- సౌత్ శక్తిని కేంద్రం ఇకనైనా గుర్తించాలి
- మోదీ దిగిపోతే పాలమూరుకు జాతీయ హోదా వస్తది
- క్లస్టర్ స్కూల్స్‌గా సర్కారు బడులు..
- 27 వేల బడులు 4 వేల స్కూళ్ల పరిధిలోకి..
- ప్రైవేటు తరహాలోనే విద్యార్థులకు ఉచిత రవాణా
- జాబ్స్ కోసమే తెలంగాణ ఉద్యమం.. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలే
- త్వరలో 5 వేల పోలీస్ జాబ్స్‌కు నోటిఫికేషన్
- చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెట్టేందుకు
- త్వరలో ఆ దేశ పర్యటనకు వెళ్తా
- రుణమాఫీతో రైతు ఆత్మహత్యల్లేని రాష్ట్రంగా చేశామని వెల్లడి
- ‘ది హిందూ హడిల్ 2026’ సదస్సులో సీఎం ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీకి పన్నులు కట్టి, సలాం కొట్టే రెండో శ్రేణి పౌరులుగా తాము బతకదల్చుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అత్యధిక పన్నులు చెల్లిస్తున్న దక్షిణాదిపై ఆర్థిక వివక్ష చూపుతున్న కేంద్రం, డీలిమిటేషన్ పేరుతో రాజకీయంగానూ సౌత్‌ను బలహీనపరిచే కుట్ర చేస్తోందని ఆరోపించారు. బెంగళూరులో జరిగిన ‘ది హిందూ హడిల్ 2026’ సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు.
ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రిలాంటి కీలక పదవులన్నీ ఉత్తరాది వారే పంచుకున్నారని, ఢిల్లీ వద్ద బలాన్ని చూపించే సీట్లు దక్షిణాదికి లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. కాగా రాష్ట్రంలోని 27 వేల సర్కారు బడులను హేతుబద్ధీకరించి, 4 వేల స్కూళ్ల పరిధిలోకి తెచ్చి.. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. కేవలం 15 నెలల కాలంలో రికార్డు స్థాయిలో 67,716 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. త్వరలోనే మరో 5వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రకటన విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు.
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ వివక్ష చాలా తీవ్రస్థాయిలో ఉందని, 99 శాతం అనుమతులు వచ్చినా ఒక్కశాతం అనుమతి కోసం ‘గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టండి, అప్పుడు పర్మిషన్లు ఇస్తాం’ అని చెప్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేంద్రంతో పోరాడడం తమ జీవితంలో భాగమని, ప్రతిరోజూ పళ్లు తోముకోవడం ఎంత సహజమో, కేంద్ర ప్రభుత్వంతో పోరాడడం కూడా అంతే సహజమన్నారు.
గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడానికి తాను స్వయంగా నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించి ఏఈలతో కూడా చర్చిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగిపోతేనే తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు, ముఖ్యంగా పాలమూరు–-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా దక్కుతుందని అభిప్రాయపడ్డారు.
27 వేల బడులను.. 4 వేల క్లస్టర్ స్కూళ్లుగా మారుస్తం
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘ప్రస్తుతం రాష్ట్రంలో 27వేల సర్కారు బడులు ఉంటే కేవలం 18 లక్షల మంది విద్యార్థులే ఉన్నారు. అదే 12వేల ప్రైవేట్ బడుల్లో 35 లక్షల మంది చదువుతున్నారు. కొన్ని తరగతుల్లో కేవలం ఇద్దరు నుంచి ఐదుగురు విద్యార్థులే ఉంటున్నారు. అందుకే ఈ 27వేల బడులను హేతుబద్ధీకరణ ద్వారా 4 వేల క్లస్టర్ స్కూళ్లుగా మార్చి, ప్రైవేటు తరహాలోనే విద్యార్థులకు ఉచిత బస్సు రవాణా, ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తాం” అని ప్రకటించారు. ఒకవైపు కులరహిత సమాజం అంటూనే మరోవైపు కులాలవారీగా హాస్టళ్లు కట్టడం వల్ల కుల వివక్ష పోదని తెలిపారు. ఈ హద్దులను చెరిపేసేందుకు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒకే ప్రాంగణంలో 500 ఎస్సీ, 500 ఎస్టీ, 500 బీసీ, 500 మైనారిటీ, 500 జనరల్ కేటగిరీ విద్యార్థులను కలిపి 2,500 మందితో కూడిన ఇంటిగ్రేటెడ్ విద్యా ప్రాంగణాలను 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని సీఎం వివరించారు. 2027 జూన్ నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.
