ఢిల్లీ మే సవాల్... రెండు రోజులు అక్కడే సీఎం రేవంత్‌‌‌‌ మకాం.. మెట్రో లోన్ లొల్లి, ఫేజ్-2 అనుమతులపై కేంద్రంతో తాడోపేడో

ఢిల్లీ మే సవాల్... రెండు రోజులు అక్కడే సీఎం రేవంత్‌‌‌‌ మకాం.. మెట్రో లోన్ లొల్లి, ఫేజ్-2 అనుమతులపై కేంద్రంతో తాడోపేడో
  • కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయం
  • యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోటా పెంపు, యూరియా సకాలంలో సప్లై చేయాలని ఒత్తిడి 
  • అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇప్పించాలని, రాష్ట్రం కోసం కలిసి రావాలని కేంద్రమంత్రి కిషన్‌‌‌‌రెడ్డిని కోరిన సీఎం 
  • రాయదుర్గం ల్యాండ్ ఇష్యూలో ఎస్‌‌‌‌బీఐ తీరుపైనా పీఎం, ఆర్థిక శాఖ మంత్రి, ఆర్బీఐకి ఫిర్యాదు!

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర  ప్రయోజనాల కోసం  సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ఢిల్లీ బాటపట్టారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే కూతురు వివాహానికి ముంబైలో ఆదివారం అటెండ్​ అయిన సీఎం.. సాయంత్రం అటు నుంచే ఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజులు అక్కడే మకాం వేసి.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకోనున్నారు. మెట్రో ఫేజ్–1 టేకోవర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఐఆర్ఎఫ్‌‌‌‌సీ  లోన్ వివాదం, మెట్రో ఫేజ్ 2 విస్తరణ అనుమతులపై ఈ పర్యటనలో ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. 

ఇక యాసంగిలో సేకరించిన ధాన్యం కొనుగోళ్ల కోటాను ఇంకో 20 లక్షల టన్నులు పెంచడంతోపాటు రాష్ట్రానికి అవసరమైన యూరియా కోటాను ఎప్పటికప్పుడు సప్లై చేయాలని, రామగుండం ఉత్పత్తిని పూర్తిగా తెలంగాణకే కేటాయించాలనే   ప్రధాన డిమాండ్లతో వ్యవసాయ, ఫర్టిలైజర్, రైల్వే, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను కలవనున్నారు. ఈ పర్యటన విజయవంతం కావడానికి, కేంద్ర మంత్రుల అపాయింట్‌‌‌‌మెంట్లు ఇప్పించడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డిని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి కోరారు. 

అలాగే, వివాదాస్పదమైన రాయదుర్గం ల్యాండ్ ఇష్యూలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌‌‌బీఐ) వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవడంతో ఈసారి సీఎం ఢిల్లీ పర్యటన రాజకీయంగా, పరిపాలనాపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. 

గత కొన్ని రోజులుగా ఐఆర్ఎఫ్‌‌సీ రుణాల విషయమై కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డికి, సీఎం రేవంత్‌‌రెడ్డికి మధ్య లేఖల యుద్ధం జరుగుతున్నది.  హైదరాబాద్ మెట్రో మొదటి దశను ఎల్‌‌అండ్‌‌టీ నుంచి  స్వాధీనం చేసుకోవడంలో  భాగంగా రూ.13,527 కోట్ల రీ ఫైనాన్సింగ్‌‌కు అన్ని ఒప్పందాలు అయ్యాక ఐఆర్‌‌‌‌ఎఫ్‌‌సీ బ్రేక్​ వేసింది. ఇందుకు పట్టణాభివృద్ధి శాఖ పెట్టిన నిబంధనను సాకుగా చూపెడుతున్నది. అందులో మెట్రో టికెటింగ్​, యాడ్స్​తో వచ్చిన ఆదాయాన్ని ముందుగా మెట్రో నిర్వహణకే (ఓఅండ్​ఎం) వినియోగించాలని, రాష్ట్ర ప్రభుత్వం లోన్​ రిపేమెంట్​ ఫస్ట్​ ప్రయారిటీ గా పెట్టిందని.. అందుకే రుణం నిలిచిపోయిందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి చెబుతున్నారు. అయితే ఐఆర్‌‌‌‌ఎఫ్‌‌సీ నుంచి మాత్రం లిఖితపూర్వకంగా ఎలాంటి అభ్యంతరం రాలేదు. 

ముందు ఓకే చెప్పి ఇప్పుడు సాంకేతిక కారణాలు చెప్పడంపై  అటు పట్టణాభివృద్ధి శాఖ, ఇటు రైల్వే శాఖ మంత్రి ఇద్దరిని కలిసి ముఖాముఖి చర్చలతోనే సమస్యను పరిష్కరించాలని సీఎం రేవంత్‌‌రెడ్డి నిర్ణయించారు. ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా? అనే దానిని కూడా సీఎం స్పష్టత తీసుకోనున్నారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రుల అపాయింట్‌‌మెంట్​ ఇప్పించడంతో పాటు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌‌రెడ్డి కూడా తనతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.  జూన్ 15 కల్లా ఈ నిధులు అందాల్సి ఉన్నది. రాష్ట్రప్రభుత్వం తన వాటా కింద ఇప్పటికే రూ.1,400 కోట్లను, ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.84 కోట్లు చెల్లించింది. 

