- విద్యాసంస్థల్లో అడ్మిషన్స్ టైంలో ప్రమాణ ప్రతం తీసుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వక భేటీ
- జూన్ 12న నిర్వహించనున్న డ్రగ్స్ అవగాహన కార్యక్రమంపై చర్చ
హైదరాబాద్, వెలుగు: విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలని, విద్యాసంస్థల్లో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ఆదివారం లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలతోపాటు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న క్యూర్, మరో రెండు బిల్లుల ఆమోదం, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ఈ భేటీలో సీఎంతోపాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంకు గవర్నర్ సూచించారు.
జూన్ 12న ఎల్బీ స్టేడియంలో గవర్నర్ స్వయంగా పాల్గొననున్న భారీ అవగాహన కార్యక్రమంపై కూడా సీఎంతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులతో డ్రగ్స్ నియంత్రణపై ప్రమాణం చేయించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు అడ్మిషన్ తీసుకునే సమయంలోనే ‘మేం ఎట్టి పరిస్థితుల్లోనూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటాం’ అని లిఖితపూర్వకంగా ప్రమాణపత్రం ఇచ్చేలా నిబంధన తీసుకురావాలని సూచించారు
స్టూడెంట్స్‌పై నిత్యం నిఘా ఉండాలి: గవర్నర్
విద్యాసంస్థలు చదువుకే పరిమితం కాకుండా, మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం కృషి చేయాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. విద్యాసంస్థల ప్రాంగణాలు మత్తు పదార్థాలకు అడ్డాగా మారకుండా నిరంతర నిఘా ఉంచాలని, టీచర్లు విద్యార్థుల ప్రవర్తనను పర్యవేక్షించాలని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో పూర్తి సహకారాన్ని అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గవర్నర్ ఇచ్చిన ప్రతి సూచనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని, విద్యాశాఖ అధికారులతో సమీక్షించి అమలుకు చర్యలు చేపడతామని సీఎం తెలిపారు.
ఎమ్మెల్సీల నియామకంపై చర్చ..
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ నియామక ప్రక్రియపై హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ నేపథ్యంలో గవర్నర్‌ను సంప్రదించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్టు తెలిసింది. గతంలో ప్రభుత్వం సిఫార్సు చేసిన పేర్లపై న్యాయస్థానం చేసిన సూచనలు, రాజ్యాంగపరమైన నిబంధనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
కేబినెట్ నిర్ణయానికి తగ్గట్టుగా కోదండరాం, అజారుద్దీన్‌ల పేర్లను ఆమోదించే అంశంపై ఇరువురి మధ్య విస్తృత చర్చ జరిగింది. కోర్టు సూచనల మేరకు గవర్నర్‌ను నేరుగా సంప్రదించి, ఈ ప్రక్రియలో ఉన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. దీనికి సానుకూలంగా స్పందించిన గవర్నర్.. రాజ్యాంగబద్ధంగా అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం.

