హైదరాబాద్లో కరెంట్ పోదు..ఢిల్లీలో కరెంట్ ఉండదు..

హైదరాబాద్లో  కరెంట్ పోదు..ఢిల్లీలో  కరెంట్ ఉండదు..

దేశంలో కులం, మతం పేరుతో విడదీసే ప్రయత్నం చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.  దేశంలో కులము, మతము లేనటుంవంటి ఐక్యత మనలోపల రావాలని సూచించారు. చైతన్యవంతమైన సమాజం ఉంటే దేశం పురోగమిస్తుందన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో  9 గంటలు కూడా కరెంట్ ఉండేది కాదన్నారు. కానీ ఇవాళ ఆదిలాబాద్ గోండు గూడెంలో 24 గంటల పాటు కరెంట్ వస్తుందని..హైదరాబాద్ లోని బస్తీలోనూ 24 గంటల పాటు విద్యుత్ ఉంటుందన్నారు. హైదరాబాద్ లో 24 గంటలూ కరెంట్ పోదు...ఢిల్లీలో 24 గంటల పాటు కరెంట్ ఉండదన్నారు. 

తలసరి ఆదాయంలో టాప్
తెలంగాణ ముమ్మాటికి ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్ అన్నారు. కొందరు మూర్ఖులు చేసే ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెపపారు. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. లక్ష ఉంటే..ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,78,500 అని చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ ఇని చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్ లాంటి పెద్ద రాష్ట్రాలు మనకంటే వెనుకబడి ఉన్నాయన్నారు. కడుపు కట్టుకుని..నోరు కట్టుకుని శ్రమపడితే నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నామన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు ఇప్పటికే రూ. 5 కోట్లు ఇస్తున్నామని..వీటికి అదనంగా..మరో రూ. 10 కోట్లు అందజేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు
రాష్ట్రంలో  ఇప్పటికే 36 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరో 10 లక్షల మందికి అదనంగా ఇవ్వబోతున్నట్లు చెప్పారు. మొత్తంగా 46లక్షల మందికి పింఛన్ అందిస్తున్నామన్నారు. కరోనాతో కొంత ఆలస్యమైందన్నారు. 46 లక్షల పెన్షన్‌దారులకు అద్భుతమైన కొత్త కార్డులు ఎలక్ట్రానిక్‌ బార్‌కోడ్లతో పంపిణీ చేస్తున్నారన్నారు. మంచి నీటి కోసం ఒకప్పుడు బిందెలతో ఆడబిడ్డలు యుద్ధాలు చేస్తుండేవారని..కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. మిషన్ భగీరథతో మంచినీటి కష్టాలు తీరాయని చెప్పారు. 

మేడ్చల్ జిల్లా అవుతుందని ఊహించలేదు..
పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు వేగంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లా అవుతుందని ఏనాడూ కల కనలేదని.. రాష్ట్రం ఏర్పడడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరకు వస్తే అంత చక్కగా పనులు జరిగే అవకాశం ఉంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా విభజనపై పెద్ద చర్చ జరిగిందని..వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలుగా చేస్తే భవిష్యత్‌లో బాగుంటుందని పెద్దలు చెప్పడంతో మేడ్చల్‌ను  జిల్లా ప్రకటించినట్లు తెలిపారు.