యాసంగిలో వరి వద్దే వద్దు

యాసంగిలో వరి వద్దే వద్దు

హైదరాబాద్‌‌, వెలుగు: యాసంగిలో వరి సాగు వద్దే వద్దని, అయితే ఇప్పటికిప్పుడు వరి వేయొద్దంటే రైతులు వినరు కాబట్టి... వారిని దశల వారీగా పంట మార్పిడి వైపు మళ్లించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారం. మంగళవారం తెలంగాణ భవన్‌‌లో నిర్వహించిన టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీ మీటింగ్‌‌లో రెండు గంటలకు పైగా ఆయన మాట్లాడారు. బాయిల్డ్‌‌ రైస్‌‌ కొనేది లేదని కేంద్రం చెప్తోందని.. కానీ మన దగ్గర యాసంగిలో ఏ రకం వరి వేసినా, బాయిల్డ్‌‌ రైస్ గానే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అందుకే యాసంగిలో వరి వద్దని రైతులను చైతన్యం చేయాలని, రాష్ట్రంలో పండే మొత్తం పంటను కొనే పరిస్థితి లేదని చెప్పాలన్నారు. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలే కథానాయకులు కావాలన్నారు. రెండు, మూడు సీజన్లు ప్రయత్నిస్తే రైతుల్లో తప్పకుండా మార్పు వస్తుందన్నారు. ఒకవేళ యాసంగిలో వరి వేసినా ప్రభుత్వం కొనదని తెలిస్తే.. నాట్లు వేయడానికి ఎవరూ సాహసించబోరని సీఎం చెప్పినట్టు తెలిసింది. 

సోషల్ మీడియాలో వెనుకబడ్డాం...

ఎమ్మెల్యేలు దూకుడుగా, చురుకుగా ఉండాలని కేసీఆర్ సూచించారు. తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తే నష్టపోతారని హెచ్చరించారు. రాజకీయాలతో పాటు ప్రజలకు సంబంధించిన అంశాల్లోనూ వేగంగా స్పందించాలన్నారు. సోషల్‌‌ మీడియాలో పార్టీ వెనుకబడి ఉందని.. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సోషల్‌‌ మీడియాను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు దీని ద్వారా ప్రభుత్వం చేసే మంచి పనులతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు సమాధానాలు ఇవ్వాలని చెప్పారు. పార్టీ ఆఫీసులు ప్రారంభించిన తర్వాత కార్యకర్తలకు నిరంతర శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. వడ్ల కొనుగోళ్లపై ఎక్కడికక్కడ కేంద్ర విధానాలను ఎండగట్టాలన్నారు.