
సికింద్రాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న రేవంత్ . సికింద్రాబాద్ లో ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లో దానం నాగేందర్ గెలిస్తే కేంద్రంలో కీలక పదవి ఇప్పించే భాద్యత తనదేనన్నారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. జంట నగరాలు వరదల్లో మునిగితే కిషన్ రెడ్డి ఎక్కడికిపోయారని అన్నారు. కేంద్రం నుంచి కిషన్ రెడ్డి పైసా వరద సాయం తేలేదన్నారు.
గ్రేటర్ సిటీకి మెట్రో, కృష్ణా గోదావరి నీటిని తెచ్చిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ సికింద్రాబాద్ టికెట్ ను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ పద్మారావును ఓడించి కవితకు బెయిల్ తెచ్చుకుంటారని విమర్శించారు. పద్మారావు నామినేషన్ కు కేసీఆర్, కేటీఆర్ ఎందుక రాలేదో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి లాభం జరుగుతుందన్నారు. బస్తీలు బాగుపడాలంటే కాంగ్రెస్ కు ఓటెయ్యాలని చెప్పారు. సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీ మురికి వాడలో వేసినట్లేనని విమర్శించారు.
నిరుద్యోగులను ,రైతులను ప్రధాని మోసం చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏటా 20 లక్షల జాబ్ లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఓటమి భయంతో మోదీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో మతసామరస్యం వెల్లివిరిసిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే మతసామరస్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సికింద్రబాద్ లో దానం నాగేందర్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు రేవంత్.