రూ.1674 కోట్ల పనులకు నేడు (జూన్ 08) సీఎం రేవంత్ శ్రీకారం

రూ.1674 కోట్ల పనులకు నేడు (జూన్ 08) సీఎం రేవంత్ శ్రీకారం
  • సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మాణానికి పునాది రాయి

హైదరాబాద్​, వెలుగు : ఐటీ కారిడార్‌‌తో పాటు పశ్చిమ హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడమే లక్ష్యంగా భారీ అభివృద్ధి పనులకు సోమవారం సీఎం రేవంత్​రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండీఏ, విద్యాశాఖ, ఆర్‌‌అండ్‌‌బీ ఆధ్వర్యంలో మొత్తం రూ.1674 కోట్ల వ్యయంతో పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. కొన్ని పనులను ప్రజలకు అంకితం చేయనున్నారు.

ప్రధానంగా మియాపూర్ ఎక్స్ రోడ్స్ నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్స్ వరకు 6 లేన్ల ఫ్లైఓవర్, హఫీజ్‌‌పేట, బాచుపల్లి అండర్‌‌పాస్‌‌ల నిర్మాణాలకు రూ.530 కోట్ల పనులకు శంకుస్థాపన జరగనుంది. అలాగే శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆర్‌‌ఓబీ (రూ.308 కోట్లు) పనులు కూడా ప్రారంభం కానున్నాయి. సీఎంసీ శాశ్వత కార్యాలయ భవనానికి (రూ.161 కోట్లు) కూడా సీఎం పునాది రాయి వేయనున్నారు. నార్సింగి వద్ద మూసీ నది వెంబడి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మేజర్ బ్రిడ్జి (రూ.229 కోట్లు), ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు పైప్‌‌లైన్ రోడ్డు (రూ.110 కోట్లు), గచ్చిబౌలి-నానక్‌‌రామ్‌‌గూడ ఓఆర్ఆర్ మెయిన్ క్యారేజ్‌‌వే విస్తరణ (రూ.26 కోట్లు), కొల్లూరు వద్ద రెండు ఆర్‌‌ఓబీ అప్రోచ్ ర్యాంపుల పనులకు (రూ.29 కోట్లు) శంకుస్థాపనలు జరగనున్నాయి.

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పుల కోసం రూ.200 కోట్లతో నిర్మించనున్న యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌‌ భవన సముదాయాలకు, అలాగే మాదాపూర్, నానక్‌‌రామ్‌‌గూడ ప్రాంతాల్లో రూ.14 కోట్లతో ఆర్‌‌అండ్‌‌బీ నిర్మించతలపెట్టిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లకు కూడా  సీఎం రేవంత్‌‌ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు పూర్తి కానున్నాయి.