- భూములు ఇచ్చిన నిర్వాసితులకు వారంలోగా ప్లాట్లు అందజేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
- ఇకపై ప్రతి నెలా హకీంపేట్‌లోనే బసచేసి పనులను పర్యవేక్షిస్తా
- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ పూర్తిచేసి టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశం
- కొడంగల్ సెగ్మెంట్లో రోడ్లు, తాగునీరు, ఎత్తిపోతల ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం హకీంపేట గ్రామంలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనుల్లో ఆలస్యంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా హకీంపేటలోని ఎడ్యుకేషన్ హబ్‌లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంజనీరింగ్ కళా శాల, హాస్టల్ భవనాలు, వెటర్నరీ కళాశాల, ప్రభుత్వ మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కళాశాలల నిర్మాణ పనులను మంగళవారం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.
పనులు ఆశించిన వేగంతో ముందుకుసాగకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. ఇకపై ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీ పురోగతి నివేదికను ఎప్పటికప్పుడు తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం వహించే అధికారులను సహించేది లేదని, సస్పెన్షన్ వేటు వేసేందుకు కూడా వెనకాడబోనని హెచ్చరించారు. ఎడ్యుకేషన్ హబ్ పనుల పర్యవేక్షణ కోసం ఇకనుంచి ప్రతి నెలా ఒక రోజు తాను సైట్‌లోనే బస చేస్తానని, నిర్మాణ పనుల నాణ్యత, వేగంలో రాజీ పడొద్దన్నారు.
వచ్చే వారంలోగా నిర్వాసితులకు పట్టాలు..
హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులకు పునరావాస ప్లాట్ల కేటాయింపు ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యంపై జిల్లా ఉన్నతాధికారుల మీద సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిర్వాసితులకు న్యాయం చేయడంలో యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. భూములు కోల్పోయిన లబ్ధిదారులందరికీ వచ్చే వారం ప్లాట్ల పట్టాలను అందజేయాలని డెడ్‌లైన్ విధించారు. వివిధ కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణ ప్రాంతాలను పర్యవేక్షించిన సీఎం.. మౌలిక వసతుల నాణ్యతలో ఎలాంటి లోపాలు ఉండకూడదని చెప్పారు. ఇంజినీరింగ్, మెడికల్, వెటర్నరీ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి విద్యాసంస్థలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
కొడంగల్ అభివృద్ధి పనులపై ఉన్నతస్థాయి సమీక్ష
కొడంగల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న వివిధ రకాల సంక్షేమ, అభివృద్ధి పనుల పురోగతిపై హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్‌రెడ్డితోపాటు వివిధ శాఖల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, వికారాబాద్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత కాలపరిమితిలోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) స్థాయి అధికారిని నియమించి, నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
కొడంగల్ ప్రాజెక్టు భూసేకరణ పూర్తిచేయాలి..
మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) ప్రాజెక్టుకు అవసరమైన భూసేక రణ స్పీడప్ చేయాలని ఇరిగేషన్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన సర్వేయర్లను తక్షణమే నియమించి, భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఆ వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి ప్రాజెక్టు పనులను పట్టాలెక్కించాలన్నారు. ‘కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, తండాకు రోడ్డు సదుపాయం కల్పించాలి. ఇందుకు అవ సరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.
ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి నాణ్యమైన బీటీ రోడ్డు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలను తక్షణమే చేపట్టాలి. రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున, నియోజకవర్గ పరిధిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి’ అని సీఎం సూచించారు.
