కార్మికుల వల్ల ఆర్టీసీకి నష్టం లేకుంటే ముక్కు నేలకు రాస్తావా కేసీఆర్ : జీవన్ రెడ్డి

కార్మికుల వల్ల ఆర్టీసీకి నష్టం లేకుంటే ముక్కు నేలకు రాస్తావా కేసీఆర్ : జీవన్ రెడ్డి

కార్మికుల వల్ల ఆర్టీసీకి నష్టమైతే నేను ముక్కు నేలకు రాస్తా..లేదంటే కేసీఆర్​ ముక్కు నేలకు రాస్తావా: జీవన్​రెడ్డి

కోరుట్ల, వెలుగు:‘‘కార్మికుల వల్లే ఆర్టీసీకి నష్టం కలిగినట్లయితే నేను ముక్కు నేలకు రాస్తా.. లేదంటే కేసీఆర్​ నీ ముక్కు నేలకు రాస్తావా’’అని సీఎం కేసీఆర్​కు కాంగ్రెస్​ ఎమ్మెల్సీ టి.జీవన్​రెడ్డి సవాల్​విసిరారు. ఆర్టీసీ నష్టాలకు సీఎం కేసీఆరే బాధ్యుడని, సంస్థను లాభాల్లోకి తెస్తానన్న కేసీఆర్ ఐదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. బుధవారం కోరుట్ల ఆర్టీసీ డిపో వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికులకు జీవన్​రెడ్డి సంఘీభావం తెలిపారు. తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు అగ్రభాగాన నిలిచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని జీవన్​రెడ్డి అన్నారు. రాష్ట్రం రూ.3.45 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, తల్లి కడుపులో శిశువు కూడా రూ.88 వేల అప్పుతో పుట్టాల్సి వస్తోందని చెప్పారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తానని కేసీఆర్​మాట ఇచ్చి తప్పారని ఆరోపించారు. కేసీఆర్ తిరిగే హెలికాఫ్టర్​కు రూపాయి పన్ను విధించి.. సామాన్యుడు తిరిగే ఆర్టీసీకి రూ.22 పన్ను విధిస్తారా? అని ప్రశ్నించారు. 30 శాతం ప్రైవేట్ బస్సులను దొడ్డి దారిన బంధుమిత్రులకు కట్టబెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్మికులతో పెట్టుకున్న కేసీఆర్ మడి మసై పోతాడన్నారు.

మీలో ఒకడినై పోరాడుతా: కొమొరెడ్డి రాములు

ఆర్టీసీ కార్మికుల్లో ఒకడిగా వారి వెంట ఉండి విజయం సాధించే వరకు పోరాటం చేస్తానని మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రాము​లు అన్నారు. బుధవారం కోరుట్లలో ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు.