- 22, 23న ఢిల్లీలోనే ఉంటా.. ఇద్దరం కలిసి రైల్వే మంత్రి దగ్గరకు వెళ్దాం
- కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ
- మెట్రో ఫేజ్-2 పనులు, ఐఆర్‌ఎఫ్‌సీ నిధులపై చర్చిద్దామని వెల్లడి
- రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చే ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై చర్చించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 22, 23వ తేదీల్లో తాను ఢిల్లీలోనే ఉంటానని, ఇద్దరం కలిసి రైల్వే మంత్రితో భేటీ అయ్యేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌కు అత్యంత కీలకమైన మెట్రో ఫేజ్–-2 పనులు, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) నిధుల సమకూర్పుపై సుదీర్ఘంగా చర్చించేందుకు వీలుగా తక్షణమే ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చే ఈ మౌలిక వసతుల ప్రాజెక్టు పెండింగ్ అంశాల పరిష్కారానికి కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో స్పష్టం చేశారు. కేంద్ర మంత్రితో జరిగే ఈ కీలక భేటీ సమయానికి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల ఒప్పంద పత్రాలు, సమగ్ర నివేదికలు, అవసరమైన సాంకేతిక వివరాల కాపీలను స్వయంగా తానే తీసుకువస్తానని సీఎం పేర్కొన్నారు. మెట్రో రైలు రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు అయినందున, పెండింగ్ అంశాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం అవసరమని లేఖలో వివరించారు. రైల్వే శాఖతో సమావేశం ఏర్పాటుకు సంబంధించిన వివరాలను తనకు వీలైనంత త్వరగా తెలియజేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
