కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్​... తొలిరోజే  పలు ఫైళ్లపై సంతకాలు  

కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్​... తొలిరోజే  పలు ఫైళ్లపై సంతకాలు  

తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని నేడు  (ఏప్రిల్​ 30) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆరవ అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన ఆయన ముందుగా నిర్ణయించిన ముహూర్తానికి కుర్చిలో ఆసీనులైనారు. ఆ తర్వాత పలు దస్త్రాలపై సుముహూర్తంలోనే సంతకాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ  ఫైల్‌పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతకం చేశారు.

తెలంగాణవ్యాప్తంగా 6.84లక్షల మంది గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్లు అందనున్నాయి. పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న  గర్భిణులకు ప్రొటీన్లు, ఖనిజ లవణాలతో కిట్‌ అందిస్తున్నారు. . రూ.2వేల విలువ చేసే ఈ కిట్‌ను 5వ నెల, 9వ నెలల్లో  రెండుసార్లు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను తెలంగాణ ప్రభుత్వం  అందించనున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో అమల్లో ఉన్న ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు.

సచివాలయ ప్రాంగణంలో జరిగిన యాగంలో కేసీఆర్ వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సచివాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి బ్యాటరీ కారులో కేసీఆర్ సచివాలయాన్ని పరిశీలించారు. అనంతరం కేసీఆర్ ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌కు వెళ్లారు. కేసీఆర్ తన ఛాంబర్‌లో వేదపండితుల ఆశీస్సులు తీసుకున్నారు. కేసీఆర్ తన ఛాంబర్‌లో పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. రైల్వే మార్గదర్శకాలు, పోడు భూముల ఫైళ్లతో సహా ఆరు ఫైళ్లపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. అనంతరం యాదాద్రి కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు.