ఫ్రంట్లు, టెంట్లు లేకుండా కొత్త పంథాలో ముందుకెళ్తాం

ఫ్రంట్లు, టెంట్లు లేకుండా కొత్త పంథాలో ముందుకెళ్తాం

దేశ ప్రజల ముందు ప్రత్యామ్నాయ అజెండా ఉంచాల్సిన సమయం వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టామని చెప్పారు. ఫ్రంట్లు, టెంట్ల బాధ లేకుండా కొత్త పంథాలో ముందుకెళ్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశానికి కొత్త అజెండా ఇవ్వడానికి సైనికుడిలా పనిచేస్తానని హామీ ఇచ్చారు. దేశంలో మూస ధోరణిలో రాజకీయాలు నడుస్తున్నాయని, అందుకే అన్నీ ఉన్నా దేశాన్ని ఆగం పట్టించారని కేసీఆర్ విమర్శించారు. అమెరికాను మించిన ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం దేశానికి ఉందని చెప్పారు. 

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయం

టీఆర్ఎస్ సుసంపన్నమైన పార్టీ అని సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ దగ్గర ప్రస్తుతం రూ.861 కోట్ల నిధులు ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని.. 90కిపైగా స్థానాల్లో గులాబీ పార్టీ గెలుస్తుందని రిపోర్టులు చెబుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే టీఆర్ఎస్ శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్న ఆయన.. వివిధ అంశాలపై అధ్యయనం కోసం ప్రజా ప్రతినిధులను త్వరలోనే విదేశాలకు పంపుతామని చెప్పారు.

కేంద్రం పెంచితే రాష్ట్రం తగ్గించాలా?

ప్రభుత్వ ఆస్తులు అమ్మితే ప్రైజులు పెట్టిన ఘనత మోడీకే చెల్లుతుందని కేసీఆర్ మండిపడ్డారు. కరోనాపై మీటింగ్ పెట్టి పెట్రోల్ పై  మాట్లాడిన మోడీ.. రాష్ట్రాలను వ్యాట్ తగ్గించమనేందుకు సిగ్గుండాలని అన్నారు. బీజేపోళ్లు పెట్రోల్ రేట్లు పెంచుకుంటూ పోతే రాష్ట్రాలు వాటిని తగ్గించాలా అన్న కేసీఆర్.. అసలు రేట్లు ఎందుకు పెంచుతున్నారో చెప్పే దమ్ము మోడీకి ఉందా అని ప్రశ్నించారు. బలమైన కేంద్ర బక్క రాష్ట్రాలు ఉండాలన్నదే కేంద్ర సిద్ధాంతమన్న ముఖ్యమంత్రి మత రాజకీయాలు శాశ్వతం కాదని హితవు పలికారు.