పాలనలో కామన్ సెన్స్ ముఖ్యం..
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చాలా తెలివైన వారని సీఎం రేవంత్ అన్నారు.‘‘మేం ఏ సమీక్ష చేసినా ముందు మాట్లాడితే అధికారులు మన మైండ్ సెట్‌ను రీడ్ చేసి, దానికి తగినట్లుగా ఎస్ సార్.. ఎస్ సార్.. అని ఫలితం లేకుండానే సంతోషపెడతారు. అందుకే నేను సమీక్షలో మొదట మాట్లాడను. అందరి అభిప్రాయాలు పూర్తిగా విని నోట్స్ రాసుకుంటాను. చివరిలోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను. పాలనలో సైన్స్, మ్యాథ్స్ కంటే ‘కామన్ సెన్స్’ అత్యంత ముఖ్యం. సామాన్య ప్రజలతో మాట్లాడితే వచ్చే కామన్ సెన్స్.. ఐఏఎస్ అధికారుల వద్ద కూడా దొరకదు’’ అని స్పష్టం చేశారు.
‘డీఎన్ఏ సమస్య’ వల్లే టీడీపీని వీడిన..
చంద్రబాబు నాయుడితో తాను10 ఏండ్లు పనిచేశానని, అయితే పార్టీ వీడే సమయంలో ఆయనతో ఒక ముఖ్యమైన విషయం చర్చించానని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘సార్.. ఇక్కడ ఒక డీఎన్ఏ సమస్య ఉంది. తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆంధ్రా పార్టీగా భావిస్తున్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడటానికి ప్రజలు మరింత బలమైన ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు’’ అని చంద్రబాబుతో నేరుగా చెప్పి, ఆపై కాంగ్రెస్‌లో చేరినట్టు తెలిపారు.
మహిళా రిజర్వేషన్‌పై మోదీది నాటకం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసుకుంటున్న మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక అసలు ఉద్దేశం కాలయాపన చేయడమేనని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘‘మహిళా రిజర్వేషన్‌కు ఆద్యులం మేమే. ఇందిరాగాంధీలాంటి బలమైన ప్రధాని పాకిస్తాన్‌ను ఓడించి బంగ్లాదేశ్‌ను సృష్టించారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చారు. సోనియా గాంధీ రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదింపజేశారు. కానీ మహిళా రిజర్వేషన్ పేరుతో నరేంద్ర మోదీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. ఆయనకు నిజాయతీ ఉంటే 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎందుకు రిజర్వేషన్లు తేవడం లేదు? డీలిమిటేషన్ వరకు ఎందుకు ఆగాలి ?’’ అని ప్రశ్నించారు.
గుజరాత్‌లో బలవంతంగా పెట్టుబడులు
గుజరాత్‌లో కంపెనీలు పెట్టుబడులు పెట్టడం లేదని, అక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేలా ఒత్తిడి చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ గత 20 ఏండ్లుగా అక్కడ కేవలం ఒక్క బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే పనిచేస్తున్నారు. నా పోటీ.. పక్క రాష్ట్రాలైన బెంగళూరు, ఏపీతో కాదు . నా పోటీ కేవలం న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌తో మాత్రమే. చైనా ప్లస్ వన్ అంటే తెలంగాణ కావాలన్నదే నా ఆకాంక్ష. చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెట్టడమే నా లక్ష్యం. త్వరలోనే నేను చైనా పర్యటనకు వెళ్లబోతున్నాను” అని పేర్కొన్నారు.
