కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమధ్య సహకారం అవసరం:సీఎం రేవంత్రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమధ్య సహకారం అవసరం:సీఎం రేవంత్రెడ్డి

దేశం మరింత అభివృద్ది చెందుతున్న సమయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం, సమాఖ్య స్ఫూర్తి అవసరం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం (మే24) ఢిల్లీలో నీతి ఆయోగ్ 10వ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రాలను కేవలం ప్రయోగశాలలుగా కాకుండా జాతీయ వృద్దికి అవసరమైన చోదక శక్తిగా తీసుకోవాలని కోరారు. ఫెడరలిజం శక్తిని ఉపయోగించుకుని సమానత్వం, న్యాయం, సంక్షేమ, అందరికీ సమాన అవకాశాలు అందించే భారత్ ను నిర్మించేందుకు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. 

దేశ సమగ్రాభివృద్ది, తెలంగాణ పునర్నిర్మాణానికి అనుసరిస్తున్న విధివిధానాలు, భవిష్యత్ లక్ష్యాలను సమగ్రంగా వివరించారు.ప్రగతిపథంలో ముందుకు సాగుతున్న తెలంగాణ మోడల్ ను ఆవిష్కరించారు. తెలంగాణ సమగ్రాభివృద్దికి చేపట్టిన కార్యక్రమాలను వివరించి ఆర్థిక చేయూత అందించాలని కోరారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన ఆర్థిక, పాలనాపరమైన ప్రాధాన్యతలపై చర్చించారు. 

పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో దేశ సాయుధ దళాలు చేపట్టిన ప్రతి చర్యకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. దేశంలో శాంతి, ఐక్యతకు తెలంగాణ కట్టుబడి ఉందన్నారు.1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో దేశానికి చిరస్మరణీయమైన విజయం అందించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.