్

హైదరాబాద్: కొత్తగా నిర్మించే సెక్రటేరియట్‌లో మందిరం, మసీదులు, చర్చిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొత్త సెక్రటేరియట్ లో మసీదుల నిర్మాణం, ఇతర అంశాలపై ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో శ‌నివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అంశాలపై వారితో కూలంకషంగా చర్చించారు. వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. కొత్తగా నిర్మించే సెక్రటేరియట్‌లో మందిరం, మసీదులు, చర్చిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని తెలిపారు. పాత భవనాలు కూల్చివేస్తున్న సందర్భంలో మందిరం, రెండు మసీదులకు నష్టం వాటిల్లిందని, వాటిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో అన్ని సౌకర్యాలతో నిర్మిస్తామని కేసీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా.. ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేస్తామని, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు:

  •  పాత సెక్రటేరియట్ భవనాలు కూల్చి వేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న మందిరం, రెండు మసీదులకు నష్టం వాటిల్లింది. వాటిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో అన్ని సౌకర్యాలతో నిర్మించాలని నిర్ణయించాం.
  • ఒక్కొక్కటి 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇమామ్ క్వార్టర్ తో సహా రెండు మసీదులు (మొత్తం 1500 చదరపు అడుగులు) ప్రభుత్వం నిర్మిస్తుంది. పాత సెక్రటేరియట్ లో ఉన్న స్థలంలోనే మసీదుల నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత మసీదులను వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తుంది.
  •  1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మందిరం నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుంది. నిర్మాణం పూర్తయ్యాక దేవాదాయ శాఖకు మందిరాన్ని అప్పగిస్తుంది.
  •  కొత్త సెక్రటేరియట్ ప్రాంతంలో తమకు కూడా ప్రార్థనా మందిరం కావాలన్న క్రిస్టియన్ల కోరిక మేరకు చర్చిని కూడా ప్రభుత్వం నిర్మిస్తుంది.
  • తెలంగాణ రాష్ట్రం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుంది. పరమత సహనం పాటిస్తుంది. గంగా జమునా తహజీబ్ కు ప్రతీక. అందుకే కొత్త సెక్రటేరియట్ లో అన్ని మతాల ప్రార్థనా మందిరాలు నిర్మిస్తాం. అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్నింటికి ఒకే రోజు శంకుస్థాపన చేస్తాం.