‘‘కర్నాటక సీఎం డీకే శివకుమార్ కూడా కాంగ్రెస్ వారే. మరి బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌కు ఎక్కువ పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన రాజీపడతారా?’’ అనే ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు. ‘‘క్రీడల్లో మనం ఫ్రెండ్లీ మ్యాచులు ఆడతాం కదా? అలాగే.. పొరుగు రాష్ట్రాలతో మేం ఫ్రెండ్లీ మ్యాచులు మాత్రమే ఆడతాం, పెట్టుబడుల విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు.
హైడ్రా.. హిట్లర్ ఎంతో ఇష్టపడే పేరు..
తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ, అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా తీసుకువచ్చిన ‘హైడ్రా’ విభాగానికి సంబంధించిన నేపథ్యాన్ని సీఎం రేవంత్ వివరించారు. ‘హైడ్రా’ అనేది హిట్లర్ ఎంతో ఇష్టపడే పేరని, ఎంతటి శక్తినైనా మట్టికరిపించే సత్తా దానికి ఉందని పేర్కొన్నారు. అందుకే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి నాయకత్వంలో, 3వేల మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందితో కూడిన అత్యంత బలమైన ‘హైడ్రా’ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నామని స్పష్టం చేశారు.
సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు సరైన గుర్తింపునిస్తూ వారిని ట్రాఫిక్ పోలీసు మార్షల్స్‌గా నియమించామని చెప్పారు. ‘‘అన్ని రాష్ట్రాలకు హైడ్రా మోడల్ అవసరం లేదు. కానీ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లాంటి ‘ఎం6’ మెట్రో నగరాలకు ఇది కచ్చితంగా అవసరం. ఎందుకంటే ఈ నగరాలు వరదలు, కాలుష్యం, పర్యావరణ సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నమూనా వాటి పర్యావరణ వ్యవస్థను కాపాడుతుంది” అని అభిప్రాయపడ్డారు.
ఫుట్‌బాల్ అంటే ప్రాణం
రోజులో తాను సాధారణంగా 16 నుం చి18 గంటలు పనిచేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తనకు రాజకీయం తప్ప ఇతర వ్యాపకాలు, స్నేహితులు లేరని, అది తనకున్న అతిపెద్ద సమస్యగా పేర్కొన్నారు.‘‘ నేను మెస్సీకి పెద్ద అభిమానిని. గతంలో నేను క్రమం తప్పకుండా రాత్రి పూట 10.30 నుంచి 11.30 వరకు ఫుట్‌బాల్ ఆడేవాడిని. ఐఎస్‌బీ విద్యార్థులు, రాజకీయాలతో సంబంధం లేని క్రీడాకారులతో కలిసి ఆడేవాడిని. ఇప్పుడు సమయం దొరకడం లేదు కానీ నాకు ఫుట్‌బాల్ అంటే ప్రాణం. అందుకే రాష్ట్రంలో యువతను క్రీడల వైపు మళ్లించేందుకు మెస్సీని తెలంగాణకు ఆహ్వానించాను’’ అని పేర్కొన్నారు.
నా అస్త్రం వ్యంగ్యమే
పది రోజులకు ఒకసారి తాను తప్పకుండా మీడియా సమావేశాలు నిర్వహిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘నా శత్రువులు, కేసీఆర్ అనుకూల మీడియాతో సహా అందరినీ ఆహ్వానించి వారి ప్రశ్నలకు సమాధానమిస్తాను. వ్యక్తిగతంగా నాపై మీడియాలో తప్పుడు ప్రచారం జరిగినా నేను ఎవరినీ దూషించను. నా దగ్గర కేవలం వ్యంగ్యం అనే అస్త్రం మాత్రమే ఉంది. దాంతోనే సమాధానమిస్తాను. మీడియా.. సమాచారాన్ని అందించే మా బ్యాక్ ఆఫీస్ లాంటిది”అని చెప్పారు.
