ప్రభుత్వ స్కూళ్లలో చదివించడం తల్లిదండ్రులు చిన్నతనంగా భావించొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తమ హయాంలో విద్యా అవకాశాలు తక్కువగా ఉన్నా పట్టుదలతో చదువుకున్నాం. ప్రభుత్వ స్కూల్లో చదివిన నేనే ఇవాళ సీఎం అయ్యాను.. పీవీ నరసింహారావు లాంటి మహానుభావులు కూడా ప్రభుత్వ స్కూళ్లలోనే చదివారు. రేపు ఈ స్కూళ్లలో చదివే పిల్లలే దేశానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలి అని సీఎం ఆకాంక్షించారు.
రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో అత్యాధునిక పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆరుట్ల గ్రామం ఇప్పుడు రాష్ట్ర విద్యా రంగానికే ఒక పెద్ద స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అందుబాటులోకి వచ్చిన ఈ ఆరుట్ల స్కూల్‌లో.. ప్రస్తుతం 1814 మంది స్టూడెంట్స్ చదువుతుండటం విశేషం. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఇక్కడ సీట్లు దొరక్క అడ్మిషన్లు లేవనే బోర్డు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ పాఠశాలల స్థాయి ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లంటే అనాథలు చదివేవనే భావన ఉండేదని, కానీ ఇకపై ఆరుట్ల స్కూల్ తెలంగాణ మొత్తానికి ఆదర్శంగా నిలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 27 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుతున్నారని.. వారి భవిష్యత్తు కోసం ప్రభుత్వం విద్యాశాఖకు ఏకంగా 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని సీఎం తెలిపారు. బడ్జెట్‌లో విద్య కోసం ఎన్నడూ లేని విధంగా 8 శాతం నిధులను కేటాయించామని గుర్తుచేశారు. విద్యపై మేము పెట్టేది కేవలం ఖర్చు కాదు.. రేపటి తరం కోసం పెడుతున్న పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వ స్కూళ్లను పునర్నిర్మించాలని నిర్ణయించామని, అందుకోసమే ఆకునూరి మురళి నేతృత్వంలో విద్యా కమిషన్ వేశామని.. ఆయన ఎంతో శ్రమించి ప్రభుత్వానికి అద్భుతమైన నివేదిక ఇచ్చారని అభినందించారు.
ఇక నిరుద్యోగులకు కేవలం బ్లూ కాలర్ ఉద్యోగాలు మాత్రమే కాకుండా.. ఉన్నత స్థాయి అవకాశాలు రావాలంటే నైపుణ్యాలు పెరగాలని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని సీఎం తెలిపారు. ఇవి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయని.. అలాగే వచ్చే డిసెంబర్ 9వ తేదీన 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ'ని ప్రారంభించబోతున్నామని అధికారికంగా ప్రకటించారు.
క్రీడల ప్రాధాన్యతను వివరిస్తూ.. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించలేకపోతున్నామా అని ప్రశ్నించారు. అందుకే పిపిపి (PPP) పద్ధతిలో 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని నిర్మిస్తున్నామని, వచ్చే ఒలింపిక్స్‌లో మన తెలంగాణకు కచ్చితంగా గోల్డ్ మెడల్ వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ తీసుకురావాలని తాము ప్రయత్నిస్తే.. బుద్ధి లేని వారు దానిపై కూడా రాజకీయం చేస్తూ విమర్శలు కురిపించారని మండిపడ్డారు. విద్యే మన ఆత్మగౌరవం.. విద్యే మన భవిష్యత్తు అని, ఈ విద్యతోనే సమాజంలో మార్పు తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.
