
- భవిష్యత్తులో స్పష్టత వస్తది: కేసీఆర్
- ఏ ఎజెండాతో ముందుకు పోవాల్నో కలిసి చర్చిస్తం
- ప్రపంచంతో పోలిస్తే మనం అనేక విషయాల్లో వెనుకబడ్డం
- మనకు పొరుగునే ఉన్న చైనా ఎంతో అభివృద్ధి చెందిందని వ్యాఖ్య
- రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీ
- ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున అందజేత
- ముగిసిన ఐదు రోజుల ఢిల్లీ పర్యటన
హైదరాబాద్, వెలుగు: ‘‘యాంటీ బీజేపీ, యాంటీ కాంగ్రెస్.. ఆ ఫ్రంట్.. ఈ ఫ్రంట్.. థర్డ్ ఫ్రంట్.. ఫోర్త్ ఫ్రంట్ లాంటివి ఏమీ లేవు.. ఇంకా ఏ ఫ్రంట్ ఖరారు కాలే.. భవిష్యత్‌లో దీనిపై స్పష్టత వస్తుంది” అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత కూడా జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని విమర్శించారు. దేశాన్ని సరైన దిశలో తీసుకుపోవడానికి గట్టి ప్రయత్నం జరగాలని, ఆ దిశగా ప్రయత్నం మొదలైందని, చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం జార్ఖండ్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌తో కలిసి సీఎం కేసీఆర్ రాంచీలో మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఆశించిన ఫలాలు అందలేదని, కొత్త మార్గంలో సాగాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. ‘‘ఆ మార్గం ఏమిటీ.. ఎలా చేయాలి.. ఏం చేయాలి అనే విషయాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ విషయాలన్నింటిపై భవిష్యత్‌లో స్పష్టత వస్తుంది” అని చెప్పారు. ప్రపంచంతో పోల్చితే మనం అనేక విషయాల్లో వెనుకబడిపోయామని, మనకు పొరుగునే ఉన్న చైనా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఎన్నో ఆసియా దేశాలు అభివృద్ధి చెందాయని, కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దేశాన్ని సరైన దిశలో నడిపించడం లేదని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే తామంతా ఒకచోట కలుస్తామని ఆయన వెల్లడించారు. ‘‘ఏ ఎజెండాతో ముందుకు పోవాలి.. ఎలా ముందుకు పోవాలి.. దేశాన్ని మరింత ఉత్సాహవంతంగా, అభివృద్ధి దిశగా ఎలా నడిపించాలనే ప్రయత్నాలపై అందరం కలిసి చర్చిస్తం. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వివరిస్త” అని స్పష్టం చేశారు.
ఎన్నో పార్టీలను, సంఘాల నేతలను కలుస్తున్న
తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో తాను ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు శిబు సోరెన్ అండగా నిలిచారని, రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతి దశలో వెన్నంటే ఉన్నారని కేసీఆర్ చెప్పారు. శిబు సోరెన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకోవడానికే రాంచీకి వచ్చానని, ఆయన ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తమకు శిబు సోరెన్‌ను కలిపించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. పురోగామి భారత్‌ను నిర్మించడంలో జర్నలిస్టు పాత్రనూ ఆశిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. తాము చేస్తున్న ప్రయత్నానికి ఇప్పుడే మీడియా ప్రతినిధులు పేరు పెట్టవద్దని, తాను చెప్పదల్చుకున్న అంశాలను స్వచ్ఛమైన, మంచి మనసుతో అర్థవంతంగా చెప్తున్నానని పేర్కొన్నారు. ఇప్పుడున్న దానికన్నా ఎన్నోరెట్లు మెరుగైన భారతదేశాన్ని నిర్మించి వాటి ఫలాలను ప్రజలకు అందించాలనేదే తమ ఆకాంక్ష అని కేసీఆర్ అన్నారు. అందుకు తగ్గట్టుగానే