ఎలాంటి డౌట్ వద్దు.. 2034 వరకు నేనే సీఎం: సీఎం రేవంత్

ఎలాంటి డౌట్ వద్దు.. 2034 వరకు నేనే సీఎం: సీఎం రేవంత్

ఎలాంటి అనుమానం లేకుండా  2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  వచ్చే ఐదేళ్లలో విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫిన్లాండ్ అనుభవాలను మన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు పూర్తిగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు.

ఉపాధ్యాయుల సమస్యల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ బాధ్యత పూర్తిగా తనదేనని సీఎం రేవంత్  భరోసానిచ్చారు. 
ఫిన్లాండ్ విద్యా విధానాన్ని అధ్యయనం చేసి తిరిగి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో  రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యా రంగానికి సంబంధించి కీలకమైన, స్పష్టమైన ప్రకటనలు చేశారు.

ఉపాధ్యాయులు కేవలం పిల్లల భవిష్యత్తు, వారి సమస్యలపైనే దృష్టి పెట్టాలని కోరారు. గతంలో ఒకటో తేదీన జీతాలు రాక ఉపాధ్యాయులు పడ్డ ఇబ్బందులను గుర్తుచేస్తూ, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన తాను ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని గుర్తుచేసుకున్నారు.

ఈ ఏడాది ఒక్క విద్యా రంగానికే రూ. 39 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వానికి రూ. లక్షా 8 వేలు ఖర్చు అవుతోందని సీఎం తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై రూ. 50 వేలకు మించి ఖర్చు కానప్పుడు, ప్రభుత్వ బడుల్లో అంతకంటే మెరుగైన నాణ్యమైన విద్య అందాలని ఆయన ఆకాంక్షించారు. గత రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం శుభపరిణామమని పేర్కొన్నారు.

ALSO READ : ITIలను ATCలుగా మార్చినందుకు నేను రాజీనామా చేయాలా..?

కేవలం ఇంగ్లీష్ మాత్రమే సర్వస్వం కాదంటూ చైనా ఉదాహరణను సీఎం ప్రస్తావించారు. చైనాలో ఇంగ్లీష్ వచ్చే వాళ్ళు 10 శాతం కూడా లేకపోయినా, ఆ దేశం ప్రపంచాన్ని శాసిస్తోందని... అమెరికాలో అడుక్కునేవాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడని ఆయన గుర్తుచేశారు. అందుకే మన చూపు కేవలం అమెరికా వైపే కాకుండా, చైనా ,జపాన్ దేశాల వైపు కూడా ఉండాలని సూచించారు.