న్యాయమంటే శిక్ష పడటమే కాదు.. బాధితులకు భరోసా కల్పించాలె: సీఎం రేవంత్

న్యాయమంటే శిక్ష పడటమే కాదు.. బాధితులకు భరోసా  కల్పించాలె: సీఎం రేవంత్
  • కోర్టుల్లోనే కాదు ప్రతి దశలోనూ న్యాయం ఉండాలె
  •  పిల్లలు, మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం
  • బాలికా సంరక్షణ కోసమే  ‘భరోసా’ 
  •  రాష్ట్ర వ్యాప్తంగా 29 భరోసా కేంద్రాలు  
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


హైదరాబాద్: మహిళలు, పిల్లల రక్షణకు తమ ప్రభుత్వం  ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. లైంగిక వేధింపుల  నుంచి అన్ని రకాల రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయం జరగడం అంటే నేరం చేసిన వారికి శిక్షపడటమే కాదని, బాధితులకు భరోసా కల్పించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు.  బాలికా సంరక్షణ కోసం తెలంగాణ “భరోసా” ప్రాజెక్టును తీసుకొచ్చింది.  అనుసంధానంగా 29 కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఎంసీహెచ్ ఆర్డీలో చిన్నారులపై లైంగిక వేధింపుల నిర్వహించిన సదస్సులో సీఎం మాట్లాడారు. వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ అనే థీమ్ తో ఈ సదస్సును ఏర్పాటు చేయడం చాలా అవసరమని తాను భావిస్తున్నట్టు చెప్పారు. తమ బాధను చెప్పుకోలేని వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో కీలకమైన ఈ సదస్సు నిర్వహిస్తున్న రాష్ట్ర పోలీసుశాఖను, నిర్వాహకులను సీఎం అభినందించారు. మహిళలు, బాలికలపై నేరాలను నియంత్రించడమే కాకుండా చట్టపరమైన అన్ని రక్షణలను కల్పించాలని అన్నారు.  రాష్ట్రంలోని భరోసా  కేంద్రాల ద్వారా బాధిత మహిళలు, బాలలకు పోలీసు సహాయమే కాకుండా న్యాయ పరమైన సహాయం, వైద్య సహాయం, కౌన్సెలింగ్‌ వంటి సేవలను అందిస్తున్నాయని సీఎం వివరించారు.

 భరోసా కేంద్రం ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం చెప్పారు.  కేసులను వేగవంతంగా పరిష్కరించడమే కాకుండా పిల్లలకు సంపూర్ణ రక్షణ, వారిలో విశ్వాసం, అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం ఈ కేంద్రాల లక్ష్యమని వివరించారు. పోక్సో, జువైనల్ చట్టాల ఆచరణలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఆ చట్టాలు బాధితులకు ఎలాంటి హాని కలిగించకుండా, వారి భవిష్యత్తుకు సంపూర్ణ  రక్షణ ఉండాలని సీఎం ఆకాంక్షించారు.  సోషల్ మీడియా ద్వారా పిల్లలపై జరిగే దురాగతాలు, దుర్వినియోగం చేస్తున్న వారి పట్ల  కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధం ఉందని చెప్పారు.  న్యాయం కేవలం కోర్టుల్లోనే కాకుండా ప్రతి దశలోనూ రక్షణ ఉండాలని అన్నారు. సదస్సులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్డు జడ్జిలు, రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు   పాల్గొన్నారు.