స్కైరూట్, ధృవ సంస్థలకు కేసీఆర్ శుభాకాంక్షలు

స్కైరూట్,  ధృవ సంస్థలకు కేసీఆర్ శుభాకాంక్షలు

తెలంగాణకు చెందిన ‘ధృవ’ స్పేస్ టెక్ సంస్థ ద్వారా ఇవాళ శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రెండు నానో శాటిలైట్స్ విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశించాయి. ఈ సక్సెస్ పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోకు చెందిన ‘‘పీఎస్ఎల్వీ–సి 54’’ తో పాటుగా హైద్రాబాద్ స్టార్టప్ ధృవ పంపిన తై బోల్ట్ 1, తై బోల్ట్ 2 అనే రెండు నానో ఉప గ్రహాల ప్రయోగం విజయవంతం కావడం అనేది దేశ అంకుర సంస్థల చరిత్రలో సుదినంగా సీఎం అభివర్ణించారు. ప్రయివేటు రంగం ద్వారా ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో ఇది గొప్ప విజయమన్నారు. 

టీ హబ్ సభ్య సంస్థ అయిన స్కైరూట్ ఇటీవలే ప్రయోగించిన ‘‘విక్రమ్–ఎస్’’ శాటిలైట్ విజయవంతం కావడం ద్వారా శాటిలైట్ ప్రయోగాల రంగంలో తెలంగాణలోని స్టార్టప్ ల పాత్ర ప్రపంచానికి తెలిసిందని సీఎం అన్నారు. ‘స్కైరూట్’, ‘ధృవ’ సంస్థల ప్రతినిధులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. శాస్త్ర, సాంకేతిక, ఐటీ రంగాల్లో ఔత్సాహికులైన యువతీ యువకుల ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్న ఐటీ మంత్రి కేటీఆర్, సంబంధిత విభాగాల ఉన్నతాధికారులను, టీ హబ్ సిబ్బందిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు.