ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా: మంత్రి శ్రీధర్ బాబు

 ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా: మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి:  నాలుగు నెలల్లోనే అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని అన్నారు. అభివృద్ధిలో ఇప్పటివరకు జెస్ట్ ట్రైలర్ మాత్రమే చూపెట్టాం.. ముందు ముందు అసలు సినిమా చూపిస్తామని మంత్రి చెప్పారు. ఏప్రిల్ 27వ తేదీ శనివారం జిల్లాలోని ముత్తారం మండలం కాసర్ల గడ్డలో కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పది సంవత్సరాలపాటు అధికారంలో లేకున్నా..  నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన బలంతోనే ముందుకు వెళ్లానన్నారు. రాష్ట్రానికి మేలు చేసే స్థానాన్ని.. మేనిఫెస్టో తయారు చేసే అవకాశాన్ని తనకు సోనియాగాంధీ ఇచ్చారని చెప్పారు. శాసనసభ్యులందరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని..  గత ప్రభుత్వంలో నాయకులు చేసింది ఏమిటో గుర్తించాలన్నారు.

ఏం అమలు చేస్తున్నారని మమ్మల్నీ బీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారని... మమ్ముల్నీ అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని దుయ్యబట్టారు మంత్రి. మేము చేయాలనుకున్న మేనిఫెస్టోలోని ప్రధాన ఐదు వాగ్దానాలను నెరవేస్తున్నామని చెప్పారు. నీతివంతమైన పరిపాలనను అందిస్తామన్నారు. రూ.లక్ష కోట్లతో కట్టిన మేడిగడ్డ కుంగిపోయిందని.. అదే లక్ష కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు పెడితే పేదలకు లబ్ధి చేకూరేదన్నారు. 

ముత్తారం మండలం ఓడేడు బ్రిడ్జి గాలి దుమారానికే కూలిపోయిందిని.. ఎక్కడైనా గాలి దుమారానికి వంతెనలు కూలుతాయా?..నాణ్యతలేని నిర్మాణాలు చేపట్టిన గత ప్రభుత్వానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు.  బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత విధానం వల్ల ప్రజాధనం వృధా అయిందని విమర్శించారు. ముత్తారం నుండి గంగాపురి వరకు రూ.70 కోట్లతో డబుల్ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో సేవ చేయడానికి వచ్చిన గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కోరారు.