నేడు( మే23) యాదగిరిగుట్టకు సీఎం

నేడు( మే23) యాదగిరిగుట్టకు సీఎం
  • వేద పాఠశాల సహా 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన 
  • కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి భూమిపూజ
  • కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు, పోలీసులు

యాదగిరిగుట్ట, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి శనివారం యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వేద పాఠశా లతో పాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేయనున్నారు.

శనివారం ఉదయం 8:30 గంటలకు ఆయన యాదగిరిగుట్టకు చేరుకుంటారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా టెంపుల్  సిటీలో రూ.43 కోట్లతో 15 ఎకరాల్లో నిర్మించనున్న లక్ష్మీనరసింహస్వామి వేద పాఠశాల, కొండపైన కల్యాణ మండపం, దీక్షాపరుల సదనం, కింది నుంచి కొండ పైకి మెట్ల మార్గంలో పైకప్పు ఏర్పాటు, వాయువ్య దిశ ద్వారా ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకోవడానికి ప్రత్యేక మెట్ల మార్గం నిర్మాణాలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేస్తారు.

దాదాపు రూ.100 కోట్లతో చేపట్టే ఈ పనులకు సంబంధించి టెంపుల్ సిటీలో ఒకే దగ్గర ఏర్పాటు చేసి న ఐదు శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొంటారు. 

11 గంటలకు తిరుగు ప్రయాణం

సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉదయం 8:30 గంటల కు హెలికాప్టర్​లో యాదగిరిగుట్టకు చేరుకుంటారు. యాగశాల ప్లేస్​లో ఉన్న హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్  ఘాట్ రోడ్డు మీదుగా ఉదయం 8:40 గంటల వరకు కొండపైకి చేరుకుంటుంది.

అనంతరం గర్భగుడిలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని 9:15 గంటల వరకు టెంపుల్ సిటీకి చేరుకుంటారు. అక్కడ 9:45 గంటల వరకు వేద పాఠశాలకు భూమిపూజ, మిగతా అభివృద్ధి పనులకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేస్తారు. 9:50 గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకుని అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. 10:45 గంటలకు హెలిప్యాడ్​కు చేరుకుని హైదరాబాద్  తిరుగు ప్రయాణం కానున్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే అయిలయ్య

సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శుక్రవారం పరిశీలించారు. ప్రొటో కాల్, భద్రతాపరంగా ఇబ్బందులు ఎదరుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచిం చారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్  యాదవ్ కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం పర్యటనకు పకడ్బందీగా భద్రతాఏర్పాట్లు చేశారు.