
- కామారెడ్డిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
- వర్షాలు, వరదల వల్ల చనిపోయినోళ్ల కుటుంబాలకు 5 లక్షల పరిహారం
- దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం.. పొలాల్లోని ఇసుక మేటల తొలగింపుకు ప్రత్యేక నిధులు
- ఇండ్లు కూలిపోయినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ
- కలెక్టరేట్‌లో ఆఫీసర్లతో సీఎం రివ్యూ
- రైతు వేదికల దగ్గరే యూరియా పంపిణీ చేయండి
- ముందుగానే రైతులకు టోకెన్లు ఇస్తే ఎలాంటి గొడవలు ఉండవ్
- శాశ్వత రిపేర్లకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశం
కామారెడ్డి, వెలుగు: వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వరద బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగిన కామారెడ్డి జిల్లాలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడారు. ‘‘కామారెడ్డిలో గత వందేండ్లలో పడనంత వాన ఈసారి పడ్డది. పంటలు దెబ్బతిన్నయ్. స్కూల్‌పిల్లల బుక్స్, బ్యాగ్‌లు వరదలో కొట్టుకుపోయినయ్. చెరువులు, కుంటలు, రోడ్లు తెగినయ్. పంట భూముల్లో ఇసుక మేటలు వేసినయ్. గతంలో ఎన్నడూ జరగనంత నష్టం జరిగింది. నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటం’’ అని సీఎం హామీ ఇచ్చారు. ‘‘రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించడంతో పాటు పొల్లాల్లోని ఇసుక మేటలు తొలగించడానికి పత్ర్యేకంగా నిధులిస్తాం. ఇండ్లు కూలిపోయినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం. వరదల వల్ల చనిపోయినోళ్ల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తాం. చనిపోయిన పశువులకు కూడా పరిహారం చెల్లిస్తాం” అని ప్రకటించారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కామారెడ్డికి వచ్చారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్దు వద్ద కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. బురుగిద్ద శివారులో ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలించి, అక్కడి రైతులతో మాట్లాడారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీఆర్కాలనీలో నీట మునిగిన ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా దివ్యాంగురాలు రమ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు.
మీతో మాట్లాడాలనే వచ్చాను..
బాధితుల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకోవాలనే కామారెడ్డికి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘వరదల విషయం తెలిసిన వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లాలని ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలను ఆదేశించాను. ఎప్పటికప్పుడు ఆఫీసర్లకు తగిన ఆదేశాలు జారీ చేశాను. ఆనాడే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని హెలికాప్టర్‌లో కామారెడ్డికి వచ్చినప్పటికీ, వాతావరణ పరిస్థితుల కారణంగా ఇక్కడికి చేరుకోలేకపోయాను. మెదక్జిల్లాలో ఆఫీసర్లతో సమీక్షలు జరిపి, వరద బాధితులకు సాయమందించాలని ఆదేశించాను. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడి పరిస్థితులను చూసి, మీ సమస్యలు తెలుసుకోవాలని వచ్చాను. మళ్లీ ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించాను. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ఇతర సామగ్రిని అందించాలని కలెక్టర్‌ను ఆదేశించాను. కొడంగల్‌కు నేను ఏం చేయగలనో.. కామారెడ్డికి అలాగే చేస్తాను” అని వరద బాధితులకు సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడం వల్లే ప్రాణ నష్టం తగ్గిందని చెప్పారు.
నష్టంపై పూర్తి నివేదిక ఇవ్వండి..
జిల్లాలో వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం లోపించిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా ఆఫీసర్లతో ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ శాఖలను ఏర్పాటు చేసుకున్నాం. క్రైసిస్ మేనేజ్మెంట్ సమయంలో శాఖల మధ్య సమన్వయం ఉండాలి. కానీ ఇక్కడ శాఖల మధ్య సమన్వయం లోపించినట్లు నాకు కనిపిస్తున్నది. ఏ శాఖకు సంబంధించిన ఆఫీసర్లు.. ఆ శాఖ విషయంలో బాగానే పని చేస్తున్నారు. కానీ వరదలు సంభవించినప్పుడు ఇతర శాఖలతో సమన్వయం చేసుకునేటప్పుడు గ్యాప్ఏర్పడుతున్నది. ఇది లేకుండా చూసుకోవాలి’’ అని అధికారులకు సూచించారు. ‘‘వరదల సమయంలో తాగునీటి పైప్‌లైన్ పగిలి రోడ్డు కొట్టుకుపోయింది. కానీ ముందుగా రోడ్డు వేస్తే ఏంటి లాభం? పైప్లైన్వేశాక రోడ్డు వేస్తే నష్టం ఉండదు.
మళ్లీ 15 రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తాను. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరదల వల్ల జరిగిన నష్టంపై పూర్తి నివేదిక రూపొందించండి. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలతో రావాలి” అని ఆదేశించారు. ‘‘ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కేంద్రం ఇచ్చే డిజాస్టర్మేనేజ్మెంట్ఫండ్స్వాడుకునేందుకు అధికారులు కృషి చేయాలి. ఒకవేళ కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వరదల సందర్భంలో డిజాస్టర్మేనేజ్మెంట్కు సంబంధించిన పనులు చేపడితే వాటిని కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరిపినట్లు లెక్కలు రాయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్లు సరిగ్గా లెక్కలు రాయకపోవడం వల్ల సెంట్రల్నిధులు సరిగ్గా వాడుకోలేకపోతున్నం” అని అన్నారు. జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, సమస్యలు తెలుసుకొని నివేదిక సమర్పించాలని మంత్రి సీతక్కకు సూచించారు. సమావేశంలో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు టోకెన్లు ఇచ్చాక యూరియా ఇవ్వండి..
యూరియా పంపిణీ విషయంలో అగ్రికల్చర్ఆఫీసర్లు సరిగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్అయ్యారు. ‘‘మండలంలో ఒకట్రెండు చోట్ల యూరియా పంపిణీ కేంద్రాలు పెడ్తే, అక్కడికి ఒకేసారి 10 వేల మందికి పైగా రైతులు వస్తే, లైన్‌లో ముందు నిలుచున్నోళ్లకు త్వరగా యూరియా బస్తాలు అందితే.. చివరన నిలబడిన రైతులకు ఏడెనిమిది గంటల తర్వాత అందుతున్నాయి. ఆ గ్యాప్‌లో యూరియా బస్తాలు ఇవ్వట్లేదని కొందరు మాట్లాడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మండలాల వారీగా నిర్మించిన రైతు వేదికల దగ్గర రైతుల వివరాలు తీసుకొని టోకెన్లు ముందుగానే ఇచ్చి రైతులు ఏ సమయంలో వచ్చి యూరియా బస్తాలు తీసుకెళ్లాలో తెలియజేస్తే.. వాళ్లకు సమయం వృథా కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాగైతే దర్శనం కోసం తేదీ, టైమ్ కేటాయిస్తారో.. అలాగే రైతులకు యూరియా బస్తాల పంపిణీ విషయం ముందుగానే వివరిస్తే ఏ సమస్య రాదు. దీనికి పోలీస్, అగ్రికల్చర్శాఖ ఆఫీసర్లు సమన్వయం చేసుకొని యూరియా పంపిణీలో గొడవలు జరగకుండా చూసుకోవాలి” అని ఆదేశించారు.