బీజేపీది జెమినీ సర్కస్.. మళ్ళీ రెండు సీట్లకే వస్తది!.మోదీ తీరుపై రేవంత్ ఫైర్

బీజేపీది జెమినీ సర్కస్.. మళ్ళీ రెండు సీట్లకే వస్తది!.మోదీ తీరుపై రేవంత్ ఫైర్

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. అటు కేంద్రంలోని బీజేపీ తీరును, ఇటు రాష్ట్రంలోని బీఆర్ఎస్ వైఖరిని ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రధాని మోదీ ముస్లింలు, మావోయిస్టులపై చేస్తున్న వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని స్థాయిలో ఉండి మతాలు, కులాలను అవమానించడం తగదని.. తెలంగాణ గడ్డపై వచ్చి విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. మోదీ తన వైఫల్యాలను ప్రజలపై రుద్దుతున్నారని, బీజేపీ ఎన్నికల విధానం జెమినీ సర్కస్ లా మారిందని ఎద్దేవా చేశారు. గతంలో రెండు సీట్లతో మొదలైన బీజేపీ, మళ్లీ అక్కడికే చేరుకుంటుందని జోస్యం చెప్పారు.

రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరు అని స్పష్టం చేసిన సీఎం రేవంత్..  కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసాను రాష్ట్రం కోసం రాబట్టుకుంటామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కేంద్ర నిధులను పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని నాతో తీసుకెళ్తానని మోదీ అన్నారు.. నన్ను కాదు అని తన ఢిల్లీ పర్యటనపై స్పష్టత ఇచ్చారు.

మావోయిస్టులు అంటే గ్రహాంతరవాసులు కాదని, వాళ్లు కూడా ఈ సమాజంలోని ప్రజలేనని సీఎం వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోనే మావోయిస్టుల సరెండర్ జరిగిందని గుర్తు చేశారు. ఇక బండి భగీరథ కేసులో ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమని.. దీనిపై సమీక్ష నిర్వహించి సిట్ వేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖాళీగా ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేసిన ప్రవీణ్ కుమార్.. బీఆర్ఎస్‌లో చేరాక ప్రభాకర్ రావును వెనకేసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. మైకుల ముందు మాట్లాడినట్లు పోలీసు విచారణ జరగదు.. ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి అని సవాల్ విసిరారు.

జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జూన్ 2 లోపు జర్నలిస్టుల ఇళ్ల విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 21న జరిగే క్యాబినెట్ భేటీలో చర్చించి, దీనికి చట్టబద్ధత కల్పిస్తామని స్పష్టం చేశారు. అలాగే హ్యామ్ రోడ్ల టెండర్లు వేసిన వారిలో 90 శాతం మంది హరీష్ రావు మనుషులే ఉన్నారని ఆరోపిస్తూ.. చట్టాలను విచక్షణారహితంగా దుర్వినియోగం చేయబోనని సీఎం తేల్చి చెప్పారు.