- హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను తిప్పికొట్టాలి: సీఎం రేవంత్
- నాంపల్లి హజ్ హౌస్‌లో హజ్ యాత్రికుల బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: ‘సర్’ పేరుతో ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టు తెలంగాణలో జరగనివ్వబోమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అందరం కలిసికట్టుగా ఉంటూ అభివృద్ధిలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నాంపల్లి హజ్ హౌస్‌లో హజ్ యాత్రికుల బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మైనారిటీల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు.
రాష్ట్రంలో హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇరాన్ -–అమెరికా యుద్ధం వల్ల విమాన ఇంధన చార్జీలు పెరిగినా, ఆ భారం హజ్ యాత్రికులపై పడకుండా తెలంగాణ ప్రభుత్వమే ఆ ఖర్చును భరిస్తున్నదని తెలిపారు. నిరుడు హజ్ యాత్రలో బస్సు ప్రమాదానికి గురైనప్పుడు బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించి ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలోనూ మైనారిటీలకు దక్కాల్సిన వాటాను ఏమాత్రం తగ్గకుండా అందజేస్తామని, విదేశీ విద్య కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లను కూడా అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
ప్రస్తుతం వైట్ కాలర్ ఉద్యోగాల కంటే బ్లూ కాలర్ జాబ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నదని, అందుకే ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని వివరించారు. జర్మనీ, జపాన్‌లాంటి దేశాల్లో ఉన్న అపారమైన ఉద్యోగావకాశాలను మైనారిటీ యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
భూ లభ్యత ఉన్న చోట ఖబరస్తాన్లకు స్థలాలు
అంతకుముందు సెక్రటేరియెట్‌లో మైనార్టీ సంక్షేమంపై సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ చేశారు. మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయడంతోపాటు వారికి ఏఐ లాంటి అత్యాధునిక నైపుణ్య కోర్సులను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా మైనారిటీ యువత జీవనోపాధికి భరోసానిచ్చే వృత్తి విద్యా కోర్సులకే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తరహాలోనే మైనారిటీ విద్యార్థులకు కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు ఒక పటిష్టమైన కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు.
గ్రూప్-1, 2, 3 పరీక్షల్లో ఎంపికైన మైనారిటీ అభ్యర్థులకు మైనారిటీ సంక్షేమ శాఖలో బాధ్యతలు అప్పగించి, ఆ శాఖ పనితీరుపై వారిని నిపుణులుగా తీర్చిదిద్దాలన్నారు. ఇకపై ఇమామ్, మౌజమ్‌ల గౌరవ పారితోషికాలను ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి నెలా సకాలంలో విడుదల చేయాలని స్పష్టం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా అక్కడ గుడితోపాటు మసీదు, చర్చి, గురుద్వారాను నిర్మించాలని నిర్ణయించామన్నారు.ఈ కట్టడాలు కేవలం నిర్మాణాలుగానే కాకుండా.. తెలంగాణకు గర్వకారణమైన ‘గంగా జమునా తెహజీబ్’ను, మన విశిష్ట సంస్కృతిని ప్రపంచానికి చాటేలా గొప్ప అధ్యయన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు.
అలాగే, భూ లభ్యత ఉన్న చోట ఖబరస్తాన్లకు స్థలాలు కేటాయించనున్నట్టు తెలిపారు. నగరంలోని ఆటో డ్రైవర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఇంజిన్లతో ‘రెట్రో ఫిట్టింగ్’ చేయడం ద్వారా ఆటో డ్రైవర్లపై ఇంధన భారాన్ని పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సమీక్షలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, టీజీఎంఆర్ఈఐఎస్ ప్రెసిడెంట్ మహ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ, హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులామ్ అఫ్జల్ బియాబాని, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ తదితరులు పాల్గొన్నారు.
