
- అధికారం లేకపోతే ఉండలేక పోతున్నరు.. అన్ని వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు
- బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపాటు
- స్వార్థంతో విషం చిమ్ముతున్నరు.. అభివృద్ధిపై యాసిడ్ దాడి చేస్తున్నరు
- వాళ్ల పార్టీలోని ఆధిపత్య పోరు అందరికీ తలనొప్పిగా మారింది
- ఒకాయన పొద్దున ప్రెస్‌మీట్ పెడ్తే.. పోటీగా ఇంకొకాయన మధ్యాహ్నం ట్వీట్ చేస్తడు.. మళ్లొకలు ప్రెస్ నోట్ రిలీజ్ ఇస్తరు
- రాష్ట్రం దివాలా తీస్తేనే వాళ్లకు సంతోషం.. ఎందుకంత కడుపు మంట?
- వాళ్ల అనుభవాన్ని రంగరించి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వొచ్చు కదా?
- గచ్చిబౌలి భూముల చుట్టూ చేరిన గుంట నక్కలకు గుణపాఠం తప్పదు
- అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రతిష్టను దిగజార్చాలని ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని.. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు, అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టి పెట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రం దివాలా తీస్తేనే వారికి సంతోషం. రాష్ట్రం కుప్పకూలాలని, తప్పుడు ప్రచారం చేసి ప్రతిష్టను మసకబార్చాలని చూస్తున్నరు.. తద్వారా పెట్టుబడులను అడ్డుకోవాలని చూస్తున్నరు” అని మండిపడ్డారు. ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం
చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రావని తెలిపారు.
అసెంబ్లీలో బుధవారం హోంశాఖ పద్దు, శాంతి భద్రతలపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలను కూడా వాళ్ల స్వార్థం కోసం ప్రభుత్వం విఫలమైందని చిత్రీకరించాలని చూస్తున్నరు. తెలంగాణ అభివృద్ధి మీద కూడా యాసిడ్ దాడి చేసే పరిస్థితులు వచ్చాయి.. తెలంగాణ కుప్ప కూలాలన్న ఆలోచనతో కుట్రపూరితంగా అన్ని వేదికల మీద తప్పుడు ప్రచారం చేయడంతో రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలు చేస్తున్నరు’’ అని బీఆర్ఎస్పై రేవంత్ ఘాటుగా స్పందించారు. ‘‘పదేండ్లు ప్రభుత్వం నడిపారు. ఉద్యమం చేసినమని ఏ నాయకులు చెప్పుకుంటున్నరో వాళ్లకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ? ఓన్లీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటేనా? అధికారమే మీ పరామావధినా? అధికారం పోతే ఒక్క క్షణం భరించం.. ఉండం అనే రీతిలో విపరీతమైన పోకడలకు పోతున్నరు. ఇది తెలంగాణ సమాజానికి ఏ రకంగా మేలు చేస్తుంది?” అని నిలదీశారు.
మీ హయాంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెట్లొస్తయ్?
