- రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
- కేశాపూర్‌లో భారీ బహిరంగ సభ
నిజామాబాద్, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి నిజామాబాద్‌కు రానుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు నగర శివారులోని బైపాస్ రోడ్ సమీపంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కార్యక్రమాలను రూరల్ సెగ్మెంట్ పరిధిలో ఏర్పాటు చేశారు. నెల రోజుల కింద ఖరారైన రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం బర్దీపూర్ గ్రామంలో శంకుస్థాపనలు చేయనున్నారు. బోధన్, ఆర్మూర్, నిజామాబాద్‌లకు మంజూరైన రూ.600 కోట్ల విలువైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాల నిర్మాణాలు ఉన్నాయి.
116 ఎకరాల్లో నిర్మించనున్న అగ్రికల్చర్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి ఆడిటోరియం, పరిపాలనా భవనం, సైన్స్ ల్యాబ్స్, ఇండోర్ స్టేడియం, హాస్టల్ భవనాల నిర్మాణాలకూ శంకుస్థాపన చేస్తారు. రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించడంతో పాటు రూ.200 కోట్ల విలువైన లోన్లను స్వయం సహాయక సంఘాలకు సీఎం పంపిణీ చేయనున్నారు. అనంతరం కేశాపూర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో
సీఎం ప్రసంగించనున్నారు.
కట్టుదిట్టమైన బందోబస్తు..
సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 1200 మంది పోలీసులను బందోబస్తుకు నియమించారు. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం తాత్కాలిక హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. సభకు వచ్చే ప్రజల కోసం తాగునీటి సౌకర్యం, అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్‌ను సిద్ధంగా ఉంచారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తారు.
సీఎం కార్యక్రమాలు జరిగే రోడ్ల వైపు వాహనాలు రాకుండా నగర నాలుగు దిక్కులా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పోలీస్ క్విక్ రెస్పాన్స్ టీంలను అప్రమత్తంగా ఉంచారు. సీపీ సాయిచైతన్య గురువారం భద్రతా ఏర్పాట్లను సమీక్షించి పోలీసు అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు బస్వరెడ్డి, రాంచంద్రరావు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
