పైరవీలు కాదు.. ప్రజల కోసం పనిచేయండి.. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి

పైరవీలు కాదు.. ప్రజల కోసం పనిచేయండి.. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి
  • ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తే మంచి పొజిషన్‌‌కు వెళ్తరు 
  • పైరవీలతో పదవిని దుర్వినియోగం చేస్తే మీరే నష్టపోతరు
  • మనల్ని వ్యతిరేకించే వాళ్లను సైతం కలుపుకొనిపోవాలి
  • కష్టపడి పనిచేస్తేనే మీకు, పార్టీకి భవిష్యత్తు
  • కాంగ్రెస్‌‌లో ఏ కోటా ఉండదు.. ఒక్క మెరిట్ కోటా తప్ప 
  • ప్రభుత్వ పనితీరు వల్లే ఎన్నికల్లో ఓట్ షేర్ క్రమంగా పెరుగుతున్నది
  • కాంగ్రెస్ వల్లే మున్సిపల్ ఎన్నికల్లో 63 శాతం మంది బీసీల గెలుపు
  • దేశాన్ని, కాంగ్రెస్‌‌ను విడదీసేందుకు బీజేపీ ప్రయత్నం
  • రెండు రాష్ట్రాలు కలిసి ఎదగాలి.. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎదగాలని పిలుపు

హైదరాబాద్, వెలుగు:  పైరవీల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించాలని,  ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేసే వారికే రాజకీయంగా మంచి భవిష్యత్​ ఉంటుందని  జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులకు సీఎం రేవంత్‌‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తే మంచి పొజిషన్‌‌కు వెళ్తారని చెప్పారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌‌లో శనివారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు  ప్రారంభమైన శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్​ అధికారంలో ఉన్న సమయంలో డీసీసీ అధ్యక్ష పదవి రావడం ఒక మంచి అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తెచ్చి పరిష్కరించేందుకు ప్రయత్నించాలి” అని స్పష్టం చేశారు.


‘‘కష్టపడ్డ వారికే ప్రజల్లో మంచి గుర్తింపు, పార్టీలో రాజకీయంగా మంచి అవకాశాలు వస్తాయి. అంతే తప్ప పైరవీకారులుగా ముద్రపడ్తే అందరిలో చులకన అయిపోతారు. రాజకీయ అవకాశాలు రావు. పైరవీలకు ఎప్పుడైతే మీరు దూరంగా ఉంటారో..అప్పుడే  గౌరవం, పదవులు మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి’’ అని సీఎం రేవంత్​ తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే అది వ్యక్తిగతంగా మీకు,  ప్రభుత్వానికి ఉపయోగపడ్తుందన్నారు. 

 వచ్చిన పదవిని హోదాగా భావించకుండా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని  సంపూర్ణమైన బాధ్యతతో కాంగ్రెస్ కోసం పునరంకితం కావాలని ఆకాంక్షించారు.  ప్రభుత్వ పనితీరువల్లే ఈ రెండున్నరేండ్లలో  కాంగ్రెస్‌‌‌‌కు ప్రతి ఎన్నికల్లో క్రమంగా ఓట్ షేర్  పెరుగుతూ వస్తున్నదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌కు ప్రత్యర్థి పార్టీకి ఉన్న తేడా 2 శాతం కాగా, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి 4 శాతానికి పెరిగిందన్నారు. మున్సిపల్ ఎన్నికలకు 12 శాతానికి పెరిగిందని వివరించారు. కాంగ్రెస్ వల్లే మున్సిపల్ ఎన్నికల్లో 63 శాతం మంది ఓబీ సీలు గెలిచారని చెప్పారు. 

కుటుంబ పెద్దగా ఆలోచించండి.. 