ఉప ఎన్నికలంటూ జరుగుతున్న ప్రచారంపై సభ్యులెవ రూ ఆందోళన చెందాల్సిన పనిలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘ఏ ఉప ఎన్నికలూ రావు. వారు ఇటొచ్చినా.. అటొచ్చినా.. ఉప ఎన్నికలను కోరుకున్నా.. రావు. దానిపై దృష్టిపెట్టాల్సిన అవసరం లేదు” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘మా దృష్టి ఎన్నికలు, ఉప ఎన్నికల మీద లేదు. మా దృష్టంతా అభివృద్ధి, సంక్షేమం మీద ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, శాంతి భద్రతలను కాపాడాలన్నదానిపైనే మా ఫోకస్. ఎవరైనా తప్పులు చేస్తే కఠినంగా వ్యవహరిస్తం. అంతకు మించి ఏమీ లేదు.. మాకు ప్రతిపక్ష పార్టీపై ఏ ద్వేషం లేదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘‘రూల్ బుక్ కూడా మారలేదు. నేను ఎవరి అడుగు జాడల్లో నడవడం లేదు. ఆయన అడుగుల్లో నడిస్తే మడుగులో పడ్తాం సడుగులు ఇరుగుతయ్. సంప్రదాయాలను పాటిస్తామనే అంటు న్నం. అప్పుడే ఒకాయన అంటడు ‘వచ్చేసినయి.. బై ఎలక్షన్స్’ అని టికెట్లు పంచుతడు. ఆయన టికెట్లు పంచిండు కదా అని నేను పంచాలని ఇంకొకాయన పంచుతడు. పాపం ఒకాయన నేనే అభ్యర్థిని అని చెప్పుకుంటున్నరు. వాళ్ల(బీఆర్ఎస్)కు మంచి పంచె కడితే కూడా నచ్చదు. ఒకాయన నాకు మంచి మిత్రుడు.. కడక్ తయారైతే మంత్రి ఉద్యోగం ఊడ్తదని అప్పట్లోనే ఆయనకు చెప్పిన. చెప్పినట్లే నెలకు అదే అయింది” అని వ్యాఖ్యానించారు.
వాళ్ల వాళ్ల పోరు తలనొప్పిగా మారింది
బీఆర్ఎస్ పార్టీలోని వాళ్ల పోరు తమకు తలనొప్పిగా మారిందని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ‘‘వాళ్లకు అంతర్గతంగా ఏమైనా ఉంటే ఉండనీయండి. మాకేం అభ్యంతరం లేదు. ఒకాయన పొద్దున ప్రెస్ మీట్ పెడితే.. మధ్యాహ్నం ఒకాయన ట్విట్టర్లో పెడ్తడు. ఇంకోకాయన ప్రెస్ రిలీజ్ ఇస్తడు. వీళిద్దరూ ఇట్ల చేస్తున్నరని.. పెద్దల సభలో ఉన్నోళ్లు వాళ్ల వైపు నుంచి అదే ప్రయత్నం చేస్తున్నరు. వాళ్ల వాళ్ల మధ్య ఉన్న పోటీ రాష్ట్ర ప్రభుత్వానికి తలకాయ నొప్పిగా మారిపోయింది’’ అని అన్నారు. ‘‘వాళ్లకు అప్పుడే అంత ఆత్రం, అంత తాపత్రాయం, అసహనం ఎందుకు? కడుపు నిండా విషం పెట్టుకుని ఎందుకు మాట్లాడ్తున్నరు. వాళ్ల అనుభవాన్ని రంగరించి ప్రభుత్వానికి సూచనలు చేయాలి” అని బీఆర్ఎస్ నేతలకు హితవుపలికారు.
