కేసీఆర్ "ఒక కన్ను" కథ.. సభలో నవ్వులే నవ్వులు..

కేసీఆర్ "ఒక కన్ను" కథ.. సభలో నవ్వులే నవ్వులు..

దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సి ఉన్నా అలా జరగడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోడీకి వాస్తవాలు చెప్పకుండా పొగడ్తలతో సరిపెడుతున్నారు. ఆయన కూడా వాటిని విని మురిసిపోతున్నారని సటైర్ వేశారు. అన్నీ తెలిసే సమయానికి మోడీ మాజీ ప్రధాని అయిపోతారంటూ కేసీఆర్ ఓ పిట్ట కథ చెప్పుకొచ్చారు. 

"తిరుమల రాయుడనే రాజు ఉండేవాడు. ఆయనకు ఒకటే కన్ను ఉండేది. ఆ విషయంలో ఆయన ఎప్పుడూ బాధపడుతుండేవాడు. అదే రాజ్యంలో ఒక కవి ఉండేవాడు. ఆయన పేదవాడు. రాజుగారి దగ్గర ఏదైన సహాయం పొందాలనుకుంటాడు. రాజుగారి దగ్గర బహుమానం పొందాలంటే ఆయనను బాగా పొగడాలని అందరూ సలహా ఇస్తారు. దాంతో ఆ కవి ఇష్టం లేకపోయినా రాజును పొగుడుతూ,‘అన్నా తిగూడి హరుడవు.. అన్నా తిని గూడనపుడు అసుర గురుండవు. అన్నాతిరుమలరాయ కన్నొక్కటే లేదు గానీ, కౌరవపతివే’ అని కవిత్వం చెబుతాడు అంటూ కేసీఆర్ ఆ కథ అర్థం వివరించారు.

భార్యతో ఉన్నప్పుడు నువ్వు 3 కళ్ల శివుడవు. ఆయన భార్య 2 కళ్లతో కలిపి 3 కళ్లు కలిగినవాడని అర్థం. ఇక భార్యతో లేనప్పుడు నువ్వు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడంతటి వాడివి. ఆ ఒక్క కన్ను కూడా లేకపోతే నువ్వేమైనా తక్కువ వాడివా ‘కౌరవపతి’ అయిన ధృతరాష్ట్రుడంతటి వాడివి’ అని పొగుడుతాడు. ఇప్పుడు పార్లమెంట్‌లో ప్రధాని మోడీని కూడా ఇలాగే పొగుడుతున్నారంటూ కేసీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.