- కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేసే తొలి నగరంగా హైదరాబాద్..
- నెట్ జీరో సిటీగా మారుస్తం
- అభివృద్ధిలో తయారీ రంగం.. పర్యావరణ పరిరక్షణే కీలకం
- వచ్చే ఐదేండ్లలో ‘క్యూర్’లో కాలుష్యకారక పరిశ్రమలు ఉండవు
- ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 19 వేల మెగావాట్లు.. 25 శాతం గ్రీన్ సోర్సుల నుంచే
- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని వెల్లడి
- ముంబై క్లైమెట్ వీక్ కాన్ఫరెన్స్‌లో సీఎం ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ పరిరక్షణకు గ్రీన్ ఎనర్జీ ఎంతో లాభదాయకమని, తెలంగాణలో ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని బాంద్రా కుర్లా జియో కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన ‘క్లైమెట్ వీక్’ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను నెట్ జీరో స్టేట్‌గా మార్చేందుకు చేపట్టిన క్యూర్, ప్యూర్, రేర్ విభజన గురించి వివరించారు. రాష్ట్రంలో 30 లక్షలకుపైగా పంప్‌సెట్స్‌కు, దాదాపు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఈ శక్తిని బొగ్గులాంటి సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్, గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిర శక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ నగరాన్ని 2034 నాటికి నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధిలో భాగంగా కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారతీయ నగరంగా హైదరాబాద్ నిలవబోతున్నదని సగర్వంగా ప్రకటించారు. వచ్చే ఐదేండ్లలో కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో దాదాపు పరిశ్రమలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని పట్టణాలు, నగరాభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపై సీఎం వివరించారు. 2047 లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలంటే 1947 నుంచి భారత అభివృద్ధి ప్రయాణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
స్వాతంత్ర్యం వచ్చిన తొలి 4 దశాబ్దాల్లో దేశంలో విద్య, నీటిపారుదల రంగాలే ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయని, గ్రామీణ పాఠశాలల నుంచి ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌సీలాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యుత్, సాగునీటి కోసం భారీ ఆనకట్టలను నిర్మించి.. రైతుల పొలాలను నీటితో అనుసంధానించామని, 1990 నాటికి భారత్ ఆహార కొరత నుంచి ఆహార భద్రత సాధించిందని చెప్పారు. 1991 తర్వాత గ్లోబల్ సాఫ్ట్‌వేర్ సంస్థలు తమ బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకు భారత్‌ను ఎంచుకోవడం వల్ల ప్రపంచంలోనే అత్యధిక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) మన దేశంలో ఉన్నాయని, అయితే ఈ పురోగతిలో తయారీ రంగం అవకాశాలు కోల్పోయిందని అభిప్రాయపడ్డారు.
డెవలప్‌మెంట్‌కు విద్యుత్ వినియోగమే కొలమానం
కొవిడ్ అనంతరం ప్రభుత్వాల దృష్టికోణం మారింద ని, ప్రస్తుతం అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ కీలకంగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ ఆర్థిక వ్యవస్థకైనా విద్యుత్ ఉత్పాదక వనరులే అసలైన కరెన్సీ అని, విద్యుత్ ఉత్పత్తి , వినియోగమే అభివృద్ధికి కొలమానమని చెప్పారు. తెలంగాణ జీడీపీని 200 బిలియన్ డాలర్ల నుంచి 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల కు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని వెల్లడించారు. భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపు ణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధి కోసం తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ జోన్‌లుగా విభజించామని, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిని క్యూర్ జోన్ గా, ఔటర్ రింగ్ రోడ్ – రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని ప్యూర్ జోన్‌గా రూపొందించి.. తయారీ రం గానికి నిర్దేశించామని వివరించారు. ఈ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెడతామని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున 16,610 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉందని, నిరుడు గరిష్ట డిమాండ్ 17,162 మెగావాట్లు ఉండగా, ఈ ఏడాది అది 19,000 మెగావాట్లు దాటుతుందని అంచనా వేశారు.
2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో విద్యుత్ డిమాండ్ 34వేల మెగావాట్లకు చేరుతుందని, ఇందులో ప్రస్తుతం 25 శాతం గ్రీన్ సోర్సుల నుంచే వస్తున్నదని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం, రీజినల్ రింగ్ రైల్వే ప్రణాళికలు అమలులో ఉన్నాయని, పెట్టుబడిదారులు గ్రీన్ ఎనర్జీని కోరుకుంటున్న తరుణంలో తెలంగాణ వనరుల పెరుగుదలలో గ్రీన్ ఎనర్జీ ప్రధాన భాగంగా ఉంటుందన్నారు.
తెలంగాణలోనే ఈవీల తయారీ
ప్రస్తుత పరిస్థితి క్లైమెట్ ఎమర్జెన్సీ అని.. పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తొలగించడంతో దేశంలోనే అత్యధికంగా ఈవీల స్వీకరణ పెరిగిందని, తెలంగాణలోనే వీటి తయారీ కోసం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 2 లక్షలకు పైగా ఆటోరిక్షాలను రిట్రోఫిట్ చేస్తూ, 3,500 కంటే ఎక్కువ ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని వివరించారు.
హైదరాబాద్ మెట్రోను 200 కిలోమీటర్లకు పైగా విస్తరిస్తున్నామని, పరిశ్రమలను నగరం నుంచి బయటకు తరలిస్తున్నామని చెప్పారు. మూసీ నది పునరుద్ధరణ, చెరువుల సంరక్షణ కోసం హైడ్రా రూపంలో ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేశామని, తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