బిల్లిరావు నుంచి గత సర్కార్ఆ భూమిని ఎందుకు తేలే
గచ్చిబౌలిలో భూమిని ఏం చేయొద్దని అంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘25 ఏండ్ల కింద బిల్లిరావు అనే ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు. 2006లో ఆ కేటాయింపును నాటి ప్రభుత్వం రద్దు చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2023 వరకు గత ప్రభుత్వం బిల్లిరావు నుంచి గుంజుకోలేదు. నేను వచ్చాక సుప్రీంకోర్టు వరకు వెళ్లి.. ఒక ఫేక్ కంపెనీకి భూములు కేటాయించారని సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి భూమిని వెనక్కి తీసుకున్నం. అభివృద్ధిలో భాగంగా ఆ భూమిని టీజీఐఐసీకి కేటాయించి.. ఐటీ, ఇతర పరిశ్రమలు వచ్చేలా లే అవుట్ చేయాలని ప్రపోజల్స్‌తో ముందుకు వచ్చినం. అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్లు.. జింకలు, పులులు, సింహాలు ఉన్నట్లు మాట్లాడ్తున్నరు. కానీ, చుట్టుముట్టుతా అక్కడ కొన్ని గుంట నక్కలు చేరి.. ఇట్ల వ్యవహరిస్తున్నయ్. గుంట నక్కలకు గుణపాఠం చెప్తం. అది 100 శాతం డెవలప్డ్ ఏరియా. దానిని డెవలప్మెంట్ కోసం వాడుకుంటాం. మేం ఎవడికో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు. ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చేలా టీజీఐఐసీ నుంచి ప్రణాళికబద్ధంగా ముందుకు పోతుంటే అడ్డుకుంటున్నరు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు.. బిల్లిరావు దగ్గర భూమి ఉంటే వాళ్లకు(బీఆర్ఎస్) బాధలేదు.. వెనక్కి తీసుకోలేదు. ఇప్పుడు పరోక్షంగా యూనివర్సిటీ పిల్లలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నరు. రేపు రోడ్ల కోసం, పరిశ్రమల కోసం భూములు సేకరించరా? రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు రావొద్దా ? చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా?” అని ప్రశ్నించారు. అభివృద్ధికి సంబంధించి భూసేకరణ విషయంలో అభ్యంతరం పెట్టొద్దన్నారు. ‘‘పరిహారం ఇద్దామా ఎంత ఇద్దామో చెప్పండి. చర్చకు సిద్ధం. మూసీ పరివాహక ప్రాంతంలో నష్టపోతున్నవాళ్లకు ఏం ఇద్దాం? చెప్పండి. మల్లన్నసాగర్ పై కేసులు వేసినాయన తిరిగి వాళ్లదాంట్లోనే(బీఆర్ఎస్లో) తేలిండు. పాలమూరు రంగారెడ్డి కేసు వేసినాయన కూడా అట్లనే తేలింది” అని ఆయన తెలిపారు.
హరీశ్.. మా అత్తోళ్లు సొంతంగా రోడ్డేసుకోగలరు
‘‘హరీశ్‌రావు అంటున్నడు.. అమన్ గల్ మా అత్తగారు ఊరనీ. మా అత్తవాళ్లు ఆ ఊరు వదిలేసి ఐదు దశాబ్దాలు అయితున్నది. పరిశ్రమల కాలుష్యంతో రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేయాలని కుట్రపూరితంగా గత పాలకులు ఫార్మా కంపెనీలను అక్కడ పెట్టాలని చూసిన్రు. కానీ, మేం ఫ్యూచర్ సిటీ తెచ్చి ఏఐ హబ్, ఎడ్యుకేషన్ హబ్ చేయాలని పెడుతుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నరు. రోడ్డు అమన్‌గల్ కోసం, అత్తగారి ఊరుకోసం వేయలేదు. వాళ్లకు రోడ్డు కావాలంటే సొంత పైసలతో అంతకంటే పెద్ద రోడ్డు వేసుకునే శ్రీమంతులు