- రైతు భరోసా కింద రూ. 3,600 కోట్లు విడుదల: సీఎం రేవంత్ రెడ్డి
- 45 రోజుల్లో రైతులందరి ఖాతాల్లో 9వేల కోట్లు జమ
- ప్రతి నెలా రైతు సంక్షేమం కోసం 5,500 కోట్లు ఖర్చు
- లాభసాటి వ్యవసాయంతోనే బంగారు తెలంగాణ
- రైతులు పంట మార్పిడి విధానం పాటించాలి
- ప్రతి గ్రామాన్ని అంకాపూర్‌లా తీర్చిదిద్దాలి
- సిద్దిపేటపై ఎలాంటి వివక్ష చూపం
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ను
- గెలిపిస్తే మంత్రిని చేస్తానని వెల్లడి
- నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
సిద్దిపేట, వెలుగు: ఆర్థిక పరిస్థితులు అనుకూలించకున్నా రైతుల సంక్షేమానికి పాటు పడుతున్నామని.. తమది రైతు ప్రభుత్వమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రైతు పండించిన ప్రతి గింజ కొని.. వారి కళ్లలో ఆనందం చూడాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ. 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించారు. అలాగే, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,600 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.
అభివృద్ధికి ఆర్థిక పరిస్థితులు అవరోధం కాకుండా చూసుకుని.. సిద్దిపేట గడ్డపై నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. 45 రోజుల్లో రైతులందరి బ్యాంకు ఖాతాల్లో రూ. 9వేల కోట్లు జమవుతాయని చెప్పారు. గత ప్రభుత్వం ప్రతినెలా రైతుల కోసం 2,533 కోట్లు ఖర్చు చేస్తే.. తమ ప్రభుత్వం నెలకు 5,500 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకే 1.40 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదని తాను బలంగా నమ్ముతానని తెలిపారు. దేశంలోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ గా నిలవడం సంతోషకరమని.. కానీ, రైతులు పంట మార్పిడి విధానం అనుసరించాలని, అన్ని రకాల పంటలు పండించాలని సూచించారు. గతంలో ప్రాంతాలవారీగా పంటలు పండించేవారని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పండ్ల తోటలు ఎక్కువగా ఉండేవని తెలిపారు.
యుద్ధం నేపథ్యంలో ఎరువుల కొరత వచ్చే ప్రమాదం ఉందని, మంత్రి తుమ్మల రాష్ట్ర ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ యూరియా తెచ్చుకునే ప్రయత్నం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఇది రాజకీయాలకు సమయం కాదని, సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఎన్నికలు ముగిశాక రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని స్పష్టం చేశారు.
ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసినం
తమ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిందని సీఎం అన్నారు. ప్రస్తుతం మహిళా సంఘాల్లో 65 లక్షల మంది సభ్యులున్నారని, వారి సంఖ్య కోటి మందికి చేర్చి అందరినీ కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పట్టణాల్లో మహిళా సంఘాల్లో సభ్యుల సంఖ్యను పెంచాలని సూచించారు. ఇప్పటి వరకు బ్యాంకు లింకేజీల ద్వారా 57 వేల కోట్ల రుణాలు అందించామని సీఎం తెలిపారు. ‘‘తెలంగాణ ఆడబిడ్డలు అదానీ అంబానీలతో పోటీ పడుతూ సోలార్ విద్యుత్ తయారు చేస్తున్నారు. ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదిగితే దేశ ఎకానమీ అభివృద్ధి చెందుతుంది. మీరు ఆర్థికంగా నిలబడండి.. ఎదగండి.. మీ అభివృద్ధి కోసం ఎక్కడి నుంచైనా నిధులు తెస్తా. మహిళా సంఘాల ఉత్పత్తుల అమ్మకం కోసం శిల్పారామం వద్ద మూడున్నర ఎకరాల్లో ప్రత్యేక మార్కెట్ ను ఏర్పాటు చేశాం. వారి ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా అమ్మకానికి సహకారం ఇస్తాం”అని సీఎం హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాళన
విద్యా కమిషన్ సూచన మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చి దిద్దుతూ.. ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేస్తామని సీఎం ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలపై మోజుతో ఫీజుల భారంతో ఇక పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదన్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా యువతలో నైపుణ్యతను పెంచడం కోసం ఏటీసీలు ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ అందివ్వడమే కాకుండా నెలకు రూ.2వేల స్కాలర్ షిప్ ను అందిస్తున్నామని చెప్పారు. పని నేర్చుకుని, నైపుణ్యతను సాధించి యువత నెలకు రూ. లక్షలు సంపాదించాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన తరువాత ఫ్యాక్టరీ నమూనా, పామ్ ఆయిల్ ఉత్పత్తి, తదితర అంశాలు, పరిసరాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఉన్నతాధికారులు సురేంద్రమోహన్, యోగితా రాణా, నవీన్ నికోలస్, యాస్మిన్ భాష, జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం
రైతుకు ఆపన్నహస్తం: తుమ్మల
అన్నం పెట్టే రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తోంది. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆర్థిక పరిస్థితులు అనుకూలించకున్నా రైతు సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి పెద్ద రైతులా పనిచేస్తున్నారు. రైతులు సంతోషంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్ దే. రైతుల కళ్లలో సంతోషం చూడటం కోసం రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నాం. గుంట నక్కలు ఆరోపణలు చేసే అవకాశం ఇవ్వం. పామాయిల్ సాగుతో రాష్ట్రంలో 30 జిల్లాలు సస్యశ్యామలంగా మారతాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి యూరియాను తెచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది.
రాష్ట్ర అభివృద్ధిలో మైలు రాయి: పొన్నం
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, రైతు భరోసా నిధుల విడుదల, రిఫైనరీతో పాటు పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయడం రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుంది. ఈ కార్యక్రమాలతో రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు దోహదపడతాయి. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి పట్ల సీఎం రేవంత్ రెడ్డి నిబద్ధత మరోసారి స్పష్టమైంది. రైతు భరోసా వంటి పథకాల ద్వారా రైతులకు భరోసా కల్పిస్తూ, వారి జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకురావడం అభినందనీయం. ఇవి రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాయి. తెలంగాణ రైతాంగానికి మేలు చేసే ఈ కార్యక్రమాలు మరింత విస్తరించి, ప్రతి రైతు కుటుంబానికి లబ్ధి చేకూరాలి.
రైతులు పంట మార్పిడి చేయాలి: దామోదర
రాష్ట్రంలో రైతులు పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంటమార్పిడితో అధిక లాభాలు సాధించవచ్చు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం జరిగే విధంగా మూడు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డితో కలసి పోరాటాలు చేసాం. గత రెండేండ్లలో ప్రజారోగ్యం కోసం ఆరోగ్య శాఖ ద్వారా రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం. రాబోయే రోజుల్లో మరో పది వేల కోట్లు ఖర్చు చేస్తాం. రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి నాణ్యమై విద్యను అందించడమే ధ్యేయం. సామాజిక న్యాయం, మహిళా సాధికారికతతోపాటు విద్య, ఆరోగ్య రక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది.
రైతును రాజును చేయడమే ధ్యేయం: పొంగులేటి
రైతును రాజును చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. అందరికీ న్యాయం చేస్తూ.. సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నాం. విష ప్రచారాలు, కారు కూతలను పట్టించుకోకుండా పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ప్రజల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను అందిస్తున్నాం. గత పాలకులు తెల్ల కాగితాలను నలుపు చేసి తప్పుడు ప్రచారాలు చేశారు. కొద్ది రోజుల్లో సాదాబైనామాల సమస్యను పరిష్కరిస్తం.
ప్రాధాన్యతా క్రమంలో హామీల అమలు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
గత రెండున్నర సంవత్సరాలుగా రైతులకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో అమలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూర దృష్టి తో రైతులను ఆదుకుని రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పని వ్యక్తి.
తపాసుపల్లి రిజర్వాయర్ ద్వారా నీళ్లివ్వాలి: ఎంపీ రఘునందన్
రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలి. రాష్ట్రంలో పామా యిల్ సాగు చేసే రైతులకు మొదటి నాలుగేండ్ల పాటు కేంద్ర ప్రభుత్వం రూ.4,200 ఆర్థిక
సహాయం అందిస్తోంది. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలతోపాటు తపాసుపల్లి రిజర్వాయర్ ద్వారా కొండపాక మండలంలోని గ్రామాలకు నీళ్లు అందించేలా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చర్యలు
తీసుకోవాలి.
రైతు సంక్షేమంపైనే సీఎం ఆలోచనలు: మంత్రి వివేక్
రైతుల సంక్షేమంపైనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు సాగుతుంటాయి. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా సంక్షేమ పథకాల అమలుకు ఆటంకం లేకుండా చూస్తున్నాం. పేదలకు సన్న బియ్యం, రైతులకు రుణమాఫీ, యువత కోసం ఏటీసీలు ఏర్పాటు చేశాం. యువతలో స్కిల్స్ ను పెంచడం కోసం ఏటీసీలను ఏర్పాటు చేసి వారికి రెండు వేల స్కాలర్ షిప్ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఏడుల లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. యువత స్కిల్స్ పెంచుకుంటే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సిద్దిపేటకు ఏది అవసరం ఉన్నా సీఎం శాంక్షన్ చేస్తున్నారు. గ్రామాల్లోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.
సిద్దిపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేస్తా..
ఆయిల్ పామ్ కంపెనీ ఇక్కడున్న ఎమ్మెల్యే కోసం కాదని.. రైతుల కోసమని సీఎం రేవంత్ అన్నారు. తనది వివక్ష చూపేతత్వం కాదని, తాము పేదల కోసం పనిచేస్తామే తప్ప రాజకీయ నాయకుల కోసం కాదని హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు. వివక్ష గురించి మాట్లాడాలంటే ఆనాడు కొడం గల్‌కు ఎన్ని నిధులు ఇచ్చారో చర్చిద్దామన్నారు. ప్రజలు పదేండ్లు వారికి అవకాశం ఇచ్చారని, మరో పదేండ్లు తమను ఆశీర్వదిస్తారన్నారు. 2029లో అధికారం తమదేనని సీఎం ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని, ఈ బాధ్యత మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ తీసుకుంటారని ప్రకటించారు. ‘‘కొన్నేండ్లుగా ఈ ప్రాంతంలో ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు. ఇతరులకు ఒక్క అవకాశం ఇవ్వండి. వచ్చే ఎన్నికల్లో మార్పు చూపండి.. మంచి జరుగుతుందో లేదో చూడండి. సిద్దిపేటపై ఎలాంటి వివక్ష చూపాల్సిన అవసరం నాకు లేదు. 119 నియోజకవర్గాలను నేను సమా నంగా చూస్తా”అని సీఎం అన్నారు. ఎంపీ రఘునందన్ రావు దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గ సమస్యలను వివరించారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.
మంత్రి వివేక్‌కు ప్రశంస
ఉమ్మడి మెదక్‌జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పలు మార్లు ప్రశంసించారు. యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు ఏటీసీల ఏర్పాటు విషయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఇన్చార్జి మంత్రిగా జిల్లా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారని ప్రశంసిస్తూ.. సిద్దిపేటలో మన ఎమ్మెల్యేను గెలిపించే బాధ్యతను మంత్రి వివేక్ వెంకటస్వామికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు.
