ఓటర్ లిస్ట్లో పేరు లేకుంటే ప్రభుత్వ స్కీములకు ఇబ్బందులు: సీఎం రేవంత్ రెడ్డి

ఓటర్ లిస్ట్లో పేరు లేకుంటే ప్రభుత్వ స్కీములకు ఇబ్బందులు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. నేతలు, కార్యకర్తలకు SIRపై అవగాహన కల్పించారు. అంతా సర్ ఫామ్ నింపి ఓటు కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఓటర్ లిస్ట్లో పేరు లేకుంటే ప్రభుత్వ స్కీములకు ఇబ్బందులు తప్పవని సీఎం చెప్పారు.

కొడంగల్లో 78 శాతం SIR మాత్రమే పూర్తయిందని ఆయన చెప్పారు. సర్ ప్రక్రియలో పాల్గొన్న సీఎం ఫామ్ నింపారు. బీఆర్ఎస్, బీజేపీ వేరు కావొచ్చని.. కానీ లక్ష్యం ఒక్కటేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఓట్లను తొలగించే కుట్ర జరుగుతుందని సీఎం ఆరోపించారు.

కొడంగల్లో స్థానిక నాయకులు, BLAలతో SIRపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కొడంగల్ ప్రజలు, కార్యకర్తల ఆశీర్వాదంతోనే మనకు రాష్ట్రానికి నాయకత్వానికి వహించే అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కొడంగల్లో రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదులు దెబ్బతీయాలని చూస్తున్నారని సీఎం ఆరోపణలు చేశారు.

పేర్లు వేరైనా బీఆరెస్, బీజేపీ రెండూ ఒక్కటేనని, కొడంగల్లో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో పొగ పెడితే రేవంత్ రెడ్డి బయటకు రాకుండా ఉంటారని కుట్రలు చేస్తున్నారని సీఎం చెప్పారు. ఎదురు నిలబడలేక దొంగదెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
* 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం కోసం రోజుకు 18 గంటలు పనిచేసినా నాకు సమయం సరిపోవడం లేదు 
* కొడంగల్లో కుట్రలు చేసేవారిని బొంద పెట్టే బాధ్యత మీపై ఉంది
* ఆగస్టు 3 వరకు SIR గడువు ఉంది
* కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం ఓట్లలో ఇప్పటివరకు లక్షా 96 వేల 620 ఓట్లు ప్రక్షాళన అయ్యాయి
* ఇంకా నమోదు చేసుకోని వారి సంఖ్య 54 వేల 635 
* మొత్తం ఓట్లలో ఇంకా 22 శాతం ఇంకా నమోదు జరగలేదు.
* ఆ ఓట్లను తొలగిస్తే ప్రమాదం పొంచి ఉంది
* వారందరినీ తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది
* ఓటు పోగొట్టుకుంటే గుర్తింపు ఉండదు
* కార్యకర్తగా ఇంటింటికీ వెళ్లి ఓటరు  వెరిఫికేషన్ ఫారం నమోదు చేయించాలి 
* ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లు తొలగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది
* BJP, BRS ఒక్కటై కాంగ్రెస్ను దొంగదెబ్బ తీయాలని గూడుపుఠాణి చేస్తున్నాయి
* ఓటర్ల వివరాలు ఎన్నికల అధికారులకు అందించాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్లపైనే ఉంది 
* ఈ నెల 30 లోగా నూటికి నూరు శాతం కొడంగల్ నియోజకవర్గంలో ప్రక్షాళన పూర్తి కావాలి 
* అర్హత ఉన్న ఏ ఒక్కరూ ఓటు కోల్పోవడానికి వీల్లేదు