కీలకమైన మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అనుమతులు సాధించడం ఈ పర్యటనలో మరో ముఖ్యమైన అంశం. శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్ కనెక్టివిటీ సహా పాతబస్తీ, ఇతర శివారు ప్రాంతాలకు మెట్రో విస్తరణకు సంబంధించిన సమగ్ర నివేదికను కేంద్ర మంత్రి ముందు ఉంచనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన కేంద్ర వాటా నిధులు, అనుమతులను త్వరగా మంజూరు చేయాలని ఒత్తిడి తీసుకురానున్నారు. 

మెట్రో విస్తరణ ఆలస్యమైతే నిర్మాణ వ్యయం పెరిగి రాష్ట్రంపై భారం పడుతుందని, అందుకే వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదుగుతున్న క్రమంలో, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర సహకారం ఎంతో అవసరమని సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీ ద్వారా స్పష్టం చేయనున్నారు.  

రామగుండం యూరియా మొత్తం తెలంగాణకే ఇవ్వాలి

ఇక వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలకమైన డిమాండ్లపై కేంద్ర వ్యవసాయ, ఎరువుల శాఖల మంత్రులతో సీఎం రేవంత్‌‌రెడ్డి భేటీ కానున్నారు. ముఖ్యంగా యాసంగి సీజన్‌‌లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 80 లక్షల  టన్నులకు పైగా ధాన్యం సేకరించిన నేపథ్యంలో, కేంద్రం తీసుకునే 52 లక్షల టన్నుల కోటాను మరో 20 లక్షల టన్నుల మేర పెంచాలని కోరనున్నారు. దీంతోపాటు  వానాకాలం సీజన్​ ప్రారంభమైనందున రైతులకు  యూరియా కొరత రాకుండా ముందస్తుగా యూరియా కోటాను  సరైన సమయానికి సప్లై చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. 

ఇప్పటికే ప్రతినెలా 2 లక్షల  టన్నుల చొప్పున ఈ నెలతో కలిపి 3 నెలల్లో 6 లక్షల టన్నులకుగాను సగమే సప్లై అయింది. దీంతో సీజన్‌‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి అవసరమైన యూరియా, ఇతర రసాయన ఎరువుల కోటాను తక్షణమే పెంచి, ముందస్తుగా సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు,-ఎరువుల శాఖ మంత్రిని కోరనున్నారు. గతంలో ఎరువుల కొరత వల్ల రైతాంగం ఎదుర్కొన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

రామగుండం నుంచి ఉత్పత్తి అవుతున్న మొత్తం యూరియాను రాష్ట్రానికే కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచి పంపడం వల్ల రవాణా భారం కూడా తగ్గుతుందని వివరించనున్నారు.  ధాన్యం కొనుగోళ్లలో, యూరియా కేటాయింపుల్లో కేంద్రం చూపిస్తున్న పక్షపాత వైఖరిని సరిదిద్దకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. 

హైకమాండ్ పెద్దలతోనూ భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ పెద్దలతోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమయం కోరినట్లు తెలిసింది. అలాగే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీని కలవనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను హైకమాండ్ పెద్దలకు వివరించనున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ, శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నందున ఈ అంశాలపై చర్చించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఎస్​బీఐ పొలిటికల్​ వైఖరిపైనా ఫిర్యాదు

ఐటీ కారిడార్‌‌‌‌లోని రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో ఎస్‌‌‌‌బీఐ వైఖరి, దాని వెనుక రాజకీయాలపై సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పీఎం, ఆర్థిక శాఖ మంత్రి, ఆర్బీఐ గవర్నర్‌‌‌‌‌‌‌‌కు కంప్లైంట్ చేయనున్నట్టు తెలుస్తోంది. 2010లో అప్పటి ఎస్‌‌‌‌బీహెచ్‌‌‌‌ (ప్రస్తుత ఎస్‌‌‌‌బీఐ) కార్యాలయ నిర్మాణం కోసం రాయదుర్గం సర్వే నం. 83/1లో రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేవలం రూ.13.30 కోట్లకే కేటాయించింది. 

అయితే నిబంధనల ప్రకారం రెండేండ్లలో నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నా, ఎస్‌‌‌‌బీఐ 16 ఏండ్లుగా కాలయాపన చేయడంతో 2021లో ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసింది. అయినా మానవతా దృక్పథంతో ఉస్మాన్‌‌‌‌నగర్‌‌‌‌లో ప్రస్తుతం రూ.500 కోట్ల విలువైన 2.50 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మొదట దీనికి మౌఖిక అంగీకారం తెలిపిన ఎస్‌‌‌‌బీఐ అధికారులు, ఆ తర్వాత రాజకీయ ఒత్తిళ్లతో మనసు మార్చుకుని కోర్టును ఆశ్రయించారని ప్రభుత్వం భావిస్తోంది. 

ముఖ్యంగా తెలంగాణవాసి అయిన ఎస్‌‌‌‌బీఐ చైర్మన్ సీఎస్‌‌‌‌ శెట్టి స్థానిక రాజకీయాల ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని.. దీనిపై ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌కు క్షేత్రస్థాయి ఆధారాలతో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి స్వయంగా ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.