డీసీసీ అధ్యక్షులు జిల్లాల్లో పార్టీకి పెద్ద దిక్కులా ఉండాలని , అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సూచించారు.  ‘‘మీరు కుటుంబ పెద్దగా వ్యవహరించాలి. నచ్చనోళ్లను అడ్డు తొలగించుకోవడం కాదు, దారిలోకి తెచ్చుకోవాలి.  జిల్లా పార్టీ అధ్యక్షులుగా మిమ్మల్ని వ్యతిరేకించే వారిని సైతం కలుపుకొనిపోవాలి. లేదంటే పార్టీకి కీడు జరుగుతుంది. 

నేను పీసీసీ అధ్యక్షుడయ్యాక ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లిన. ‘మీ కంటే వయసులో, అనుభవంలో చిన్నవాడినే  కావచ్చు.. కానీ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చినందున సహకరించాలి’ అని విజ్ఞప్తిచేసిన.  అందరం కలిసి పని చేస్తే పార్టీకి భవిష్యత్​ ఉంటుందని చెప్పిన. ఐదు, పది మంది నాయకులం  కొట్లాడుకుంటే లక్షలాది మంది కార్యకర్తలు, పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరుగుతుంది కదా అని అందరూ పెద్ద మనసు చేసుకొని ముందుకు వచ్చారు.  సరిగ్గా రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకున్నాం” అని  వివరించారు. 

మీ రాజకీయ జీవితంలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి అత్యంత కీలకమైందని, హైకమాండ్​ మీపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దని సూచించారు. ‘‘ఈ విలువైన పదవిని మీరు దుర్వినియోగం చేయకండి. జాగ్రత్తగా ప్రజల కోసం వినియోగించి, కార్యకర్తలను సమన్వయం చేసుకోండి. అప్పుడే మీరు ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో,  ఎంపీనో, మంత్రో, ముఖ్యమంత్రో... ఏ స్థాయికైనా ఎదిగే అవకాశముంటుంది” అని తెలిపారు.  

శిక్షగా భావించవద్దు.. 

ఈ శిక్షణను శిక్షగా భావించవద్చని డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సూచించారు. ‘‘శిక్షణలో భాగంగా10 రోజులు ఇక్కడ ఉండడం అనేది మీరు శిక్షగా భావిస్తే దీని వల్ల ప్రయోజనం సున్నా . ఈ శిక్షణ అనేది మీ జీవితంలో కాంగ్రెస్ పార్టీపరంగా, ప్రజా సమస్యలపరంగా మీకు ఒక సంపూర్ణమైన అవగాహన కల్పించే అవకాశంగా భావించండి. కాంగ్రెస్ పార్టీలో మీ అవకాశాలు మెరుగుపడడానికి కూడా ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుంది” అని చెప్పారు. 

ఈ శిక్షణ కార్యక్రమం వల్లే రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో  ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం వచ్చిందని గుర్తుచేశారు. ‘‘జిల్లా పార్టీ అధ్యక్షుడు అనే పదవితో కాంగ్రెస్ పార్టీలో చాలా డోర్లు ఓపెన్ అవుతాయి.  ఇదే రూమ్ లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ  వచ్చి కూర్చొని మీతో మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే జాతీయ నాయకత్వాన్ని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడే అవకాశం వస్తుంది” అని తెలిపారు. కష్టపడితేనే కాంగ్రెస్‌‌‌‌లో పదవులు వస్తాయని, మెరిట్​కోటాలోనే పదవుల తెచ్చుకోవాలని సూచించారు.

కుట్రలను తిప్పికొట్టాలి.. 

కాంగ్రెస్​ఈ దేశ ఆత్మ అని, దేశాన్ని   కాంగ్రెస్​ను విడదీసి చూడలేమని సీఎం రేవంత్‌‌‌‌ చెప్పారు.  కాంగ్రెస్ పార్టీకి గతమే కాదు భవిష్యత్తు కూడా ఉందన్నారు.  కానీ కాంగ్రెస్‌‌‌‌ను దెబ్బదీయాలని బీజేపీలాంటి పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.  ఈ దేశంలో స్వాతంత్ర్యం కోసం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. మిగతా పార్టీలన్నీ కాంగ్రెస్​ తెచ్చిన స్వాతంత్ర్యం, రాజ్యాంగం ద్వారా అవకాశాల్ని అందిపుచ్చుకొని ఇవాళ కాంగ్రెస్ ముక్త్  భారత్ అంటున్నాయని మండిపడ్డారు. 

