ఎర్లీ ఖరీఫ్ కొండపోచమ్మకేనా.?

ఎర్లీ ఖరీఫ్ కొండపోచమ్మకేనా.?
  • ఎస్సారెస్పీలో నీళ్లున్నా ఆయకట్టుకు విడుదల చేయని సర్కారు
  • రంగనాయక సాగర్‌‌‌‌, కొండపోచమ్మకు మిడ్‌‌‌‌ మానేరు నీళ్లు
  • వానాకాలం పంటలకు ముందే నీళ్లిస్తామన్న హామీ వట్టిమాటే?
  • ఇప్పటికీ వానాకాలం యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ ఖరారు కాలే..

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వానాకాలం పంటలకు ముందుగానే నీళ్లిస్తామన్న సీఎం కేసీఆర్‌‌‌‌ హామీ ఒక్క కొండపోచమ్మసాగర్‌‌‌‌ కే పరిమితమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఈ ఏడాది నుంచి ఎర్లీగా ఖరీఫ్‌‌‌‌కు నీళ్లిస్తమని సీఎం ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. మరి ఇప్పుడు ఎస్సారెస్పీలో నీళ్లున్నా, ఆయకట్టుకు విడుదల చేసే చాన్స్​ ఉన్నా ఆ దిశగా ప్రయత్నమేదీ జరగడం లేదు. మరోవైపు కొండపోచమ్మ కింద చెరువులను నింపేందుకు నిరంతరాయంగా నీళ్ల లిఫ్టింగ్​ మాత్రం కొనసాగిస్తున్నారు. మిడ్‌‌‌‌ మానేరు నీటిని మొత్తంగా రంగనాయకసాగర్‌‌‌‌, కొండపోచమ్మసాగర్‌‌‌‌ కింద చెరువులు నింపడానికే వాడనున్నట్టు తెలుస్తోంది. ఇక వానాకాలం పంటలకు నీళ్లిచ్చే యాక్షన్​ ప్లాన్​ కూడా ఇప్పటికీ రెడీ కాలేదు.

ఎస్సారెస్పీలో నీళ్లున్నా..

శ్రీరాంసాగర్‌‌‌‌ ప్రాజెక్టు పూర్తి ఆయకట్టు 16 లక్షల 41 వేల 284 ఎకరాలకు ఈ వానాకాలంలో నీళ్లివ్వాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. ఎల్‌‌‌‌ఎండీ కింద కాల్వ కెపాసిటీని 6 వేల క్యూసెక్కుల నుంచి 9 వేల క్యూసెక్కులకు పెంచాలని సూచించారు. సీఎం ఆదేశాలతో ఇంజనీర్లు ఫీల్డ్‌‌‌‌ స్టడీ చేసి.. ఇప్పటికిప్పుడే ఆ పనులు మొదలుపెట్టే చాన్స్​ లేదు. ఇప్పుడున్న కాకతీయ కాల్వ ద్వారానే స్టేజ్​–-2తో పాటు ఎల్‌‌‌‌ఎండీ కింది పూర్తి ఆయకట్టుకు నీళ్లిచ్చే అవకాశముంది. ఎస్సారెస్పీలో బుధవారం నాటికి 29.72 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది ఇదే రోజు ఉన్నది 5.56 టీఎంసీలు మాత్రమే. ఇప్పుడున్న నీళ్లలో 20 టీఎంసీలకుపైగా ఆయకట్టుకు విడుదల చేయవచ్చు. స్టేజ్​-1, 2 పరిధిలోని పూర్తి ఆయకట్టుకు నాట్ల కోసం నీళ్లివ్వొచ్చు. మిడ్‌‌‌‌ మానేరులో 12.88 టీఎంసీలు, ఎల్‌‌‌‌ఎండీలో 8.55 టీఎంసీలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే శ్రీరాంసాగర్​ ఆయకట్టుకు 30 టీఎంసీలకుపైగా నీళ్లు అందుబాటులో ఉన్నాయి. అయినా నీటి విడుదలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఎనిమిది టీఎంసీలకుపైగా ఎత్తిపోతలు

