ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష

షరతులు లేకుంటే సమ్మె విరమించి విధుల్లో చేరతామని నిన్న ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వారిని విధుల్లో చేర్చుకోవాల వద్దా అనే అంశంపై సీఎం కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నాం రవాణశాఖ మరియు ఆర్టీసీ అధికారులతో చర్చించనున్నారు. దాంతో ప్రభుత్వ నిర్ణయంపై అటు కార్మికులు, ఇటు ప్రజలలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.
గతంలో ప్రభుత్వం ఆర్టీసీ సంఘాలు లేకుండా లెటర్ రాసి యాజమాన్యానికి ఇవ్వాలంటూ కార్మికులకు షరతు విధించింది. ఈ షరతుపై కార్మికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. కేవలం డ్యూటి చార్ట్ మరియు అటెండెన్స్ రిజిష్టర్‌లో మాత్రమే సంతకం చేసి విధుల్లో చేరతామని కార్మికులు ప్రకటించారు. మిగతా షరతులకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని జేఏసీ నాయకులు తేల్చి చెప్పారు.

ఒకవేళ ప్రభుత్వం షరతులు పెడితే మాత్రం మళ్లీ సమ్మె మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని జేఏసీ నేతలు ఒత్తిడి తెస్తుండటంతో దానిపై కూడా సీఎం చర్చించనున్నారు. ఏది ఏమైనా సాయత్రంలోపు సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తారని సీఎంవో వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

రెండు వారాల్లో సమ్మెపై ఏదో ఒకటి తేల్చాలని హైకోర్టు కూడా ప్రభుత్వానికి సూచించింది. లేబర్ కోర్టు తీర్పు ఎలా ఉన్నా కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వాన్ని కోరాయి.

మరోవైపు జేఏసీ 1 నేతలు ఈయూ ఆఫీస్‌లో సమావేశమయ్యారు. నిన్నటి జేఏసీ నిర్ణయంపై వారు చర్చిస్తున్నారు. దాంతోపాటు, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సాయమందించే విషయంపై కూడా చర్చిస్తున్నారు. ఇటువంటి అంశాలన్నింటిపై మధ్యాహ్నం కేసీఆర్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.