మేమేం బిచ్చం అడగట్లే.. మెట్రోకు మంజూరైన లోన్ ఇమ్మంటున్నం: సీఎం

మేమేం బిచ్చం అడగట్లే.. మెట్రోకు మంజూరైన లోన్ ఇమ్మంటున్నం: సీఎం
  • కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో భేటీకి రెడీ.. కిషన్‌‌రెడ్డి టైం ఇప్పించాలి 
  • 50:50 నిష్పత్తిలో మెట్రోను కేంద్రం చేపట్టాలి..
  • సీఎం రేవంత్‌‌రెడ్డి బహిరంగ లేఖకేంద్రం ముందుకు రాకుంటే 
  • సొంత నిధులతో చేపడతామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ మెట్రో రైలు విస్తరణ, ఫేజ్-1 టేకోవర్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, దాని పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఎఫ్‌‌సీ  అనుసరిస్తున్న తీరుపై సీఎం రేవంత్‌‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని నిబంధనలను పాటించి, ఒప్పందాలు కుదుర్చుకొని, చెల్లించాల్సిన ఫీజులు చెల్లించినప్పటికీ తొలి విడత లోన్​ నిధుల 
విడుదలలో  కేంద్ర సంస్థ తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. 

తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాంటి బిచ్చమో,  ప్రత్యేక సాయమో అడగడం లేదని, అన్ని రకాల తనిఖీల తర్వాత చట్టబద్ధంగా మంజూరైన రుణాన్ని మాత్రమే విడుదల చేయాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌‌రెడ్డికి సీఎం రేవంత్‌‌రెడ్డి మంగళవారం ఓ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రిగా తక్షణమే జోక్యం చేసుకొని, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో మాట్లాడి నిధుల విడుదలకు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తాను ఢిల్లీ వస్తానని, కేంద్ర మంత్రితో సమావేశానికి కిషన్‌‌రెడ్డి టైం ఇప్పించాలని లేఖలో రేవంత్ విజ్ఞప్తి చేశారు. 

కేంద్ర ప్రతినిధి సమక్షంలోనే వాల్యుయేషన్..  

హైదరాబాద్ మెట్రో స్వాధీన ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా, పక్కా నిబంధనల ప్రకారమే జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టేకోవర్ విలువను లెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి ‘ఆఫీసర్స్ కమిటీ’లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా నామినేట్ చేసిన యూపీ మెట్రో రైల్ కార్పొరేషన్  మేనేజింగ్ డైరెక్టర్  సుశీల్ కుమార్‌‌ను కూడా సభ్యుడిగా చేర్చినట్టు గుర్తుచేశారు. అత్యున్నతస్థాయి నిపుణుల పర్యవేక్షణలో జరిగిన ఈ వాల్యుయేషన్ ప్రక్రియ, డ్యూ డిలిజెన్స్ నివేదికల ఆధారంగానే ఒప్పందాలు జరిగాయని, ప్రతి అడుగును
 ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేస్తూనే ముందడుగు వేశామని లేఖలో వివరించారు.

గడువు ముగిసినా రాని నిధులు.. 
9వ స్థానానికి హైదరాబాద్

అన్ని రకాల ఒప్పందాలు పూర్తై, జూన్ 15 నాటికే తొలి విడత నిధులు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఐఆర్ఎఫ్‌‌సీ నుంచి ఎలాంటి నిధులూ విడుదల కాకపోవడం అత్యంత ఆందోళనకరమని సీఎం రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. గత పదేండ్లుగా మెట్రో విస్తరణ పనులు చేపట్టకపోవడం వల్ల దేశంలోనే అత్యుత్తమ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం 9వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలు దూసుకుపోతుంటే, హైదరాబాద్ మాత్రం వెనుకబడిపోతోందన్నారు.

ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పరిధిలోకి.. 
అందుకే టేకోవర్

హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 కింద ఎల్‌‌అండ్ టీ సంస్థ పీపీపీ విధానంలో 69 కిలోమీటర్ల మేర 57 స్టేషన్లతో మెట్రోను విజయవంతంగా నడుపుతోందని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. భవిష్యత్ అవసరాల కోసం రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో 122.9 కిలోమీటర్ల మేర 7 కారిడార్లతో కూడిన ఫేజ్-2 ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపినట్టు తెలిపారు. ప్రైవేట్ పరిధిలోని ఫేజ్–-1, ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఫేజ్-–2 మధ్య సమన్వయం కుదరడం కష్టమని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందని, దీంతో మెట్రో వ్యవస్థను ఒకే గొడుగు కిందికి తేవాలనే సంకల్పంతో.. ఫేజ్-–1ను ప్రభుత్వమే పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్టు వివరించారు.  

ఫేజ్-–1 స్వాధీన ప్రక్రియ కోసం మొత్తం రూ.15వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు లెక్కతేల్చారని, ఇందులో ఈక్విటీ కొనుగోలుకు రూ.1,461.47 కోట్లు కాగా, పాత రుణాల రీఫైనాన్సింగ్ కోసం రూ.13,538.53 కోట్లు కేటాయించారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఆర్ఎఫ్‌‌సీ ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను క్షుణ్నంగా పరిశీలించి రుణాన్ని మంజూరు చేసిందని చెప్పారు. దీనికి  రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడంతోపాటు ఆర్‌‌బీఐ ద్వారా డైరెక్ట్ డెబిట్ మెకానిజం (డీడీఎం)ను కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.1,461.47 కోట్లను ఎస్క్రో ఖాతాలో జమ చేయడంతోపాటు అప్‌‌ఫ్రంట్ ఫీజు కింద ఐఆర్ఎఫ్‌‌సీ డిమాండ్ చేసిన రూ.84.32 కోట్లను కూడా ఇప్పటికే చెల్లించిందని సీఎం వివరించారు.

అధిక వడ్డీ భారం తగ్గించేందుకే ఐఆర్ఎఫ్‌‌సీ రుణం..

గతంలో ఎల్‌‌అండ్‌‌టీ తీసుకున్న రుణాలకు అత్యధిక వడ్డీ రేట్లు ఉండడం వల్లే ప్రాజెక్ట్ ఆర్థిక మనుగడ కష్టంగా మారిందని, అందుకే తక్కువ వడ్డీ రేట్లు, సుదీర్ఘ రీపేమెంట్ కాలపరి మితి ఉండే ఐఆర్ఎఫ్‌‌సీ రీఫైనాన్సింగ్‌‌ను ఎంచుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరిం చారు. దీనివల్ల హైదరాబాద్ మెట్రోకు ఆర్థిక సుస్థిరత చేకూరుతుందన్నారు. ఇక ఫేజ్–-2 ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వా మ్యంతో 50:50 జాయింట్ వెంచర్ పద్ధతిలో చేపట్టాలని కోరిన రేవంత్.. ఒకవేళ ఈ జాయింట్ వెంచర్ ఆమోదంలో కేంద్రం వైపు నుంచి ఆలస్యమైతే, ప్రాజెక్టును ఆపకుండా రాష్ట్ర ప్రభుత్వ సొంత వనరులు, సంస్థాగత రుణాల ద్వారా పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన ముందస్తు అనుమతులు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.