మిడ్‌‌‌‌ మానేరు నుంచి అనంతగిరి, రంగనాయక సాగర్‌‌‌‌, మల్లన్నసాగర్‌‌‌‌, కొండపోచమ్మసాగర్‌‌‌‌ వరకు గత 2 నెలల్లో 8 టీఎంసీలకుపైగా నీళ్లను ఎత్తిపోశారు. 100కు పైగా చెరువులు నింపారు. కొండపోచమ్మ కింద మరో 37 చెరువులు నింపేందుకు బుధవారం నీళ్లు విడుదల చేశారు. మిడ్‌‌‌‌ మానేరులోని మిగతా నీటిని కూడా కొండపోచమ్మసాగర్‌‌‌‌ వరకు తరలించే ఉద్దేశంతోనే ఉన్నట్టు సమాచారం. లింక్‌‌‌‌–4లోని ఐదు పంపుహౌస్‌‌‌‌ల్లో నిత్యం మోటార్లను నడుపుతూ నీళ్లను తరలిస్తున్నారు. కొండపోచమ్మ కింద 521 చెరువులు, కుంటలు ఉండగా.. వీలైనన్ని ఎక్కువ చెరువులకు నీళ్లివ్వడమే టార్గెట్‌‌‌‌గా ఎత్తిపోతలు కొనసాగిస్తున్నారు.

యాక్షన్‌‌‌‌ ప్లానే రెడీ చెయ్యలే..

ఏటా ప్రాజెక్టుల వారీగా వానాకాలం పంటలకు నీళ్లను విడుదల చేసే యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ రూపొందిస్తుంటారు. ఈసారి ప్లాన్ కోసం ఈ నెల 15న ఈఎన్సీ నేతృత్వంలో హైలెవల్‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌ నిర్వహించాలని భావించారు. కానీ తర్వాతి రోజుకు వాయిదా పడింది. అదే రోజున కేసీఆర్ ఉపాధి నిధులపై కలెక్టర్లతో రివ్యూ చేశారు. ఉపాధి హామీలో ప్రాజెక్టులు, చెరువుల కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేర్చడంతో ఇరిగేషన్‌‌‌‌ అధికారులు ఆ రివ్యూకు హాజరయ్యేందుకు హైలెవల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ ను రద్దు చేశారు. మళ్లీ హైలెవల్​ మీటింగ్‌‌‌‌ ఊసేలేదు. కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహాలు మొదలుకాకపోవడంతోనే యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ పెట్టలేదని అంటున్నారు.

నెల కిందే రివ్యూ చేసినా

గోదావరి ప్రాజెక్టుల కింద వానాకాలం పంట లకు నీళ్లిచ్చేందుకు మే 27నే మంత్రులు, అధికారులు, ఇంజనీర్లతో సీఎం కేసీఆర్​ రివ్యూ నిర్వహించారు. కాళేశ్వరం 3 లింకుల పనులు పూర్తవడంతో గోదావరి నీళ్లను ఎక్కువ మొత్తంలో వాడుకోవాలని.. ముందుగా నీళ్లిచ్చేందుకు యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ రెడీ చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల నీళ్లతో ముందు చెరువులు, కుంటలు నింపాలని సూచించారు. ఇరిగేషన్​ ప్రిన్సిపల్​ సెక్రెటరీ ఆ మరుసటి రోజే జలసౌధలో ఇంజనీర్లతో భేటీ అయి వానాకాలం పంటలకు నీళ్లిచ్చే ప్రణాళికపై చర్చించారు.

జులైలోనైనా నీళ్లిస్తారా?

ఎస్సారెస్పీ, మిడ్‌‌‌‌ మానేరులో ఉన్న నీటితో వానాకాలం పంటలకు ముందుగానే నీళ్లివ్వాలని మొదట్లో అనుకున్నారు. ఒక దశలో అయితే రోహిణి కార్తెలోనే నీళ్లు విడుదల చేయాలనుకున్నరు. కానీ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాయిదా వేసుకున్నారు. మృగశిరలో నారుమళ్లకు ఒక తడి ఇవ్వాలనీ భావించినా నీటిని విడుదల చేయలేదు. కనీసం జులైలోనైనా శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు కాల్వల కింది ఆయకట్టుకు నీళ్లిస్తరో లేదో స్పష్టత రావడం లేదు. ఉపాధి నిధులతో మెయిన్‌‌‌‌ కెనాల్‌‌‌‌తో పాటు బ్రాంచి కెనాళ్లు, డిస్ట్రిబ్యూటరీల్లో పూడిక తొలగింపు పనులు చేస్తున్నారు. పది రోజుల్లోగా ఆ పనులు కంప్లీట్‌‌‌‌ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అప్పటికైనా నీటి విడుదలపై క్లారిటీ వస్తుందో రాదో తెలియడం లేదు.