ఈ దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఒక పక్క,  పేదలకు అందుతున్న రిజర్వేషన్లను రద్దు చేయాలని మరో పక్క కుట్ర జరుగుతున్నదన్నారు. ఇలాంటి కుట్రలను మనమంతా తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి  పిలుపునిచ్చారు. బీజేపీ వారసత్వం ఉన్న వారు గాంధీని బలితీసుకున్నారని ఆరోపించారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన  గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.  రెండు తెలుగు రాష్ట్రాలు  అభివృద్ధి చెందాలని,  రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ  బలపడాలని, ఇందుకోసం పార్టీ జిల్లా అధ్యక్షులు బాధ్యతగా పనిచేయాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు.

అన్నీ జూన్​లోనే.. 

 తన జీవితంలో జరిగిన కీలకమైన  ఘట్టాలకు జూన్  నెలతో ఉన్న సంబంధాన్ని  డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి వివరించారు. ‘‘2006 జూన్ లో నేను మొట్టమొ దటిసారి జడ్పీటీసీ అయ్యాను. 2007 జూన్‌‌‌‌లో ఎమ్మెల్సీ అయిన. 2009 జూన్‌‌‌‌లో ఎమ్మెల్యేగా ఎన్నికైన. 2014 జూన్ లో మరోసారి ఎమ్మెల్యే అయిన. 2019 జూన్‌‌‌‌లో ఎంపీగా గెలిచిన. 2021 జూన్‌‌‌‌లో  పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న. 2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో సీఎం అయ్యా. ఇది నా రాజకీయ ప్రస్థానం’’ అంటూ వివరించారు.

సమర్థ నాయకత్వం కోసమే శిక్షణ శిబిరాలు: పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్ సమర్థవంతమైన నాయకత్వం కోసమే కాంగ్రెస్ అధిష్టానం డీసీసీ అధ్యక్షులకు ఈ–శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. శనివారం ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఇదో చరిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ప్రతి డీసీసీ అధ్యక్షుడు నరనరాన ఎక్కించుకోవాలని, దేశంలో కాంగ్రెస్ సంస్థాగత మార్పుకు ఇది ఎంతో దోహదం చేయనుందన్నారు. ప్రతి నాయకుడు నిత్య విద్యార్థి అని, జీవితం అంటేనే నేర్చుకోవడం అని చెప్పారు. 

రాజకీయాల్లో ప్రతి నేత తానే మేధావిని అనుకుంటే పొరపడ్డట్లేనని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, ఏపీలో కూడా కాంగ్రెస్ చీకట్లు త్వరలోనే తొలగి, వెలుగుల్లోకి రానుందన్నారు. హైకమాండ్ నిర్ణయాలు, వారు తీసుకునే విధానాల ప్రకారం ప్రతి డీసీసీ అధ్యక్షుడు నడుచుకోవాలని సూచించారు. ప్రజల మద్దతుతో  పంచాయతీ ఎన్నికల్లో 75 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లను గెలిచామని మహేశ్ గౌడ్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దేశంలో రాహుల్ గాంధీ కూడా ప్రధాని అయ్యే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌యూఐ నుంచి కాంగ్రెస్ కు రాష్ట్ర అధ్యక్షుడిని అయ్యానని, ఇలాంటివి ఈ పార్టీలోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రెండు రాష్ట్రాలకు చెందిన 75 మంది డీసీసీ అధ్యక్షులు, ఇతర నేతలు పాల్గొన్నారు.