నీ బిడ్డ చెప్పిన కొరివి దెయ్యాల పంచాయతీ తేల్చు: కేసీఆర్‎పై CM రేవంత్ ఫైర్

నీ బిడ్డ చెప్పిన కొరివి దెయ్యాల పంచాయతీ తేల్చు: కేసీఆర్‎పై CM రేవంత్ ఫైర్

యాదాద్రి భువనగిరి: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‎పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం సీఎం రేవంత్ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. గంధమల్ల రిజర్వాయర్‌ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు జిల్లాలో రూ.15 వందల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం తిర్మలాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

‘‘బీఆర్ఎస్ హయాంలో నాపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారు. బెయిల్ మీద జైలు నుంచి బయటికొచ్చిన రోజే చెప్పినా.. కేసీఆర్‏ని పడగొడతానని. చెప్పిన మాట ప్రకారం పడగొట్టి చూపించా. పట్టుబట్టి.. పడగొట్టి ఆయన కుర్చీలో కుర్చున్నా. నా లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దించడమే.. అది పూర్తయ్యింది. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే కేసీఆర్ ఆగం ఆగం అవుతున్నాడు.. కమిషన్ నోటీస్ ఇస్తే మాపై ఎదురు దాడి చేస్తున్నారు. మరీ అక్రమ కేసుల్లో నెలలకొద్ది జైలులో పడుకున్న నేను ఏం అనుకోవాలి. కేసీఆర్ ఆయన చేసిన పాపాలతోనే మక్కెలు ఇరిగిపడ్డడు’ - అని సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. 

కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపైన రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. సొంతింటి బిడ్డ పార్టీలో దెయ్యాలున్నాయంటే కూడా మాట్లాడలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్‎లో దెయ్యాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే అంటున్నారని.. ఇక నుంచి ఆ పార్టీ బీఆర్ఎస్ కాదు డీఆర్ఎస్. డీఆర్ఎస్ అంటే దెయ్యాల రాజ్య సమితి అని ప్రతిపక్ష పార్టీకి కొత్త పేరు పెట్టారు. దెయ్యాల పార్టీ నాయకుడు కేసీఆర్ ఫాంహౌజ్‎లో నిద్రపోతున్నాడని విమర్శించారు. ఆయన బిడ్డ కవిత చెప్పిన కొరివి దెయ్యాల పంచాయతీని తేల్చాలని కేసీఆర్‎ను కోరారు. బీఆర్ఎస్ దెయ్యాల పార్టీ అని ప్రజలకు చెప్పాలని అన్నారు.