వాళ్లు.. ఏం పేదోళ్లు కాదు. నేను రోడ్డు వేస్తే వాళ్లు బాగుపడే పరిస్థితులు ఏం లేవు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్య రేడియల్ రోడ్లు 11 డెవలప్ చేయాలని ప్లాన్ తెచ్చినం” అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘రాష్ట్రాభివృద్ధి వద్దా ? ఆర్ఆర్ఆర్ వద్దా ? ఫ్యూచర్ సిటీ కట్టాలా వద్దా? మూసీ పునరుజ్జీవం చేయలా వద్దా? పదేండ్లు ఏదైనా ఎక్కడా భూమిని సేకరించకుండానే చేశారా ?” అని ఆయన ప్రశ్నించారు. ‘‘మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు మమ్మల్ని సాయం చేయాలని అంటున్నరు. ఆ భూములు ఎవరు సేకరించారు ? కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్‌హౌస్‌లకు డైరెక్ట్ గా కాల్వలు తీసుకున్నది ఎవరు ? రంగనాయకసాగర్, కొండపోచ్చమ్మ, మల్లన్న సాగర్ ఎవరు భూములు కొనుక్కున్నరు?.. ఎవరు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నరు? ఆ రిజర్వాయర్ల నుంచి ఎవరికి నీళ్లు పోతున్నాయి.. రోడ్లు ఎవరు వేసుకున్నారు ? ఈ రోజు నాకు కానీ, నా కుటుంబ సభ్యులం కానీ ఒక ఇంచ్ భూమి కానీ మేం కొనుక్కున్నమా? అది ఫ్యూచర్ సిటీ కాదు ఫోర్ బ్రదర్ సీటి అని అంటున్నరు. 4 కోట్ల తెలంగాణ సోదరి సోదరీమణుల సిటీ అదీ. అభివృద్ధి విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. గతంలో మంచి చేసి ఉంటే ఆ మంచిని కొనసాగిస్తం. ఇస్రోలో జరిగే రీసెర్చ్ ప్రైవేట్‌లో చేస్తామంటే.. కామారెడ్డిలో రాకెట్ సైన్స్ వాళ్లకు భూమి ఇచ్చినం. అక్కడ ఉన్నది ప్రతిపక్ష ఎమ్మెల్యే. కానీ, మేం రాష్ట్రాభివృద్ధి కోణంలోనే ఆలోచిస్తం. తెలంగాణ మొత్తం మాదే. నేను తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న. ఒక ప్రాంతానికి కాదు. తెలంగాణ మొత్తం మా మంత్రివర్గం, మా ప్రభుత్వం పరిధి. లేక్స్, రాక్స్‌పై నిజ నిర్ధారణ కమిటీ వేసుకుని.. ఎమ్మెల్యేలందరం ఒక ట్రిప్ తీసుకెళ్లి చూపిద్దాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దాం” అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎగిరెగిరి పడితే ఎన్నికలు రావు
మీరు (బీఆర్ఎస్ వాళ్లు) ఎంత ఎగిరెగిరి పడినా ఎన్నికలు 2028లోనే వస్తయ్. మహేశ్వర్ రెడ్డి పార్టీ(బీజేపీ) జమిలీ ఎన్నికలంటున్నది. ఒకవేళ అవి కూడా కలిస్తే.. ఎన్నికలు 2029కి పోయేలా ఉన్నయ్. సో.. ఉన్న అసెంబ్లీ కూడా ఇంకో 6 నెలలు ఎక్స్ట్రాగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నయ్. మీరు తాపత్రయ పడినంత మాత్రాన, ఆవేదన చెందినంత మాత్రాన వచ్చే సంవత్సరం ఎలక్షన్లు రావు. ఆనాడు (బీఆర్ఎస్ హయాంలో) ఎమ్మెల్యేలు పార్టీ మారితే కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. నాడు వాళ్లెందుకో డిస్క్వాలిఫై కాలే.. ఎందుకు ఉప ఎన్నికలు రాలే? మరి, ఇప్పుడెట్ల వస్తయ్? 2014 నుంచి ఒకే చట్టం ఉంది... స్పీకర్ పదవి, విప్ పదవి, ప్రతిపక్షం అన్నీ అట్లనే ఉన్నయ్.. చట్టం మారలేదు... న్యాయం మారలేదు.. ఇంకెట్ల ఉప ఎన్నికలు వస్తయనుకుంటున్నరు?’’
- సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజల తీర్పుతోనైనా వాళ్లకు కొంత కనువిప్పు కలగాలి
తాము మంచిని మంచి అంటామని, చెడును చెడు అంటామని, తమ మైండ్లలో చెడు లేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘మీ(బీఆర్ఎస్) మైండ్‌లో ఏదైనా ఉన్నా దానిని తగ్గించుకోవాలి. పదేండ్ల తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు కొంత కనువిప్పు కలగాలి. ఎంతసేపూ ఎదుటోళ్లను బద్నాం చేసి మంచోళ్లు కావాలనుకుంటే కుదరదు. మా డిప్యూటీ సీఎంను బద్నాం చేసి మీకు మీరు మంచోళ్లు అవ్వాలనుకుంటున్నరా? మీరు ముసుగు తొడుగుకుని చేసే ప్రయత్నంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ‘‘మేము వివక్ష చూపించం. వీలైనంత మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకుని ముందుకు వెళ్లాలని అనుకుంటున్నం. ఉత్తుత్తి బడ్జెట్ పెడితే రూ.4 లక్షల కోట్లు దాటేది. అలాంటి బడ్జెట్ పెట్టదల్చుకోలేదు. ఇప్పుడు తెచ్చిన బడ్జెట్ 95 శాతం నిజం కాబోతుంది. 2014 నుంచి 2023 వరకు మొదటి సంవత్సరం 45 శాతం వ్యత్యాసం ఉంది. ఎప్పుడు కూడా 25 శాతం కంటే తక్కువ వ్యత్యాసం లేని బడ్జెట్‌ను గత ప్రభుత్వం పెట్టలేదు. అబద్ధాలతో నడిపారు. అందుకే ప్రజలే వాళ్లను మార్చి మాకు అవకాశం ఇచ్చారు” అని ఆయన పేర్కొన్నారు.
గజ్వేల్ ఎమ్మెల్యే వచ్చి కలిసినా సమస్యలు పరిష్కరిస్త
వచ్చే నాలుగేండ్లు రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందామని, ఇందుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ‘‘నా దగ్గరకు ఎవరొచ్చి కలిసినా కూడా టీవీలల్ల, పేపర్లల్ల ఇటు అటో అని వస్తుంది. నేను సభా నాయకుడిగా, రాష్ట్ర సీఎంగా ప్రతి ఎమ్మె ల్యేకు అందుబాటులో ఉంట. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు వచ్చినా.. పల్లా రాజేశ్వర్ రెడ్డి, వెంక టరమణ రెడ్డి వచ్చినా నేను రాజకీయాలు చూడ ను. నా దగ్గరికి తీసుకొచ్చిన సమస్యలను వీలైనం త మేర పరిష్కరించాలని చూస్త. గజ్వేల్ నియో జకవర్గానికి సంబంధించి.. ప్రతిపక్ష నేత వచ్చినా కూడా అక్కడి సమస్యలను పరిష్కరిస్త. ఎమ్మెల్యే లను గౌరవించే బాధ్యత నాది. నడుచుకుంటూ వచ్చి సీఎంకు రిప్రజెంటేషన్ ఇవ్వొచ్చు.
దానికి ఏ విధమైన రాజకీయాలు ఆపాదించాల్సిన అవస రం లేదు. సీడీపీ నిధులతో పాటు అన్నింటికి ఇన్చార్జ్ మినిస్టర్లు ఇస్తారు. నిన్నగాక మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు నా దగ్గరకు వచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న కాలేజీలు, ఇతర నిర్మాణాలకు నిధుల గురించి అడిగితే.. అక్కడికక్కడే పనులు మొదలుపెట్టాలని అధికారు లకు ఆదేశాలు ఇచ్చాను. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ వచ్చారు. వారి నియోజకవర్గం బ్యాక్వర్డ్ ఏరియా అని ప్రాజెక్టులు కట్టాలన్నరు. ఆ మేరకు ఇచ్చిన. యాదయ్య చేవెళ్ల నుంచి వచ్చారు.. ఆయనకూ చేసిన. ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి శుభకార్యం ఉందని వెడ్డింగ్ కార్డు ఇచ్చారు.. వెళ్లి ఆశీర్వదించి వచ్చిన” అని తెలిపారు. రాకేశ్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అడిగితే ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా ఇస్తామని చెప్పామని, లిస్ట్‌లో పెట్టామని వివరించారు.