సెక్రటేరియట్  జల్ది కట్టాలె

సెక్రటేరియట్  జల్ది కట్టాలె

నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం

బిల్డింగ్​ ముందు వాన నీళ్లు ఆగొద్దు .అవసరమైన సామగ్రి .ముందే తెచ్చి పెట్టుకోవాలి.అడ్వాన్స్‌‌డ్‌‌ టెక్నాలజీ వాడుకోవాలని సూచన .పార్కింగ్‌‌ వ్యవస్థ, హెలిప్యాడ్‌‌ నిర్మాణం గురించి ఆరా..మూడు గంటలు కలియతిరిగిన కేసీఆర్.. అక్కడే రివ్యూ

హైదరాబాద్, వెలుగు:  కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీర్లు, ఆఫీసర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ‘‘అనుకున్న గడువులోగా నిర్మాణం పూర్తి చేయలేరా? ఇంకెంత టైం పడుతుంది? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం వస్తే తొందరగా పూర్తవుతుంది?’’ అని సీఎం అడిగినట్లు తెలిసింది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాలని, అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ వాడుకుని వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. శనివారం సెక్రటేరియట్ ఏరియా అంతా కలియ తిరిగిన సీఎం.. నిర్మాణం జరుగుతున్న తీరును దాదాపు 3 గంటలపాటు పరిశీలించారు. పనుల పురోగతిపై ఇంజనీర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు, సీఎస్ సోమేశ్ కుమార్, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్కిటెక్టులతో అక్కడే రివ్యూ చేశారు.

ఇంకా ఐదంతస్తులు కట్టాలె

అమ్మవారి గుడి, చర్చి, మసీదు, గురుద్వార్ నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టాలని ఇంజనీర్లు, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ స్లాప్ పూర్తయిందని, ఇంకా ఐదు అంతస్తులు నిర్మించాల్సి ఉందని అధికారులు వివరించారు. కరోనా సెకండ్ వేవ్, వర్షకాలం కావడంతో పనులకు కొంత ఇబ్బంది కలిగినట్లు సీఎంతో మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. నవంబర్ చివరి నాటికి షాపూర్జీ పల్లోంజీ తో ఒప్పంద గడువు ముగుస్తుందని, అయితే నిర్మాణం పూర్తయ్యేందుకు మరో ఏడు నెలలు టైం పట్టే అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్పినట్లు సమాచారం. పనులు తొందరంగా పూర్తయ్యేందుకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. 

పటిష్ట డ్రైనేజీ ఉండాలె

ఏడేండ్ల స్వరాష్ట్రంలో సాగుతున్న ఆదర్శమైన పాలనకు కేంద్ర బిందువుగా ఉండేలా, సిబ్బంది మరింత ప్రశాంతంగా విధులు నిర్వహించేలా సెక్రటేరియట్‌ ఉండబోతోందని సీఎం అన్నారు. సెక్రటేరియట్‌ ముందు, చుట్టు పక్కల వాన నీళ్లు ఆగకుండా పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని, పరిసరాలు శుభ్రంగా ఉండేలా, ఎక్కడికక్కడ నీరు తరలిపోయేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాంక్రీట్‌ పనులు పూర్తయ్యేలోగా అవసరమైన సామన్లను తెప్పించుకోవాలని, దర్వాజలు, కిటికీలు, ఇతర ఫర్నిచర్‌, నిర్మాణ సామగ్రి, ఇంటీరియర్‌ మెటీరియల్‌ ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. తర్వాత దేశవిదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం నిర్మిస్తున్న వెయింట్‌ హాల్‌, విజిటర్స్‌ కూర్చునే ప్రదేశాలను పరిశీలించారు. పార్కింగ్‌ వ్యవస్థ గురించి ఆరా తీశారు. హెలిప్యాడ్‌ నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, వీఐపీల కోసం అవసరమైతే బ్యాటరీతో నడిచే వెహికల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. సెక్రటేరియేట్​బయట రెయిలింగ్ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించిన కేసీఆర్.. మెయిన్ గేటు ఎలా నిర్మిస్తే బాగుంటుందనే దానిపై వెంట వచ్చిన మంత్రులు, ఆఫీసర్లతో చర్చించారు. నిర్మాణ వ్యయం పెరుగుతుందని షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులు సీఎం దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. ప్రహరీలకు పెట్టాల్సిన లైట్​ పోస్టులపైనా కేసీఆర్ సూచనలిచ్చారు.