2034 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఎకనామీ
‘తెలంగాణ రైజింగ్’ విజన్ ద్వారా రాబోయే 2034 నాటికి రాష్ట్ర జీఎస్‌డీపీని ప్రస్తుతం ఉన్న 210 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా ఒక లక్ష కోట్ల డాలర్ల (1 ట్రిలియన్) స్థాయికి పెంచేందుకు తమ ప్రభుత్వం ఒక బృహత్తర దార్శనిక ప్రణాళికను సిద్ధం చేసిందని సీఎం రేవంత్ వివరించారు. సముద్ర మార్గం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మచిలీపట్నం పోర్టుకు 12 లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే , రైల్వే కనెక్టివిటీని సాధిస్తున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే.. తిరిగి వాటా రూపంలో కేవలం 40 పైసల నుంచి 45 పైసలు మాత్రమే వస్తోంది. కానీ జనాభాను నియంత్రించకుండా వెనుకబడ్డ బిహార్ ఒక రూపాయి పన్ను కడితే బదులుగా రూ. 6.50, యూపీకి రూ. 3.50 చొప్పున కేంద్రం చెల్లిస్తోంది. పన్నులు కట్టే దక్షిణాదిని జనాభాను అదుపు చేసినందుకు శిక్షిస్తోంది.
పాత విద్యా విధానాన్ని మారుస్తున్నం
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో (ఐటీఐ) ఇప్పటికీ 1956 నాటి పాత సిలబస్‌నే చెప్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘విద్యార్థులకు ఇంకా అంబాసిడర్ కార్ మెకానిజం నేర్పిస్తున్నారు. ఇప్పుడు రోడ్ల మీద అంబాసిడర్ కార్లు ఎక్కడున్నాయి? ఒకవేళ ఎవరికైనా అంబాసిడర్ కార్ రిపేర్ చేయించుకోవాలని ఉంటే.. వాళ్లు కచ్చితంగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పోవాలి.
ఎందుకంటే ఆయన ఎన్నికల గుర్తు అంబాసిడర్ కార్ కదా?’’ అని చమత్కరించారు. ఈ పాత విద్యా విధానాన్ని మార్చేందుకు టాటా గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. మొత్తం రూ. 2,400 కోట్ల వ్యయంలో టాటా సంస్థ తన సీఎస్ఆర్ నిధుల ద్వారా 86 శాతం (రూ. 2,100 కోట్లు) భరిస్తూ ఉమ్మడిగా ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మారుస్తున్నామన్నారు. అలాగే ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసి, దానికి ఆనంద్ మహీంద్రాను చైర్‌పర్సన్‌గా నియమించామని తెలిపారు. ఇంగ్లిష్‌తో పాటు జర్మన్, జపనీస్, కొరియన్ భాషల శిక్షణను కూడా అందిస్తామన్నారు
రైతు ఆత్మహత్యలు సున్నా
మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సలహాలతో జీఎస్టీ వ్యవస్థలోని లోపాలను, లీకేజీలను అరికట్టి, పన్ను రేట్లు పెంచకుండానే నెలవారీ జీఎస్టీ వసూళ్లను రూ. 3,500 కోట్ల నుంచి రూ. 4 వేల కోట్లకు పెంచామన్నారు. గతంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక రైతు ఆత్మహత్యలు తెలంగాణలోనే జరిగేవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల భారమే ఆత్మహత్యలకు కారణమని తేలడంతో కేవలం 60 రోజుల్లోనే 25,35,000 రైతు కుటుంబాలకు రూ.2లక్షల వరకు రూ. 20,616 కోట్ల రుణమాఫీ చేశామన్నారు.
ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద రుణమాఫీ అని, కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన ఎన్‌సీఆర్‌బీ (ఎన్‌సీఆర్‌బీ) 2024, 2025 నివేదికల ప్రకారం తెలంగాణలో రైతు ఆత్మహత్యల రేటు ‘సున్నా’కి పడిపోయాయన్నారు. పంటలకు మద్దతు ధరతో పాటు, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తున్నామని, పెట్టుబడి సహాయం కింద ఎకరాకు ఏడాదికి రూ. 12 వేలచొప్పున ‘రైతు భరోసా’ అందజేస్తున్నామని వివరించారు.
