- ఒప్పందాల అమలుకు ఆటంకాలను తక్షణమే తొలగించాలి
- రియల్ టైం డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షించాలి
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- పరిశ్రమల శాఖ, పెట్టుబడుల పురోగతిపై సమీక్ష
హైదరాబాద్: వివిధ వేదికలపై ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు(ఎంవోయూలు) వేగంగా అమల్లోకి వచ్చేలా చూడాలని అధికారులను సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే భూముల కేటాయింపుతో పాటు ఇతర అనుమతులు ఇచ్చిన కంపెనీలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో పాటు ఇతర వేదికలపై వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఎంవోయూలపై పురోగతిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోకలిసి సీఎం బుధవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు సంబంధించి పనులు ప్రారంభమైన కంపెనీలు, అనుమతుల దశలో ఉన్న కంపెనీలు, సాంకేతిక, ఇతర సమస్యలతో పనులు పెండింగ్‌లో ఉన్న సంస్థల వివరాలను అధికారులు సీఎంకు తెలియజేశారు.
ఫ్యూచర్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆయా సంస్థలకు కేటాయించిన భూములు, అక్కడి మార్కెట్ ధరలు, ఆయా కంపెనీలు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్న మొత్తాన్ని అధికారులు వివరించారు. ప్రభుత్వ విధానం ప్రకారం.. క్యూర్, ఫ్యూర్, రేర్ ప్రాంతాల్లో ఆయా సంస్థలకు భూములు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడులకు సంబంధించిన అనుమతులు వేగంగా ఇవ్వాలని, అదే సమయంలో ఆయా కంపెనీలు పనులు త్వరగా ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలకు భూసేకరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.
ఎంఓయూల అమలుపై డ్యాష్ బోర్డు..
డాటా సెంటర్లకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సూచించారు. మల్టీనేషనల్, మార్కెట్‌లో పేరు ప్రతిష్టలున్న కంపెనీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఆయా సంస్థలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు.
వేగంగా ఎదుగుతున్న కంపెనీలు, భవిష్యత్ లో మంచి పనితీరు చూపే సంస్థలకు తర్వాత ప్రాధాన్యం ఇవ్వాలని, మిగతా కంపెనీలను మూడో ప్రాధాన్యంగా ఎంచుకొని వాటి పెట్టుబడులు పట్టాలెక్కేలా చూడాలన్నారు. ఫ్యూచర్ సిటీలో కార్యాలయం పనులు త్వరగా పూర్తి చేసి అక్కడే ఎంవోయూల అమలు, పురోగతిపై నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పనులు పూర్తయిన కంపెనీల ప్రతినిధులతో చర్చించి వాటి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
ఎంఓయూలు ఏ స్థితిలో ఉన్నాయి.. అమలుకు ఉన్న ఆటంకాలు.. వాటి పెట్టుబడి.. కల్పించే ఉద్యోగాలు.. ఇలా ప్రతి అంశం సీఎంవో, మంత్రులు తెలుసుకునేలా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలని.. దానిలో రియల్ టైం అప్‌డేట్ ఉండాలని సీఎం ఆదేశించారు. పరిశ్రమల శాఖపై సమీక్షకు ముందు హైదరాబాద్ మెట్రో రైలు పనులపై సీఎం సమీక్షించారు. రెండేళ్లలోనే చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు పనులు పూర్తి కావాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, మెట్రో సలహాదారు ఎన్‌వీఎస్‌రెడ్డి పాల్గొన్నారు.