తమ ప్రయత్నాలు సాగుతున్నాయని, దేశంలోని ఎన్నో పార్టీలను, పలు సంఘాల నేతలను, రైతు నాయకులను కలుస్తున్నట్లు వివరించారు. గాల్వన్ లోయలో జరిగిన దాడిలో 20 మంది సైనికులతో పాటు వారికి నేతృత్వం వహించిన తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు మృతిచెందారని గుర్తుచేశారు. సంతోష్‌బాబుతో పాటు ప్రాణాలు కోల్పోయిన సైనికులకు సాయం చేస్తామని, వారి కుటుంబాలను సన్మానిస్తామని అప్పుడే ప్రకటించామన్నారు. జార్ఖండ్, పంజాబ్ ఇతర ఆరేడు రాష్ట్రాలకు చెందిన సైనికులు మృతిచెందారని, వారి కుటుంబాలకు సాయం అందిస్తామని చెప్పారు. జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు సైనిక కుటుంబాలకు సాయం చేస్తామని హేమంత్ సోరెన్ వద్ద ప్రస్తావిస్తే.. రాష్ట్రానికి రావాలని ఆయన ఆహ్వానించారని, తాము చేయగలిగిన సాయం అందించామన్నారు.
నేను చాలా తెలివైనవాడ్ని
ఇప్పుడున్న దానికన్నా ఎన్నోరెట్లు మెరుగైన భారతదేశాన్ని నిర్మించి వాటి ఫలాలను ప్రజలకు అందించాలనేదే తమ ఆకాంక్ష అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘ఇది ఒకరిద్దరితో అయ్యే పనికాదు. ఒకటి రెండు రోజుల్లో నిర్ణయించేది కాదు. అందరూ కలిసినప్పుడు ఏ దారిలో వెళ్లాలి.. ఎలా వెళ్లాలి.. ఫ్రంట్ ఏర్పాటు చేయాలా.. మరో రూపంలో పనిచేయాలా అనే విషయాలను మున్ముందు తెలియజేస్త” అని స్పష్టం చేశారు. ఏ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నారని మీడియా ప్రశ్నించగా.. ‘‘నేను చాలా తెలివైన వాడిని. నా నుంచి ఏమీ రాబట్టలేరు” అని ఆయన అన్నారు.
అమర జవాన్ల కుటుంబాలకు సాయం
గాల్వన్ లోయలో జరిగిన దాడిలో మృతిచెందిన జార్ఞండ్‌కు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో కలిసి సీఎం కేసీఆర్ రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. కుందన్ కుమార్ ఓఝా భార్య సమ్రత కుమారి, గణేశ్ హన్సదా తల్లి కప్రా హన్సదాకు ఈ చెక్కులు అందించారు. దాడిలో చనిపోయిన మరో 17 మంది సైనిక కుటుంబాలకు త్వరలోనే సాయం అందిస్తామని కేసీఆర్ చెప్పారు. ముందుగా కేసీఆర్ ప్రత్యేక విమానంలో శుక్రవారం ఢిల్లీ నుంచి రాంచీకి చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి గిరిజన ఉద్యమకారుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బీర్సాముండా విగ్రహం వద్దకు చేరుకొని.. నివాళులర్పించారు. అనంతరం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంటికి వెళ్లారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఇతర నేతలకు జార్ఖండ్ సీఎం కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. కేసీఆర్, ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత.. జేఎంఎం వ్యవస్థాపకుడు శిబుసోరెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం రెండు రాష్ట్రాల సీఎంల కుటుంబ సభ్యులు కలిసి లంచ్ చేశారు. కేసీఆర్ వెంట మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. కాగా, సీఎం కేసీఆర్ ఐదు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఫిబ్రవరి 28న సాయంత్రం కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన..శుక్రవారం రాంచీలో పర్యటించి తిరిగివచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అవుతారని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నా.. కేజ్రీవాల్ అందుబాటులో లేకపోవడంతో కలువలేకపోయారు.